బలహీన సంకీర్ణంలో 18వ లోక్‌సభ సజావుగా సాగేనా?

పదేళ్లలో మొదటిసారి ప్రధాని మోదీ బలహీనుడిగా లోక్‌సభను ఎదుర్కొంటున్న సందర్భం! పదేళ్లలో మొదటిసారి మోదీని ఢీకొనే బలంతో ప్రతిపక్షం నిలబడిన సమయం! లోక్‌సభ సమావేశాల తొలిరోజున అటు సభానేత, ఇటు ప్రతిపక్ష నేత ఏకాభిప్రాయం వల్లెవేసిన తరుణం!

  • Publish Date - July 1, 2024 / 12:59 AM IST

తొలిసారి బలహీనంగా ప్రధాని మోదీ
టీడీపీ, జేడీయూలపైనే సర్కారు మనుగడ
పటిష్టంగా కనిపిస్తున్న ఇండియా కూటమి
తొలివారంలోనే సభలో ఘర్షణ వాతావరణం
రానున్న రోజుల్లో చర్చకు కీలక అంశాలు
ప్రొటెం స్పీకర్‌ మొదలు.. డిప్యూటీ స్పీకర్‌ దాకా
ఏకపక్ష వైఖరితోనే ఉన్న ఎన్డీయే ప్రభుత్వం
ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తిన జేడీయూ
టీడీపీ సైతం అదే డిమాండ్‌ చేసే అవకాశం

(విధాత ప్రత్యేకం)

పదేళ్లలో మొదటిసారి ప్రధాని మోదీ బలహీనుడిగా లోక్‌సభను ఎదుర్కొంటున్న సందర్భం! పదేళ్లలో మొదటిసారి మోదీని ఢీకొనే బలంతో ప్రతిపక్షం నిలబడిన సమయం! లోక్‌సభ సమావేశాల తొలిరోజున అటు సభానేత, ఇటు ప్రతిపక్ష నేత ఏకాభిప్రాయం వల్లెవేసిన తరుణం! పదేళ్ల తర్వాత అధికార కూటమి సారథి సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకత! అదే దుందుడుకు స్వభావం కలిగిన మోదీ, అమిత్‌షా.. ప్రభుత్వ బిల్లుల ఆమోదంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా.. అవసరమైతే యావత్‌ ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయగల స్పీకర్‌ స్థానంలో అదే ఓం బిర్లా! ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం మరింత సహనం చూపుతుందా? ప్రతిపక్షాలకు తగిన అవకాశాలు కల్పిస్తుందా? ప్రభుత్వం కోరుతున్న నిర్మాణాత్మక సలహాలు సూచనలు అందించడానికి ప్రతిపక్షం సిద్ధపడుతుందా? ఆ అవకాశం ఈ పద్ధెనిమిదవ లోక్‌సభ సజావుగానే సాగుతుందా? ఇప్పుడు యావత్‌ దేశ రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి రేపుతున్న అంశమిదే!

ఏకాభిప్రాయం మాట చెబుతూ మోదీ తన మూడో విడుత పాలనను మొదలు పెట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ భాగస్వాముల దయాదక్షిణ్యాలపైనే ఆధారపడిన బీజేపీ.. మరోవైపు పటిష్టంగా ఉన్న ప్రతిపక్షాన్నీ ఎదుర్కొనాల్సి ఉన్నది. అయితే.. లోక్‌సభ ప్రారంభమైన రోజు నుంచీ అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య వైషమ్యాలు ప్రస్ఫుటంగానే కనిపించాయి. సభలో ప్రజావాణిని వినిపించడంలో ప్రతిపక్షం పాత్రను నొక్కి చెప్పిన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని చెప్పారు. అదే సమయంలో విశ్వాసం ప్రాతిపదికన సహకారం కొనసాగాల్సిన అవసరాన్నీ ప్రస్తావించారు. కానీ.. తొలి సమావేశాల తొలి రోజుల్లోనే అధికార, ప్రతిపక్షాల మధ్య సహకారం సంగతి పక్కనపెడితే.. సమరం జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని తేలిపోయింది. ఎందుకంటే ప్రొటెం స్పీకర్‌ విషయంలో ప్రతిపక్షాలను అధికార పక్షం విశ్వాసంలోకి తీసుకోలేదు. ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన సురేశ్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం ఇవ్వాల్సి ఉన్నా.. నిబంధనల సాకుతో ఆ అవకాశాన్ని తిరస్కరించింది. డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చేది లేదని చెప్పకనే చెప్పింది. వాస్తవానికి ఇద్దరు సభ్యులను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లుగా నియమించుకోవాలని రాజ్యంగం చెబుతున్నా.. గత లోక్‌సభలో అసలా పదవి అనేదే లేకుండా చేశారు. మరోవైపు రానున్న రోజుల్లో ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఎన్‌ఆర్‌సీ, అగ్నిపథ్‌ పథకం, నియోజకవర్గాల పునర్విభజన వంటి అనేక వివాదాస్పద అంశాలు ఈ 18వ లోక్‌సభలో చర్చకు రానున్నాయి. మరోవైపు జేడీయూ ఇప్పటికే బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీకి డిమాండ్‌ చేసింది. అంతేకాకుండా.. బీహార్‌లో రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని రాజ్యాగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలనే కీలక డిమాండ్‌తో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. మరో కీలక పక్షం టీడీపీ సైతం ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీని కోరుతున్నా.. ఇంకా బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఈ రెండు పార్టీల వైఖరులు, డిమాండ్లను మోదీ ఏ మేరకు పట్టించుకుంటారనేది చర్చనీయాంశంగా ఉన్నది.

అయితే.. మోదీ వైఖరిలో ఎలాంటి మార్పు కనీసం తొలినాళ్లలో కూడా కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ తన బలాన్ని చాటుకుంటారు తప్ప.. బలహీనత ఆనవాళ్లను కూడా బయటపెట్టుకోరని ఒక రాజకీయ విశ్లేషకుడు చెప్పారు. కిందపడ్డా తనదే పై చేయి అనే వ్యవహారమని అన్నారు. ఒకవైపు బీజేపీని ప్రజలు తిరస్కరిస్తూ మెజార్టీకి దూరంగా నిలిపివేసినప్పటికీ ప్రజలు తమపై బ్రహ్మాండమైన విశ్వాసం కనబర్చారని చెప్పుకొన్నా.. భాగస్వామ్యపక్షాలకు కీలక పోర్టుఫోలియోలు నిరాకరించినా.. ఆఖరుకు తనకు సీట్లు తగ్గడానికి కారణమైన రాజ్యాంగ మార్పు అంశాన్ని తనకే అన్వయించుకుంటూ ఈ ఎన్నికల్లో ప్రజలు రాజ్యాంగంపై అచంచల విశ్వాసాన్ని కనబర్చారని చెప్పుకొన్నా.. (వాస్తవానికి బీజేపీకి సీట్లు తగ్గడానికి ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనే అంశంలో ప్రజలను చైతన్యం చేయడం కూడా ఒక కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి) అంతా ఈ ఎన్నికల్లో బీజేపీపై ఎలాంటి వ్యతిరేకత లేదని, తన పట్ల ఎన్నికల ప్రభావం ఏమీ లేదని చాటుకోవడమేనని ఆయన విశ్లేషించారు. ఇది ‘మోదీ తరహా గాంభీర్యం’ అని భవిష్యత్తుల్లో ఉదహరించుకోవచ్చని అన్నారు. అందుకే ప్రభుత్వంలో ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు కీలకమైన పోర్టుఫోలియోలు ఏవీ దక్కలేదు. స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతో ఉండాలన్న ఆకాంక్షలూ పక్కకుపోయాయి. సంప్రదాయాన్ని పాటించి డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షానికి కేటాయించాలన్న డిమాండ్‌ను అధికార పక్షం పట్టించుకోలేదు. ప్రతిపక్షాలను కట్టడిచేయడంలో దిట్టగా పేరున్న ఓం బిర్లా తన వద్ద మైక్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసే బటన్లు లేవని చెప్పినప్పటికీ.. ప్రతిపక్ష నేత మైక్‌ కట్‌ అయిపోయింది.

కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ సైతం మోదీ వ్యవహార శైలిపై కీలక కామెంట్లు చేశారు. ఎన్నికల ఫలితాలతో మోదీ ఒద్దికగా ఉంటారనేందుకు గానీ, ఓటర్లు పంపిన సందేశాన్ని ప్రతిబింబిస్తారనేందుకు గానీ ఎలాం ఆధారాలు లేవు’ అని అన్నారు. మోదీ ఏకాభిప్రాయం విలువ గురించి గొప్పగా బోధిస్తారని, కానీ.. వాస్తవానికి ఆయన ఘర్షణకే విలువ ఇస్తారని చెప్పారు.
‘మోదీ 3.0 పూర్తిగా తమ నియంత్రణలో ఉన్నదని చెప్పుకోవడం, ప్రదర్శించడం బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నది. కానీ.. మోదీ ప్రభుత్వం రెండు కీలక భాగస్వామ్య పార్టీలు టీడీపీ, జేడీయూ మద్దతుపైనే ఆధారపడిందనేది తిరుగులేని వాస్తవం. అంటే.. ప్రభుత్వ విధానాలను, చర్యలను ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. 2019లోకానీ, అంతకు ముందు 2014లో కానీ బీజేపీ ఇలాంటి బలహీనత లేదు’ అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కానీ.. తొలివారంలోనే మోదీ ప్రభుత్వ అనేక ఏకపక్ష ధోరణులను గమనిస్తే.. సంఖ్యాబలం లేనప్పటికీ తన పనితీరును మార్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్న అంశం అర్థమవుతున్నదని ఒక సీనియర్‌ జర్నలిస్టు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా తన వాణిని గట్టినే వినిపించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఏది ఏమైనా ఈ సమావేశాల్లో ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని చెప్పారు.

Latest News