ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
ఎన్డీఏ అంటే ఒక సుపరిపాలన.. భారత్ ఆత్మ : ప్రధాని మోదీ
విధాత: ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష నేతగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఎన్డీఏ ఎంపీలు ఢిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలు ఎన్డీఏ పక్ష నేత పదవికి మోదీ పేరును ప్రతిపాదించగా మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, జేడీయూ నేత, సీఎం నితీశ్‌కుమార్ సహా ఈ సమావేశానికి 240 మంది బీజేపీ ఎంపీలతోపాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి (రాంవిలాస్), ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు.
అనంతరం చంద్రబాబు, సీఎం నీతీశ్ కుమార్ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసేందుకు వెళ్లారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. మోదీ తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. ఎన్డీఏకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోదీని రాష్ట్రపతి ఆహ్వానించడం లాంచనమేకానుంది.
ఎన్డీఏ అంటే ఒక సుపరిపాలన : మోదీ
ఎన్డీఏ అంటే ఒక సుపరిపాలన అని, ఎన్డీఏ కూటమి భారత్ ఆత్మకు ప్రతీక అని, దేశం కోసం ఈ కూటమి క్షేత్ర స్తాయి వరకు వెళ్లి పనిచేస్తుందని ఫోటోలకు ఫోజులు ఇచ్చి చేతులు ఊపి ఎవరిదారు వారు చూసుకునే రకం కాదని ఎన్డీఏ పక్ష నేత నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే కూటమి కట్టి గెలుపు సాధించడం ఒక చరిత్ర అని, ఎన్డీఏ ఒక విజయవంతమైన కూటమి అని పేర్కోన్నారు. 30ఏళ్లలో ఈ దేశాన్ని మూడుసార్లు పాలించిన ఎన్డీఏ కూటమి నాల్గవ సారి దేశాన్ని పాలించబోతుందన్నారు. మినిమమ్ గవర్నమెంట్..మాగ్జిమమ్ గవర్నెన్స్ కూటమి స్ఫూర్తి అని పేర్కోన్నారు. ఎన్డీఏ లోను ప్రతి ఎంపీ నాకు సమానమేనని, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నానన్నారు. మీరిచ్చిన ఈ నాయకత్వ బాధ్యతతో మన మధ్య విశ్వాస బంధాన్ని చాటుతుందని మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేన్నారు. నాకు ఇవి భావోద్వేగ క్షణాలని చెప్పారు.
దేశంలో 22రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయని, భారత దేశ స్ఫూర్తితకి ఎన్డీఏ కూటమి ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఆదివాసీలు అధికంగా ఉన్న పది రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాల్లో ఎన్డీఏ పాలన సాగుతుందన్నారు. దేశంలో ఇటీవల కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని అంతే త్వరగా ఆ ప్రభుత్వాలు ప్రజా విశ్వాసం కోల్పోయాయని, ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఎన్డీఏను ఆదరించారని గుర్తు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించిందని, అక్కడి ప్రజలు అతిపెద్ద బహుమతి ఇచ్చారని, మన సమక్షంలోనే పవన్ కల్యాణ్ ఉన్నారని, పవన్ అంటే పవనం కాదు ఒక సునామి అని పేర్కోన్నారు. మోదీ తన ప్రసంగంలో పదేళ్లలో సాధించిన విజయాలు..ఎదుర్కోన్న సవాళ్లను గుర్తు చేసుకున్నారు.
సరైన సమయంలో భారత్‌కు సరైన నాయకత్వమే మోదీ : చంద్రబాబు
సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్‌కు మోదీ రూపంలో అందివచ్చిందని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోదీ ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని, ప్రచారం మొదటి రోజు నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో పనిచేశారన్నారు. ఏపీలోనూ 3 బహిరంగసభలు, ర్యాలీల్లో పాల్గొన్నారని, కూటమి రాష్ట్రంలో 90 శాతం స్థానాలు గెలిచి చరిత్రాక విజయం సాధించిందన్నారు. ఎన్డీఏతో మా పార్టీ నేత ఎన్డీఆర్ ఆది నుంచి ఉన్నారని, ఆయన నమ్మిన ఇజం.. హ్యూమనిజమని అదే స్ఫూర్తితో మోదీ ముందుకెలుతామన్నారు.
విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధిలో ముందుందని, దూరదృష్టి కలిగిన మోదీ.. ఆర్ధిక వ్యవస్థను పరుగులు తీయించారని, భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని గుర్తు చేశారు. సరైన సమయంలో సరైన వ్యక్తి ప్రధాని కావడంతో దేశం పురోభివృద్ధి సాదించిందని, మేకిన్ ఇండియాతో భారత్‌ను ఆయన వృద్ధిపథంలో నడిపారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని, మోదీ నాయకత్వంలో దేశం పేదరిక రహితంగా మారుతుందని,ఆయన నాయకత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఆకాంక్షించారు.
ఎల్లప్పుడు మేం మోదీతోనే : సీఎం నితీశ్‌కుమార్
తాము ఇకముందు ఎల్లప్పుడూ మోదీ వెంటే ఉంటామని గత పదేళ్లలో మోదీ దేశానికి ఎంతో సేవ చేశారని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ పేర్కోన్నారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మోదీ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. మోదీతో కలిసి పనిచేసేందుకు మేమంతా ఇక్కడకు రావడం ఆనందంగా ఉందన్నారు. బీహార్‌కు ఉన్న సమస్యలు ఈ ఐదేళ్లలో మోదీ తీరుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి దేశానికి చేసిందేమీ లేదని, ఇటీవలి ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచారేమో.. కానీ వచ్చే ఎన్నికల్లో మొత్తంగా ఓడిపోతారన్నారు. దానిపై మాకు ఎలాంటి సందేహం లేదన్నారు.
మోదీ నాయకత్వం భారత్‌కు బలం : పవన్ కల్యాణ్
మోదీ నాయత్వం దేశానికి బలమని, ప్రధానిగా మోదీ ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని, మోదీ నేతృత్వంలో పనిచేయాన్ని గర్వంగా భావిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కోన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జనసేన తరపున మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నామని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారన్నారు. సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాధ్ షిండే కూడా మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ సంపూర్ణ మద్ధతు తెలిపారు. అనంతరం ఎన్డీఏ కూటమి ఎంపీలంతా రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసేందుకు బయలుదేరారు.