Site icon vidhaatha

Warangal | సమాజ శాంతిని కమ్యూనిటీ పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి

కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా పరిష్కారం

హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ సుజోయ్ పాల్

విధాత, వరంగల్ ప్రతినిధి: సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించి శాంతియుతమైన సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను చీఫ్ జస్టిస్ శుక్రవారం ఉదయం హనుమకొండలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ప్రసంగిస్తూ ఏ వివాదమైనా ఒక వ్యక్తికి వ్యక్తి మధ్యనో లేదా వ్యక్తుల సమూహాల మధ్యనో ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు. అటువంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీ కి చెందిన పెద్దవారు వారికి నచ్చచెప్పినట్లయితే వివాదాలు సుహృద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భార్యాభర్తల మధ్య తగాదాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య తగాదాలు సమాజంలో పెరిగిపోతున్నాయని వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని జస్టిస్ సుజోయ్ పాల్ అన్నారు.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం భార్యాభర్తల మధ్య ఇగోలు ఏర్పడి వారి మధ్య వివాదాలకు ఎక్కువగా కారణం అవుతున్నాయని చీఫ్ జస్టిస్ అన్నారు. వివాదాలను సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్.పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ లో ఈ కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు బి వి నిర్మల గీతాంబ, సిహెచ్ రమేష్ బాబు ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం. సాయి కుమార్, క్షమా దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version