అభివృద్దికి ఇప్పుడు సంతానోత్పత్తి కీలకం : ఏపీ సీఎం చంద్రబాబు

రాష్ట్రాభివృద్ధికి జనాభా పెరుగుదల అవసరమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీ కొత్త పాపులేషన్ పాలసీ ప్రకటిస్తూ “ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు” నినాదం ఇచ్చారు.

chandrababu

అమరావతి : దేశంతో పాటు రాష్ట్రాభివృద్దికి సంతానోత్పత్తి రేటు పెరుగాల్సి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు అనే నినాదాన్ని వినిపించారు. గురువారం అసెంబ్లీలో ఏపీ పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2023 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారని, 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దేశంలో కంటే రాష్ట్రంలో వృద్ధాప్యం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది అని, సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంటే సుస్థిర ప్రగతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ కుటుంబ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చాం అని..ఇక మీదట సంతానోత్పత్తి ప్రోత్సహాకాలు అందిస్తామని ప్రకటించారు.

ఫ్యామిలీ ప్లానింగ్‌ పాలసీ ఇప్పుడు అసంబద్ధమైందని, నా మాటల్ని గతంలో వ్యతిరేకించిన జేపీ వంటి వారు ఇప్పుడు సమర్థించారని గుర్తు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మోహన్‌ భగవత్‌ కూడా పాపులేషన్‌ పెంచాలని అంటున్నారు అని, యూపీ, బిహార్‌లో మాత్రమే దేశంలో అత్యధిక జనాభా ఉంది అని, దక్షిణ భారత దేశంలో జనాభా తక్కువగా ఉందని, జనాభా తగ్గడం వల్ల రాజకీయంగానూ, చట్ట సభలలో ప్రాతినిథ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని, అయితే ఈ సమయంలో నేను రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు అని స్పష్టం చేశారు.

ఏప్రిల్ 1నుంచి కొత్త పాపులేషన్ పాలసీ

ఉమ్మడి రాష్ట్రంలో 1997లో ఏపీ పాపులేషన్‌ పాలసీ తీసుకొచ్చాం అని, మన వద్ద 1992లో సంతానోత్పత్తి(టీఎఫ్‌ఆర్‌) 3శాతం ఉండగా ఇప్పుడు 1.5కు వచ్చింది అని చంద్రబాబు వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడులో 1.4శాతం, కేరళలో 1.6శాతం, బిహార్‌లో 3 శాతం టీఎఫ్‌ఆర్‌ ఉంది అని తెలిపారు. 57 శాతం మంది ఒక్క బిడ్డతోనే కనడం ఆపివేస్తున్నారు అని, 32 శాతం మంది ఇద్దరిని కంటున్నారని, 9శాతం మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో వృద్దుల జనాభా 60 ఏళ్లు దాటినవారు 10 శాతం మంది ఉన్నారని, 2047 నాటికి ఇది 23 శాతానికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రంలో కొత్త పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ అమలు చేస్తామని, దేశంలోనే కొత్త పాపులేషన్ పాలసీని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చంద్రబాబు తెలిపారు. 1.5గా ఉన్న సంతానోత్పత్తి రేటును 2.1కు తీసుకెళ్లడం మన లక్ష్యం అని ప్రకటించారు. ఇప్పటికే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది అని, మారుతున్న పరిస్థితులు, కాలానికి తగ్గట్టు ప్రభుత్వ విధానాలు ఉండాలని స్పష్టం చేశారు. ప్రజల అందరి అభిప్రాయం తీసుకునేందుకు గానూ ఆన్‌లైన్‌లో ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ పాలసీ డాక్యుమెంట్ ఉంచుతాం.
దీనిపై ప్రతీ నియోజకవర్గంలో నెల రోజుల పాటు ఎమ్మెల్యేలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి చర్చించాలి అని, ఈ నెలాఖరు కల్లా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీకి తుదిరూపం ఇచ్చి ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించాం అని తెలిపారు.

గేమ్ ఛేంజర్ గా నగదు ప్రోత్సాహకం

సంతానోత్పత్తి రేటు పెంపు లక్ష్యాల సాధనకు .. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ.25వేలు ఇస్తాం అని..మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ పేరిట డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదన చేస్తున్నాం అని, మూడో సంతానానికి 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం, 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం అని కూడా తెలిపారు. ఈ నగదు పురస్కారం గేమ్‌ ఛేంజర్‌ కానుందని భావిస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు అని మాట్లాడాలని చంద్రబాబు సూచించారు. శాసనసభలో చర్చ జరిగితే విభిన్న అభిప్రాయాలు వచ్చాయని, లేదంటే ఆ అభిప్రాయాలు ఎలా తెలుస్తాయి? అన్నారు. ఇప్పటికీ పేద వర్గాల వారే ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు. అందుకే తల్లికి వందనం పథకం అందరికీ ఇచ్చాం. డబ్బులు ఉన్నవారు ఎందుకు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండేలా చూస్తాం అని, ఒక జంటకు కనీసం ఇద్దరు పిల్లలుండాలి. ముగ్గురు పిల్లల్ని కంటే ఇంకా మంచిది అని తెలిపారు. మూడో సంతానం, ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్ ఇస్తామని పేర్కొన్నారు. రెండో బిడ్డను కన్న తండ్రికి ఒక నెల, మూడో బిడ్డను కన్న తండ్రికి 2 నెలలు సెలవు మంజూరు చేస్తాం అని చంద్రబాబు చెప్పారు.

త్వరలో తల్లి దండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తాం అని వెల్లడించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా చైల్డ్ కేర్ టేకర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం అని, వైద్య సేవలు అందించేందుకు డిజిటల్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తాం అని, రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థకు డిజిటల్ నెర్వ్ సిస్టమ్ ను ప్రాజెక్ట్ సంజీవని పేరిట రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్లుగా తెలిపారు. 50 మంది చిన్నారులు ఉంటే చైల్డ్ కేర్ సెంటర్లు, పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం అని తెలిపారు.

వారి సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షీ క్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. విశాఖపట్నంలో రూ.172 కోట్లతో వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌ నిర్మాణం చేపడుతున్నాం అని తెలిపారు. ఏ ప్రాంతంలో మహిళా ఉద్యోగులు పనిచేస్తారో అక్కడ కొత్తగా వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు. 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల జనాభా 23 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం అని, వృద్ధుల సంరక్షణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. 175 సీహెచ్‌సీలలో రెండు వారాలకు ఒకసారి ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తాం అన్నారు. సిల్వర్ స్కిల్స్ రిజిస్ట్రీ ద్వారా 50,000 రిటైర్డ్ ప్రొఫెషనల్స్‌ను మెంటరింగ్‌లో భాగం చేస్తాం అని, రిటైర్మెంట్‌కు ముందే ఉద్యోగులకు 15 రోజుల వెల్‌నెస్ లీవ్, రూ.50,000 ఆరోగ్య నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ఏడాది జూలై నాటికి 5.2 కోట్ల ప్రజల ఆరోగ్య వివరాలను 2,086 ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానిస్తాం అని, రాష్ట్రంలో 71 లక్షల హై-రిస్క్ కేసుల గుర్తించి, మెరుగైన వైద్య సేవలు అందిస్తాం అని, 5.2 కోట్ల ప్రజల హెల్త్ రికార్డ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతాం అని చంద్రబాబు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి :

Teenage Pregnancies : టీనేజ్ ప్రెగ్నెన్సీ టెన్షన్…టాప్ త్రీలో ఏపీ !
Revanth Reddy Amit Shah Meeting | ఐపీఎస్ ల కేడర్ సంఖ్య పెంచండి : అమిత్ షాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

Latest News