Medicines Price Hike | నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) ఎనిమిది ఔషధాల పదకొండు షెడ్యూల్డ్ కాంపౌండ్స్ ధరలను 50 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. ప్రజారోగ్య అవసరాల కోసం ఔషధాల నిరంతర లభ్యతను నిర్ధారించడం లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు నప్పా పేర్కొంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. అక్టోబర్ 8న జరిగిన అథారిటీ సమావేశంలో డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఆర్డర్, 2013లోని పారా 19 కింద మంజూరు చేయబడిన అసాధారణ అధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నప్పా పేర్కొంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాల (APIs) పెరుగుతున్న ఖర్చులు, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా ధరలను సవరించాలని ఔషధ తయారీదారులు కోరారు. ఈ క్రమంలో ధరలను పెంచింది.
ఆస్తమా, గ్లకోమా, తలసేమియా, క్షయ, మానసిక ఆరోగ్య రుగ్మతలు తదితర చికిత్సల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఔషధాల ధరలు పెరగనున్నాయి. పెరిగిన మందుల జాబితాలో మందుల జాబితాలో Benzyl Penicillin 10 Lakh IU Injection, అట్రోపిన్ ఇంజెక్షన్ 0.6 mg/ml, స్ట్రెప్టోమైసిన్ పౌడర్ ఫర్ ఇంజెక్షన్ (750 mg And 1000 mg) Salbutamol ట్యాబ్‌లెట్స్ (2 mg Abd 4 mg), రెస్పిరేటర్ సొల్యూషన్ (5 mg), Pilocarpine Drops, Cefadroxil Tablet 500 mg, Desferrioxamine 500 mg for Injection, లిథియం టాబ్లెట్ 300 mg మందుల ధరలు 50శాతం పెరిగాయి. పెంచిన ధరలు తక్షణం అమలులోకి వస్తాయని నప్పా పేర్కొంది. మందుల ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతికి చెందిన వారిపై భారం పడనున్నది. ఆయా వ్యాధుల బారినపడ్డ వారిలో ఎక్కువగా పేద, మధ్య తరగతులకు చెందిన వారేనని పలువురు పేర్కొంటున్నారు. బైపోలార్ డిజార్డర్, ఆస్తమా, గ్లకోమా, తలసీమియా తదితర వ్యాధులతో బాధపడుతున్న వారిలో లక్షలాది మంది నిరుపేదలు ఉన్నారు. వీరంతా ఆయా మందులను వాడుతూ వ్యాధుల నుంచి ఊరట పొందుతున్నారు. అయితే, ధరల పెరుగుదల కారణంగా వీరిపై అదనపు భారపడనున్నది. ఫలితంగా ఆర్థికంగా మరింత ఇబ్బందులుపడే అవకాశం ఉందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.