రెండో విడుత పోరులో ప్రముఖులు వీరే

రాహుల్‌గాంధీ, శశిథరూర్‌, హేమా మాలిని సహా అనేక మంది ప్రముఖులు బరిలో ఉండటంతో రెండో విడుత పోలింగ్‌పై ఆసక్తి నెలకొన్నది

  • Publish Date - April 25, 2024 / 07:26 PM IST

విధాత : రాహుల్‌గాంధీ, శశిథరూర్‌, హేమా మాలిని సహా అనేక మంది ప్రముఖులు బరిలో ఉండటంతో రెండో విడుత పోలింగ్‌పై ఆసక్తి నెలకొన్నది. ఈ పది స్థానాల్లో గతంలో ఉన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి హోరాహోరీగా తలపడుతున్నాయి.

– కేరళ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్‌ నుంచి పోటీచేస్తున్నారు. ఆయనపై పోటీగా సీపీఐ నుంచి అన్నె రాజా, బీజేపీ నుంచి కే సురేంద్రన్‌ నిలుచున్నారు.

– కేరళ నుంచి మరో ముఖ్యమైన స్థానం తిరువనంతపురం. అక్కడ కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎంపీ శశిథరూర్‌ నాలుగోసారి బరిలో ఉన్నారు. ఆయనను ఢీ కొట్టడానికి కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ను బీజేపీ నిలబెట్టింది.

– కర్ణాటకలోని బెంగళూరు సౌత్‌ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ తేజస్వీ సూర్య మరోసారి పోటీ చేస్తుండగా ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ సౌమ్యారెడ్డిని నిలిపింది.

– కర్ణాటకలోని మరో మఖ్యమైన నియోజకవర్గం మాండ్య. ఇక్కడి నుంచి జేడీఎస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం జేడీ కుమారస్వామి నిలుచున్నారు. ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ వెంకటరమణ గౌడను నిలబెట్టింది.

– మహారాష్ట్రలోని అమరావతి నుంచి గత ఎన్నికల్లో ఎన్‌సీపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన నవనీత్‌ రాణా ఈసారి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై కాంగ్రెస్‌ బల్వంత్‌ వాంఖ్వడేను బరిలోకి దించింది.

– రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి ఉన్నది. అక్కడ లోక్‌సభ స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా హాట్రిక్‌పై కన్నేశారు. ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ప్రహ్లాద్‌ గుంజల్‌ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు.

– మరో ముఖ్యమైన స్థానం బీహార్‌లోని పూర్ణ. ఇక్కడ జేడీయూ నుంచి సంతోష్‌కుమార్‌, ఆర్జేడీ నుంచి బీమా భారతితోపాటు కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన పప్పూయాదవ్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇండియా అభ్యర్థికి ఓటు వేయకపోతే ఎన్డీఏ అభ్యర్థికైనా వేయండి కాని స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయవద్దని బీహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌ అన్నారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ పోటీ ఎలా ఉన్నదో.

– యూపీలోని మీరట్‌ స్థానంపై అందరి దృష్టి ఉన్నది. అక్కడ బీజేపీ రామాయణం సీరియల్‌లో రాముడి పాత్ర ధారి అరుణ్‌ గోవిల్‌ను బరిలోకి దించగా ఆయనకు పోటీగా సునీతా వర్మను ఎస్పీ నిలబెట్టింది.

– యూపీలోని మరో ముఖ్యస్థానం మథుర నుంచి రెండుసార్లు గెలిచిన బాలీవుడ్‌ నటీ హేమామాలిని బీజేపీ టికెట్‌పై మరోసారి నిలుచున్నారు. కాంగ్రెస్‌ నుంచి ముఖేష్‌ ధాంగర్‌ పోటీ చేస్తున్నారు.

– ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నందగన్‌ నుంచి ఆ రాష్ట్ర మాజీ సీఎం భూపేశ్‌ బఘేల్‌, బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ సంతోష్‌ పాండే పోటీ పడుతున్నారు.

Latest News