kishan reddy: విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మూటలు వెళ్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి కేంద్రీకృతంగా జరిగేదని.. ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో అవినీతి వికేంద్రీకరణ అవుతున్నదని మండిపడ్డారు.
అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులకు వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ. దేశ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీ 11 ఏళ్ల పాలన, అంతర్జాతీయ యోగాదినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ, వ్యవసాయానికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలు, రాష్ట్రంలో అకాలవర్షాల వల్ల జరిగిన నష్టం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
తెలంగాణ ప్రజలను కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే కాపాడగలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని.. కాంగ్రెస్ నేతలు కమీషన్ల మత్తులో జోగుతున్నారని.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.