KTR allegations on Congress| కాళేశ్వరం బ్యారేజీలను నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ : కేటీఆర్ ఫైర్

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తుందని, మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు

విధాత : తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తుందని, మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారని, నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం కూడా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.

బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్ చేసిన మాఫియాపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏకంగా బ్యారేజీని బలహీనపరిచి బీఆర్ఎస్ పై బురదజల్లే పన్నాగాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అరాచకపర్వాన్ని అన్నదాతలు క్షమించే ప్రసక్తే లేదు అన్నారు. అన్నారం బ్యారేజ్ దగ్గర ఇసుక తవ్వకాల వెనుక బ్యారేజ్‌ను కూలిపోయేలా చేసే కుట్ర కనిపిస్తోంది అని, రెండు రోజుల క్రితం అన్నారం బ్యారేజ్ దగ్గర ఇసుక తవ్వకాలు జరుగుతున్న వీడియో వైరల్ అయినప్పుడు, పరీక్షల కోసం ఇసుక తీస్తున్నామని సమాధానం ఇచ్చిన అధికారులు… ఆ వీడియో వైరల్ అయిన మరుసటి రోజే తవ్వకాలు ఎందుకు ఆపేశారు? అని కేటీఆర్ నిలదీశారు.

నిబంధనలు తుంగలో తొక్కి రేవంత్ సర్కార్ అన్నారం బ్యారేజి పిల్లర్ల వద్ద ఇసుక తవ్వకాలు చేసి బ్యారేజీని ప్రమాదంలోకి నెడుతుంది అని, ఇది ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుట్రే అని కేటీఆర్ ఆరోపించారు. పట్టపగలే, నిస్సిగ్గుగా అన్నారం బ్యారేజ్ నుండి కాంగ్రెస్ నాయకుల ఇసుక మాఫియా ఇసుకను తోడేస్తుంది అని, తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ ఎలా కొల్లగొడుతుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది అన్నారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని స్పష్టం చేశఆరు. అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో.. ఇవే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలన సూత్రాలు అని, తెలంగాణను నిలువు దోపిడి చేస్తున్న కాంగ్రెస్ నాయకులారా.. ప్రజలు మీ భరతం పట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది.. ఖబడ్దార్ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.

 

Latest News