మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌దే!.. లోక్‌పోల్ సర్వేలో వెల్లడి

  • Publish Date - October 13, 2023 / 11:43 AM IST

  • గరిష్ఠంగా 132 స్థానాలు గెలిచే అవకాశం
  • 98-110కి పరిమితం కానున్న బీజేపీ
  • కాంగ్రెస్‌కు 44% – 46% మధ్య ఓట్లు
  • బీజేపీకి 43%-45% మధ్య ఓటింగ్‌
  • బీఎస్పీ, ఇతరులు నామమాత్రమే!
  • లోక్‌పోల్‌ సంస్థ తాజా సర్వేలో వెల్లడి


న్యూఢిల్లీ: రాబోయే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమని లోక్‌పోల్‌ సర్వే తేల్చింది. సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 మధ్య సేకరించిన ప్రజాభిప్రాయం ఆధారంగా కాంగ్రెస్‌ విజయాన్ని అంచనా వేసింది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ 120 నుంచి 132 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. అధికార బీజేపీ 98-110 స్థానాల మధ్య ఆగిపోతుందని తెలిపింది.


బీఎస్పీ 0-2 సీట్లు, ఇతరులు 0-4 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ సర్వే కోసం 1,70,000 నమూనాలు తీసుకున్నామని సంస్థ తెలిపింది. ఓటు షేరింగ్‌లో మాత్రం పోటాపోటీ ఉంటుందని సర్వేను బట్టి తెలుస్తున్నది. కాంగ్రెస్‌కు 44% – 46% మధ్య ఓట్లు లభించే అవకాశం ఉన్నది అంచనా వేసింది. బీజేపీకి 43%-45% మధ్య ఓట్లు లభించే అవకాశం ఉన్నదని తెలిపింది.


ప్రాంతాలవారీగా చూసినట్టయితే. గ్వాలియర్‌-చంబల్‌, బుందేల్‌ఖండ్‌, వింధ్య, మహాకౌశల్‌, మాల్వా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పూర్తి ఆధిక్యం కనబర్చే అవకాశాలు ఉన్నాయి. నర్మద ప్రాంతంలో బీజేపీ ఆధిక్యం కనిపిస్తున్నది. ఇక నిమర్‌లో పోటాపోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి. గ్వాలియర్‌-చంబల్‌ ప్రాంతంలో బీజేపీ 5-9 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నదని సర్వే తెలిపింది. ఇక్కడ కాంగ్రెస్‌ 25 నుంచి 29 సీట్ల మధ్య గెలుపొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది.


బుందేల్‌ఖండ్‌లో బీజేపీకి 10-13, కాంగ్రెస్‌కు 13-16 మధ్య సీట్లు లభించవచ్చని తెలిపింది. వంధ్యలో బీజేపీ 8-11, కాంగ్రెస్‌ 17-19 మధ్య, మహాకౌశల్‌లో బీజేపీ 16-19, కాంగ్రెస్‌ 23-26 సీట్ల మధ్య గెలిచే అవకాశం కనిపిస్తున్నదని సర్వే పేర్కొన్నది. నర్మదలో బీజేపీ 24-27 మధ్య, కాంగ్రెస్‌ 5-8 సీట్ల మధ్య గెలుస్తాయని అంచనా వేసింది. మాల్వాలో బీజేపీ 22-25 సీట్ల మధ్య, కాంగ్రెస్‌ 25-28 సీట్ల మధ్య గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలిపింది. ఇక పోటాపోటీ ఉంటుందని భావిస్తున్న నిమర్‌లో రెండు పార్టీలు 8-10 చొప్పున గెలుస్తాయని పేర్కొన్నది.


సర్వే ఇలా..


రాష్ట్రంలోని 230 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 750 చొప్పున నమూనాలను సేకరించారు. మొత్తం దాదాపు 1.70 లక్షల మంది అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 50 పోలింగ్‌ కేంద్రాలను వేర్వేరు ప్రాంతాల నుంచి ఎంపిక చేశారు. అభిప్రాయ సేకరణ ప్రశ్న పత్రాల్లో స్థానిక అంశాలతోపాటు జాతీయ స్థాయి అంశాలు సమాన స్థాయిలో ఉండేలా చూశామని సంస్థ తెలిపింది.

Latest News