Cyclone Remal | ‘రెమాల్‌’ బీభత్సం.. పశ్చిమబెంగాల్‌లో ఆరుగురు, బంగ్లాదేశ్‌లో 10 మంది మృతి..!

Cyclone Remal | బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాను పశ్చిమబెంగాల్‌తోపాటు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఆదివారం రాత్రి తుపాను తీరం దాటే సమయంలో బెంగాల్‌ వణికిపోయింది. బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో బెంగాల్‌ వ్యాప్తంగా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి.

  • Publish Date - May 28, 2024 / 10:10 AM IST

Cyclone Remal : బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాను పశ్చిమబెంగాల్‌తోపాటు పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నది. ఆదివారం రాత్రి తుపాను తీరం దాటే సమయంలో బెంగాల్‌ వణికిపోయింది. బలమైన ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దాంతో బెంగాల్‌ వ్యాప్తంగా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి.

రాజధాని కోల్‌కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి సెంట్రల్‌ కోల్‌కతాలోని ఎంటాలికి చెందిన బిబిర్‌ బగాన్‌ ప్రాంతంలో గోడ కూలి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఘటనలో సుందర్‌బన్‌ డెల్టాకు ఆనుకుని ఉన్న నమ్‌ఖానా సమీపంలోని మౌసుని ద్వీపంలో ఓ పూరిల్లుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

అదేవిధంగా వివిధ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మరో నలుగురు మృతిచెందారు. కోల్‌కతాలో ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 5.30 వరకు 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రెమాల్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు నీట చిక్కుకున్నాయి. సోమవారం ఉదయం 5 గంటల నుంచి రెమాల్‌ బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోల్‌కతా సహా దక్షిణ బెంగాల్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, హావ్‌డా, హుగ్లీ జిల్లాల్లో రాష్ట్ర, జాతీయ విపత్తు దళాలు సహాయక చర్యలు చేపట్టాయి.

నేల కూలిన వృక్షాలను తొలగించి ప్రధాన రహదారుల్లో రాకపోకలను పునరుద్ధరించాయి. అధికారులు తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పట్టాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో రైళ్లు, మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెమాల్‌ నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో కృషి చేసిన అధికార బృందాలను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. రెమాల్‌ తుపాను కారణంగా బెంగాల్‌ సరిహద్దు రాష్ట్రమైన అస్సాంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

బంగ్లాదేశ్‌లో..

బంగ్లాదేశ్‌ తీరప్రాంతంపై రెమాల్‌ తుపాను తీవ్రంగా విరుచుకుపడింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, కుంభవృష్టితో బరిసాల్, భోలా, పతువాఖాలీ, సఖ్తీరా, ఛట్టోగ్రామ్‌లలో వందలాది గ్రామాలు అతలాకుతలం అయ్యాయి. తుపాను కారణంగా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. వందలకొద్దీ విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో కోటీ యాభై లక్షల మందికి గంటల తరబడి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Latest News