Site icon vidhaatha

Viral Video | పాము నోట్లో గాజుసీసా.. రక్షించిన స్నేక్ హెల్ప్‌లైన్‌ వలంటీర్లు..!

Viral Video | పాములు సాధారణంగా ఎలుకలు, కప్పలను పట్టుకువెళ్తాయి. కొన్ని సందర్భాల్లో పాస్టిక్‌ వ్యర్థాలను మింగి ఆ తర్వాత బయటకు కక్కలేక మింగలేక నానా తిప్పలుపడుతుంటాయి. తాజాగా అలాంటి ఓ ఘటనే ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకున్నది. ఓ తాచుపాము చెత్తలో పడి ఉన్న ఖాళీ దగ్గమందు సీసాను మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నది. ఎలుకనో.. కప్ప అనుకొని సీసాను మింగిన పాము.. ఆ తర్వాత దాన్ని బయటకు కక్కలేక.. మింగలేక పడరానిపాట్లు పడింది. ఓ వైపు నొప్పితో విలవిలలాడుతూనే మరో వైపు శ్వాసను తీసుకునేందుకు అల్లాడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుశాంత నందా అనే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (వైల్డ్‌లైఫ్‌) తన అధికారి ఎక్స్‌ ఖాతాలో వీడియోను పోస్ట్‌ చేశారు. భువనేశ్వర్‌లో సాధారణ రకం తాచుపాము దగ్గమందు బాటిల్‌ మింగాలని చూసి.. చివరకు దాన్ని కక్కలేక ఇబ్బందిపడిందని పేర్కొన్నారు.

స్నేక్‌ హెల్ప్‌లైన్‌ వలంటీర్లు కష్టపడి పాము నోట్లో నుంచి సీసాను దాసి దాని ప్రాణాలను కాపాడారు. దవడ కిందభాగాన్ని వెడెల్పుగా చేసి సీసాను కక్కేలా చేసి ప్రాణాలను కాపాడినట్లు సుశాంత నంద తెలిపారు. ఘటనపై వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌ సుభేందు అధికారి మల్లిక్‌ స్పందించారు. విషయం తెలియగానే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నామని.. తాము కొంత సహాయం చేయడంతో పాము నోట్లో నుంచి సీసాను బయటకు కక్కిందని పేర్కొన్నారు. సీసాను ఆహారంగా భావించిన పాము మింగేందుకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. నోట్లో సీసాను ఇరుక్కుపోయి నొప్పితో అల్లాడిపోయి.. నీరసించింద్నారు. సీసాను నోట్లో నుంచి తీయాక పామును అటవీ ప్రాంతంలో వదిలేశామని మల్లిక్‌ తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. చాకచక్యంతో వ్యహరించిన పాము ప్రాణాలను కాపాడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణులు, పర్యావరణానికి హాని కలిగించకుండా చెత్తను పడే పద్ధతులు అవలంభించాలని నెటిజన్లు సూచించారు. మనిషే సృష్టించే సమస్యలు సమస్త ప్రాణకోటికి ఇబ్బందులుపెడుతున్నాయంటూ మరికొందరు స్పందించారు.

Exit mobile version