Modi Nomination | మే 14న వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్.. 13న పెద్ద ఎత్తున రోడ్‌ షో..!

Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ దాఖలుకు ముందురోజైన మే 13న వారణాసిలో ఆయన పెద్ద ఎత్తున రోడ్‌ షో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంతోపాటు మరో 57 లోక్‌సభ నియోజకవర్గాలకు ఆఖరిదైన ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది.

  • Publish Date - May 4, 2024 / 09:26 AM IST

Modi Nomination : ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ దాఖలుకు ముందురోజైన మే 13న వారణాసిలో ఆయన పెద్ద ఎత్తున రోడ్‌ షో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంతోపాటు మరో 57 లోక్‌సభ నియోజకవర్గాలకు ఆఖరిదైన ఏడో విడత ఎన్నికల్లో భాగంగా జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

మొత్తం ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. ఏప్రిల్‌ 19న తొలి విడత, ఏప్రిల్‌ 26న రెండో విడత ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడత, మే 20న ఐదో విడత, మే 25న ఆరో విడత, జూన్‌ 1న ఏడో విడత ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అన్ని లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగో విడతలో భాగంగా మే 13న పోలింగ్‌ జరగనుంది.

కాగా, వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికే రెండు పర్యాయాలు విజయం సాధించారు. అప్పటికే మూడు పర్యాయాలు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ 2014లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ఆయన పోటీచేశారు. రెండు స్థానాల్లో విజయం సాధించారు. దాంతో వడోదర లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశాను. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మెజారిటీ సీట్లు రావడంతో నరేంద్రమోదీకి ప్రధాని పదవి కట్టబెట్టారు.

ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ వారణాసి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. రెండో పర్యాయం కూడా ప్రధాని పదవి ఆయననే వరించింది. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మోదీ వారణాసి నుంచే బరిలో దిగుతున్నారు. ఈసారి కూడా ఎన్డీఏ కూటమికి మెజారిటీ వస్తే మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే ఛాన్స్‌ ఉంది. అదేగనుక జరిగే మూడు పర్యాయాలు ప్రధాని పదవి చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా ఆయన రికార్డు సృష్టించనున్నారు.