Super Moon | వినీలాకాశంలో నేడు అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. పౌర్ణమి చంద్రుడు మరింత పెద్దగా కనువిందు చేయనున్నాడు. ఈ ఏడాది మూడో సూపర్ మూన్ గురువారం ఏర్పడబోతున్నది. చందమామ సాధారణం కంటే నేడు 36శాతం పెద్దదిగా కనిపించడంతో మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నది. అక్టోబర్‌లో ఏర్పడుతున్న పౌర్ణమి చంద్రుడిని హంటర్స్ మూన్‌గా పిలుస్తారు. అలాగే, నవంబర్ 15న సైతం సూపర్ మూన్ ఏర్పడబోతుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత, సైన్స్ బ్రాడ్‌కాస్టర్ సారిక మాట్లాడుతూ ఈ ఏడాది భూమికి చంద్రుడు అత్యంత తక్కువ దూరంలో 3.57లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాడని తెలిపారు.
దాంతో చంద్రుడు పెద్దదిగా ప్రకాశవంతంగా కనిపిస్తాడన్నారు. సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్‌గా పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడు. భూమి చుట్టూ చంద్రుడు వృత్తాకారంలో తిరుగుతాడని.. దాని కారణంగా చంద్రుడు భూమి నుంచి దాని దూరం కొన్నిసార్లు 4,06,700 కిలోమీటర్లకు పెరుగుతుంది. కొన్నిసార్లు 3,56,500 కిలోమీటర్లకు తగ్గుతుంది. చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు.. ఆ సమయంలో పౌర్ణమి ఉన్నప్పుడు చంద్రుడు దాదాపు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దీనినే సూపర్ మూన్‌గా పిలుస్తారు.