విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసిన అప్పు తాజాగా రూ.2, 40,000కోట్లకు చేరింది. కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.1,000 కోట్లు అప్పు చేసింది. 26 ఏళ్ల కాల పరిమితితో 7.3శాతం వార్షిక వడ్డీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ వేలం ద్వారా ఈ అప్పు సేకరించింది. దీంతో 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు రూ.2,40,000 కోట్లకు చేరుకోనుందని సమాచారం. మిగులు బడ్డెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం 7.50లక్షల కోట్లు అప్పు చేసిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అప్పుల బాటలో కొనసాగుతుండటం గమనార్హం.
అయితే బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులకు వడ్డీల చెల్లింపుతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే క్రమంలోనే తాము అప్పులు చేయాల్సి వస్తుందని కాంగ్రెస్ పాలకులు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికి తెలంగాణ రాష్ట్రం మాత్రం అప్పుల మార్గంలోనే తన పురోగతిని కొనసాగిస్తుండటం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురి చేస్తుంది.