Lok Sabha Elections | న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో దశ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. శనివారం ఉదయం 7 గంటలకు ఆరో విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలోనే హర్యానాలో ఉన్న మొత్తం 10 స్థానాలకు, దిల్లీలో ఉన్న మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి ఈ విడతలోనే ఎన్నిక జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, బిహార్ 8, బంగాల్ 8, ఒడిశా 6, ఝార్ఖండ్ 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 889మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 11.13 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం హోరాహోరీ పోరు ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఏడు స్థానల్లోనూ బీజేపీనే గెలిచింది. ఇప్పుడు ఆప్, కాంగ్రెస్ పోటీలో ఉన్నాయి. బీజేపీకి ఆప్ – కాంగ్రెస్ గట్టి పోటీని ఇస్తున్నాయి. ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది. మరో వైపు ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్ జరుగుతోంది.