Site icon vidhaatha

Karnataka | జోరు వానలో 8 కిలోమీటర్లు పరుగుదీసి మహిళ ప్రాణం కాపాడిన పోలీసు జాగిలం

ఆరు గంటల వ్యవధిలో ఒకరి హత్య
మరో హత్య చేసేందుకు ప్రయత్నం
ఆలోపే పట్టుకున్న పోలీసుల జాగిలం
కర్ణాటకలోని దావణగేరెలో ఘటన

బెంగళూరు : పోలీసుల విధి నిర్వహణలో పోలీసు జాగిలాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటాయి. వాసన చూసి.. ఆనవాళ్లను పసిగట్టడంలో, నిందితుల జాడ కనిపెట్టడంలో పోలీసులకు సహకరిస్తుంటాయి. ఈ ఘటనలో మరో అడుగు ముందుకేసిన ఒక పోలీసు జాగిలం.. ఒక హత్య జరుగకుండా కాపాడటమే కాకుండా.. ఒక హత్య కేసును ఛేదించడంలో సహకరించింది. ఇందుకోసం జోరు వానలో ఎనిమిది కిలోమీటర్లు పరుగుతీసి, హత్యకు సిద్ధమవుతున్న నిందితుడిని పోలీసులకు పట్టిచ్చింది. ఈ ఘటన కర్ణాటకలోని దావణగేరెలో చోటు చేసుకున్నది.

గురువారం చెన్నగిరి తాలూకా సంతెబెన్నూర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని బడా రోడ్డు పక్కన ఒక వ్యక్తి శవం దొరికింది. ఆ రోడ్డులో గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ ఆ శవాన్ని గమనించి, పై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఎస్పీ ఉమేశ్‌ ప్రశాంత్‌ తుంగ 2 అనే పోలీసు జాగిలాన్ని, దాని శిక్షకుడు కానిస్టేబుల్‌ షఫీని, మరో పోలీసు సిబ్బందిని పంపారు. మృతుని జాకెట్‌ వాసన చూసిన డాబర్‌మెన్‌.. చెన్నపుర దిశగా పరుగు అందుకున్నది. తుంగ2, దాని శిక్షకుడు ఎనిమిది కిలోమీటర్లు ఆగకుండా పరుగుతీశారు.

కాగా.. వారిని ఇతర పోలీసులు అనుసరించారు. చివరికి పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న ఒక ఇంటి వద్ద జాగిలం ఆగింది. ఆ ఇంట్లోకి చొరబడిన పోలీసులకు ఒక వ్యక్తి ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా బాదుతున్న దృశ్యం కనిపించింది. అప్పటికే ఆమె స్పృహతప్పిపోయే పరిస్థితికి చేరుకున్నది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తుంగ2 చొరవ.. గ్రాహక శక్తి.. నిందితుడిని పట్టుకోవాలన్న తపన రూప అనే మహిళ ప్రాణాలను కాపాడింది. ఆమెపై దాడి చేసిన రంగస్వామి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

దర్యాప్తు సందర్భంగా ఒక హత్య కేసులో వెతుకుతున్న హంతకుడు రంగస్వామేనని పోలీసులు గుర్తించారు. రోడ్డుపక్కన కనిపించిన శవం సంతెవెన్నూర్‌కు చెందిన సంతోష్‌ (33) అనే వ్యక్తిది. తన భార్యతో సంతోష్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో అతడిని రంగస్వామి వేటకత్తితో నరికి చంపాడు. ఘటనా స్థలంలో వాసనను పసిగట్టిన జాగిలం.. నేరుగా రంగస్వామి ఇంటికి పోలీసులను తీసుకొని వెళ్లింది. సంతోష్‌ను హత్య చేసిన అనంతరం రంగస్వామి తన గ్రామమైన చెన్నపుర వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. అక్కడ తన భార్య రూపను కూడా చంపేందుకు సిద్ధపడ్డడాని చెప్పారు. కానీ.. తుంగ2 చొరవతో సరైన సమయంలో పోలీసులు అతడి ఇంటికి తీసుకువెళ్లింది.

తీవ్రంగా గాయపడిన రూపను సంతెబెన్నూర్‌ కమ్యూనిటీ హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో పోలీసు జాగిలం బృందాన్ని, ప్రత్యేకించి తుంగ2 కృషిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అక్రమ సంబంధంతో హత్య ‘గురువారం సంతెబెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాత్రి 9.45 గంటల సమయంలో ఒక మృతదేహం లభించింది. మృతుడిని చెన్నపుర గ్రామానికి చెందిన సంతోష్‌గా గుర్తించాం. హంతకుడు రంగస్వామిది కూడా అదే ఊరు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రంగస్వామి భార్యతో సంతోష్‌ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మా దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసి, సంతోష్‌ను రంగస్వామి హత్య చేశాడు’ అని పోలీసు అధికారులు తెలిపారు.

Exit mobile version