Paper leak | పరీక్షార్థులకు శాపంగా లీకేజీలు.. గత ఏడేళ్లలో ఎన్ని పేపర్లు లీక్‌ అయ్యాయో తెలిస్తే షాకే!

సవాలును ఎదుర్కొని జాబ్‌ కొట్టాలనే సంకల్పంతో ఉండే పరీక్షార్థుల భవిష్యత్తుకు పేపర్‌ లీకేజీలు శాపంగా మారుతున్నాయి.

  • Publish Date - June 14, 2024 / 06:10 PM IST

ఏడేళ్లలో 70కిపైగా ప్రశ్న పత్రాలు లీక్‌
అనేక పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వాలు
దాదాపు కోటిన్నర మంది యువతపై ప్రభావం

న్యూఢిల్లీ: సవాలును ఎదుర్కొని జాబ్‌ కొట్టాలనే సంకల్పంతో ఉండే పరీక్షార్థుల భవిష్యత్తుకు పేపర్‌ లీకేజీలు శాపంగా మారుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి చదువుకుని పరీక్షలకు సిద్ధమైతే.. రాత్రికి రాత్రే లీకయిన పేపర్లు చూసుకుని దర్జాగా పరీక్ష రాస్తున్నవారి కారణంగా లక్షల మంది ప్రభావితమవుతున్నారు. ఇప్పుడు నీట్‌ అండర్‌గ్రాడ్యయేట్‌ 2024 పరీక్ష కూడా అలానే తయారైంది. 2024 మే 5వ తేదీన నీట్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ 2024 పరీక్ష నిర్వహించారు. రికార్డు స్థాయిలో 23 లక్షల మంది ఈ పరీక్షకోసం రిజిస్టర్‌ చేసుకున్నారు.

వాస్తవానికి జూన్‌ 14వ తేదీన పరీక్ష ఫలితాలు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. ఒకవైపు లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే జూన్‌ 4వ తేదీనే ఫలితాలు విడుదల చేశారు. ఇదొక అంశమైతే.. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి 67 మంది విద్యార్థులకు ఆలిండియా స్థాయిలో మొదటిర్యాంకు రావడమే కాకుండా.. ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు రావడం తీవ్ర అనుమానాలను రేకెత్తించింది. ప్రస్తతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నది.

దేశంలో అనేక మంది విద్యార్థుల భవితవ్యాన్ని పరీక్ష పత్రాల లీకేజీలు దెబ్బతీస్తున్నాయి. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉన్నది. దశాబ్దాల చరిత్ర సంగతి పక్కన పెడితే.. గడిచిన ఏడేళ్ల వ్యవధిలోనే దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సుమారు 70కిపైగా వివిధ ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవి దాదాపు కోటిన్నర మంది యువత కెరీర్‌లను ప్రభావితం చేశాయని అంచనా. వీళ్లంతా ఏదో ఒక మతానికో, కులానికో, వర్గానికో, ప్రాంతానికో చెందినవారు కాదు. వీరంతా భారతీయ యువత. భావిభారతానికి పునాదిరాళ్లు. ఎన్నెన్నో ‘గ్యారంటీ’లు ఇస్తున్న పాలకులు, పార్టీల నేతలు పేపర్‌ లీకేజీలను అంతమొందిస్తామని ఎందుకు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారన్నది ప్రశ్నగానే ఉండిపోతున్నది.

ఇటీవలి కాలంలోనే ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం యూపీపీఎస్సీ రివ్యూ ఆఫీసర్‌/ అసిస్టెంట్‌ రివ్యూ ఆఫీసర్‌ పరీక్షలను రద్దు చేసింది. యూపీ పోలీస్‌ పరీక్షలను సైతం పేపర్‌ లీకేజీల కారణంగానే రద్దు చేసింది. దీనికి ముందు 2017లో యూపీసీఎల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరీక్షలను, 2018లో సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ పరీక్షలను రద్దు చేసింది. 2020లో టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను, 2021లో బీఈడీ ప్రవేశపరీక్షను, 2021లో యూపీ టెట్‌, ఎయిడెడ్‌ స్కూల్‌ టీచర్‌/ ప్రిన్సిపల్‌ పరీక్షలను పేపర్‌ లీకేజీల కారణంగా రద్దు చేసింది.

అదే విధంగా రాజస్థాన్‌లో 2015లో ఎల్డీసీ, 2018లో కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌, 2019లో పట్వారీ రిక్రూట్‌మెంట్‌, 2019లో లైబ్రేరియన్‌ పరీక్షలు పేపర్‌ లీకేజీల కారణంగా రద్దయ్యాయి. అంతేకాదు.. 2020లో జూనియర్‌ ఇంజినీర్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రద్దు చేశారు. 2021లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఆర్‌ఈఈటీ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు లీకేజీల కారణంగా రద్దయ్యాయి.

గుజరాత్‌ విషయానికి వస్తే.. 2015లో తలతి పేపర్‌ లీక్‌ అయ్యింది. 2018లో టెట్‌ పేపర్‌ పరీక్షకు ముందే బయటకు వచ్చింది. ఇదే 2018లో సేవిక మెయిన్‌ పేపర్‌ లీక్‌ అయ్యింది. 2019లో నాన్‌ సెక్రటేరియట్‌ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్ష పత్రాలు లీక్‌ అయ్యాయి. 2021లో హెడ్‌ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకూ ఇదే గతి పట్టింది. 2021లో సబ్‌ ఆడిటర్‌ పేపర్‌, 2022లో ఫారెస్ట్‌ గార్డ్‌ రిక్రూట్‌మెంట్‌, 2023లో గుజరాత్‌ పంచాయ్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు జూనియర్‌ క్లర్క్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల పత్రాలు లీక్‌ అవడంతో పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది.

పశ్చిమ బెంగాల్‌లో డీఎల్‌ఈడీ కోర్స్‌ వార్షిక ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయి. బీహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన బీపీఎస్సీ పరీక్ష, హిమాచల్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించిన జేవోయే ఐటీ రిక్రూట్‌మెంట్‌ ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయి. మధ్యప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ అర్హత పరీక్ష, 2022లో తమిళనాడులో నిర్వహించిన 10, 12 తరగతుల బోర్డ్‌ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయి. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, తెలంగాణ ఇలా.. అన్నో రాష్ట్రాల్లో పరీక్ష పత్రాలు లీకేజీలు, పరీక్షల రద్దుతో యువత ఆగ్రహంతో రగిలిపోయింది. ఇవికాక బయటకు రాని ఉదంతాలు ఎన్ననేది ఎవరికీ తెలియదు.

దేశ యువతలో చాలా మందికి ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదల ఉంటుంది. ఆ కల నెరవేర్చుకునేందుకు ఒక సగటు విద్యార్థి కనీసం రెండేళ్లు పూర్తిగా సదరు పరీక్షలపై దృష్టి సారిస్తుంటారు. కానీ.. వారి కష్టం పేపర్‌ లీకేజీల కారణంగా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నది. ఎన్నటికీ తిరిగి రాని వెచ్చించిన సమయం, చేసిన ఖర్చు, పడిన శ్రమ.. అంతా వృథా అవుతున్నది. పరీక్ష పత్రాల లీకేజీలను నివారించేందుకు, నిరోధించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ.. చేయాల్సింనంత కృషి లేదని పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. పేపర్‌ లీక్‌ అయిన ప్రతిసారి మొక్కుబడిగా ఒక విచారణ జరిపించడం, కోర్టు కేసులు, వాయిదాలు, వాటిపై విద్యార్థుల ఆగ్రహాలు, ధర్నాలు.. ఇదొక రొటీన్‌ కార్యక్రమంతా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాలు మారినా, వాటి విధానాలు మారినా.. ఈ జాడ్యం మాత్రం విద్యార్థులపాలిట శాపంగానే ఉంటున్నది. రాజకీయ పార్టీలు తమ సొంత ఐటీ విభాగాలను పటిష్టం చేసుకుంటున్న తరహాలోనే అవే రాజకీయ పార్టీలు నాయకత్వం వహించే రాష్ట్ర ప్రభుత్వాలు ఐటీ విభాగాలను ఎందుకు పటిష్టం చేసుకోలేక పోతున్నాయన్నది ప్రశ్నగానే మిగిలిపోతున్నది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్ష పత్రాల లీకేజీలను నిరోధించేందుకు పకడ్బందీగా చట్టాలు చేసినా.. యథేచ్ఛగా లీకేజీలు ఎందుకు జరిగిపోతున్నాయనేదానికి పాలకులు సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నారు.

ఏం చేయాలి?

విద్యారంగం స్వచ్ఛతతో విరాజిల్లాలన్నా, సర్వీస్‌ కమిషన్లు చిత్తశుద్ధితో, నిజాయితీతో తమపని తాము చేసుకుపోవాలన్నా.. వీటి బోర్డుల నియామకాల్లో రాజకీయ జోక్యాన్ని వందశాతం నివారించాలని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అనేక పేపర్‌ లీకేజీ ఉదంతాలు ఆయా అధికార పార్టీలవైపు వేలు చూపుతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ప్రశ్న పత్రాలు ముద్రించే పనిని వేరొకరికి అప్పగించం కాకుండా సొంతగా ఆయా రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్లకే సొంతగా ముద్రణ వ్యవస్థను కలిగి ఉండాలని చెబుతున్నారు.

అదే సమయంలో పరీక్ష ప్రారంభానికి కొద్ది గంటల ముందు సాఫ్ట్‌కాపీని కోడ్‌లాక్‌ ద్వారా పంపి.. ప్రశ్న పత్రాలను ముద్రింపజేయాలని సూచిస్తున్నారు. దీనికి కొంత అధికంగా ఖర్చు అయినా.. అత్యంత సురక్షితంగా, అత్యంత పారదర్శకంగా పరీక్షలను నిర్వహించేందుకు, తద్వారా జాతి భావితరాలకు భద్రతమైన జీవితాన్ని ప్రసాదించేందుకు అవకాశం కలుగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో పేపర్‌ లీకేజీ మాఫియాపై సత్వర చర్యలకు తీసుకునేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

పేపర్‌ లీకేజీకి ఏదైనా విద్యాసంస్థ కారణమైతే.. అందులోని వ్యక్తులను బాధ్యులను చేయడంతోపాటు.. మొత్తంగా ఆ సంస్థను పూర్తిగా మూసివేయాలని చెబుతున్నారు. అన్నింటికి తోడు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అంటున్నారు. ఎందుకంటే.. పేపర్‌ తయారీ, ముద్రణ, సరఫరా వంటి పనుల్లో వందలమంది జోక్యం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కరు డబ్బుకు కక్కుర్తిపడినా.. భావితరాలు నష్టపోతాయన్న ప్రాథమిక ఇంగిత జ్ఞానంతో వ్యవహరిస్తే.. లీకేజీల సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపవచ్చని చెబుతున్నారు.

Latest News