Vande Bharat Metro | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య పరుగులు తీస్తున్నాయి. వీటికి వస్తున్న ఆదరణ నేపథ్యంలో త్వరలోనే వందే భారత్ మెట్రో రైలును సైతం తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. త్వరలోనే ట్రయల్ రన్ సైతం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సౌత్ ఈస్ట్ రైల్వే జోన్‌లో త్వరలో 19 రద్దీ మార్గాల్లో వందే మెట్రో రైళ్లను నడపాలని యోచిస్తున్నది. బిహార్, బెంగాల్, ఒడిశా స్టేషన్లలో వందే మెట్రోకు సంబంధించి రైల్వేశాఖ సర్వే నిర్వహించింది. మెట్రో రైళ్లను టాటానగర్ నుంచి గయా, హౌరా నుంచి ధన్‌బాద్ మార్గాల్లో నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ రూట్లలో నడిపేందుకు ప్లాన్..
ప్రస్తుతం వందే భారత్ రైలు రాంచీ నుంచి హౌరా వరకు టాటానగర్ స్టేషన్ మీదుగా పరుగులు తీస్తుంది. ఇందులో టాటానగర్ నెంచే ఎక్కువ సీట్లు బుక్ అవుతున్నాయి. తాజాగా వందే మెట్రో రైలును రంచీ, బొకారో, రూర్కెలా, టోరీ, అసన్సోల్, ఖరగ్‌పూర్ నుంచి దిఘా, బాలాసోర్ ఇతర మార్గాల్లో నడిపేందుకు ప్లాన్ చేస్తున్నది. ప్రయాణికుల డిమాండ్ మేరకు వందే మెట్రోను నడిపేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే ట్రయల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. వందే భారత్ మెట్రో జార్ఖండ్, బెంగాల్, ఒడిశా జోన్లలో పర్యాటక రంగం పెంపొందుతుందని భావిస్తున్నది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే వీటి సంఖ్యను పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తున్నది.
వందో మెట్రో ఫీచర్స్..
రైల్వేశాఖ నగర ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని వందే మెట్రో రైళ్లను తీసుకరాబోతున్నది. వాటి డోర్లు ఆటోమెటిక్ సిస్టమ్ ఉండనున్నది. వాటంతటవే మూసుకొని.. తెరుచుకోనున్నాయి. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరం ఉన్న నగరాల మధ్య రాకపోకలు సాగించే అవకాశం ఉన్నది. గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నట్లు సమాచారం. వందే మెట్రోలో నాలుగేసి బోగీలను ఓ యూనిట్‌గా ఉంటుంది. ఒక్కో రైలులో కనీసం 12 బోగీలు ఉంటాయి. రద్దీకి అనుగుణంగా 12 నుంచి 16 బోగీలకు పెంచనున్నారు. ప్రారంభంలో 50 రైళ్లను నడపాలని.. ఆ తర్వాత 400కు పెంచాలని రైల్వేశాఖ భావిస్తున్నది. ఈ ఏడాది జూలైలో ట్రయల్ రన్ నిర్వహించి.. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది.