Site icon vidhaatha

Cyclone Remal | తీవ్ర రూపం దాల్చిన రెమాల్ తుఫాన్‌.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

విధాత, హైదరాబాద్ : తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్ బలపడి ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారింది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతుంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్‌ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్‌ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తుపాను నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్‌, నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, అండమాన్‌ నికోబర్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. తుపాను ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలుగు రాష్ట్రాలపై తుఫాను ప్రభావం లేకపోయినప్పటికీ.. రాజస్థాన్‌, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించింది.

Exit mobile version