విధాత ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ సభ కోసం మాకంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు…కేసీఆర్ ఏం మాట్లాడుతాడో అని మాకంటే కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ మొదలైందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శనివారం ఎల్కతుర్తిలో రజతోత్సవసభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడకండి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అంటూ చమత్కరించారు.
బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షమే
తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ.. తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అంటూ హరీష్ రావు అన్నారు. టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమ పార్టీగా … ఆ తరువాత పది సంవత్సరాలు అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజల సంక్షేమ, అభివృద్ధి కోసం కృషి చేసిందన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ … కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుతుందని పేర్కొన్నారు. ప్రజలు పార్టీకి ఏ పాత్ర ఇచ్చినా అది ప్రజల పక్షమే నిలిచిందని పేర్కొన్నారు. మళ్లీ తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమని జోష్యం చెప్పారు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే పండుగ కాదని… ఇది తెలంగాణ ప్రజలందరి పండుగగా హరీష్ రావు వివరించారు. ఈ సభకు పార్టీ తరలించిన దానికంటే స్వచ్ఛందంగా రావడానికి మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎవరికి వారు సొంతంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛందంగా తరలివచ్చి సభను జయప్రదం చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ సభ కోసం వరంగల్ జిల్లా నాయకత్వం విస్తృత ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. భారీ సభలను నిర్వహించడం వరంగల్ జిల్లా నాయకత్వానికి కొత్తేమీ కాదని, గతంలో కూడా భారీ సభలను నిర్వహించిన చరిత్ర వరంగల్ పార్టీ నాయకత్వానికి ఉందని కొనియాడారు. సభ పట్ల కాంగ్రెస్ నాయకులకు కూడా ఆసక్తి నెలకొందని సెటైర్ వేశారు. ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి సర్వత్రా నెలకొందన్నారు. ఆ ఉత్సాహంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నట్లు హరీష్ రావు వివరించారు. ఈ మీడియా సమావేశంలో హరీష్ రావు తో పాటు వరంగల్ జిల్లా నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.