జనం దృష్టి మళ్లించే యత్నం

కాంగ్రెస్‌ గెలిస్తే మంగళసూత్రాలు, భూములు గుంజుకుని వాటిని ‘చొరబాటు దారులకు’, ‘అధిక సంతానం’ ఉన్న వారికి పంచిపెడతారంటూ ఆదివారం రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి

  • Publish Date - April 22, 2024 / 08:38 PM IST

మోదీ వ్యాఖ్యలపై విపక్షం అభ్యంతరం
నిస్పృహను చాటుతున్న వ్యాఖ్యలు
ప్రధానిపై ఇండియా నేతల ఆగ్రహం
సామాజిక మాధ్యమాల్లోనూ చర్చ
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ గెలిస్తే మంగళసూత్రాలు, భూములు గుంజుకుని వాటిని ‘చొరబాటు దారులకు’, ‘అధిక సంతానం’ ఉన్న వారికి పంచిపెడతారంటూ ఆదివారం రాజస్థాన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. మోదీ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెడుతూ.. మోదీ వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగమేనని అన్నారు. తొలిదశ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందనే భయంతోనే మోదీ ప్రసంగం ఉన్నదని పేర్కొన్నారు. మోదీ విద్వేష ప్రసంగం చేయడమే కాదు.. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కూడానని పేర్కొన్నారు. 140 కోట్ల మంది ప్రజలు ఇంకా మోదీ మోసపూరిత మాటలకు బలిపశువులు కాబోరని అన్నారు.
తమ మ్యానిఫెస్టో ప్రతి ఒక్క భారతీయుడిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిందని తెలిపారు. ఇది అందరికీ సమ న్యాయాన్ని కోరుతుందని పేర్కొన్నారు. నిరంకుశ ప్రభువు నిస్పృహను మోదీ ప్రసంగం చాటుతున్నదని సీపీఎం వ్యాఖ్యానించింది. ‘ఎలాంటి జాప్యం లేకుండా ప్రధానిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి. మోదీ.. సిగ్గు చేటు. మీరు మాట్లాడే మాటలు ఓట్ల కోసం ఒక మతాన్ని రెచ్చగొట్టి, విద్వేషాలు రేపే మతోన్మాదుల భాషను తలపిస్తున్నాయి. మీ మాటలు మీ నిస్పృహను చాటుతున్నాయి’ అని వ్యాఖ్యానించింది. మోదీ ప్రసంగం విద్వేషపూరితం, పాశవికంగా ఉన్నాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. దీనిపై ఎన్నికల సంఘం మౌనంగా ఉండటం మరీ ఘోరమని అని ఎక్స్‌ వేదికగా స్పందించారు.
ముస్లింలను చొరబాటుదారులుగా ప్రధాని అభివర్ణించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. ‘మోదీ ఈ రోజు ముస్లింలను చొరబాటుదారులుగా, అధిక సంతానం ఉన్న మనుషులుగా మాట్లాడారు. 2002 నుంచి ఈ రోజు వరకూ మోదీ ఏకైక గ్యారెంటీ ముస్లింలను దూషించి, ఓట్లు పొందటం. దేశం సంపద గురించి మాట్లాడేవారు మోదీ పాలనలో భారతదేశ సంపదపై మొదటి హక్కు ఆయన సంపన్న స్నేహితులదేనని తెలుసుకోవాలి. దేశంలోని 40 శాతం సంపదను ఒక శాతం భారతీయులదే. ఒకవైపు ముస్లింల సంపదను ఇతరులు ఆస్తులు పెంచుకోవడానికి ఉపయోగిస్తూ మరోవైపు సాధారణ హిందువులు వారికి భయపడేటట్టు చేస్తున్నారు’ అని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
ఏప్రిల్‌ 19న జరిగిన తొలి విడత పోలింగ్‌పై మోదీ నిరుత్సాహంగా ఉన్నారని, అందుకే ఆయన అబద్ధాల స్థాయిని పెంచారని, తద్వారా ప్రజల దృష్టిని మళ్లించాలనుకుంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ విప్లవాత్మక మ్యానిఫెస్టోకు విశేష మద్దతు రావడం ప్రారంభమైందని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు దేశం తాను ఎదుర్కొంటున్ననిరుద్యోగం, తన కుటుంబం, తన భవిష్యత్తు అంశాల ఆధారంగా ఓటు చేస్తుంది. ఇక ఇండియా దారి తప్పదు’ అని ఆయన పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రధాని ప్రసంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాము ప్రధాని ప్రసంగంపై ఎన్నికల సంఘానికి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసినట్టు కొందరు పేర్కొన్నారు. కొందరు ఆన్‌లైన్‌లో ఈసీని ఉద్దేశించి సిగ్నేచర్‌ పిటిషన్‌ను కూడా ప్రారంభించారు. ఏప్రిల్‌ 21, 2024న రాజస్థాన్‌లోని బన్స్వారాలో చేసిన విద్వేష ప్రసంగం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నదని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలని తాను దరఖాస్తు చేసినట్టు ఆర్టీఐ కార్యకర్త అజయ్‌బోస్‌ తెలిపారు. ఇంత జరుగుతున్నా.. మోదీ మాత్రం సోమవారం కూడా అవే వ్యాఖ్యలను పునరుద్ఘటించడం విశేషం.

Latest News