Double Murder in Delhi | ఢిల్లీలో డబుల్ మర్డర్ కేసు సంచలనం రేపింది. ఈ ఘటనలో 22 ఏళ్ల శాలిని అనే గర్భిణి, ఆమె మాజీ ప్రియుడు చనిపోయారు. శాలిని తన భర్తతో కలిసి ఉంటున్న కుతుబ్ రోడ్‌లోని నబీ క్లారిమ్ ఏరియాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకున్నది. గర్భిణిగా ఉన్న తన భార్యపై దాడి చేయడంతో ఆగ్రహించిన భర్త.. దాడి చేసిన సదరు వ్యక్తిపై ఎదురుదాడి చేశాడని, ఈ ఘటనలో గర్భిణితోపాటు.. ఆమెపై దాడికి పాల్పడిన వ్యక్తి చనిపోయినట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.
శాలినికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తన తల్లిని కలిసేందుకు తన భర్త ఆకాశ్‌తో కలిసి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డుపై ఆటోలో వెళుతున్నవారిని ఆశు అలియాస్ శైలేంద్ర (గతంలో శాలినితో సహజీవనం చేసిన వ్యక్తి) ఎదుటపడి దాడి చేశాడు. తొలుత ఆకాశ్‌పై దాడి చేశాడు. ‘మొదటి దెబ్బను ఆకాశ్ తప్పించుకోగలిగినప్పటికీ.. ఆశు వెంటనే శాలినిపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా ఆమెను పొడిచాడు’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిధిన్ వాల్సన్ తెలిపారు. తన భార్యను కాపాడుకునేందుకు ఆకాశ్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. వీలు కాలేదు. చివరికి ఆశు నుంచి కత్తి గుంజుకున్న ఆకాశ్.. అతడిపై కత్తిపోట్లు వేశాడు.
తీవ్రంగా రక్తస్రావం అవుతున్న ముగ్గురినీ శాలిని సోదరుడు, స్థానికులు కొందరు కలిసి హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. శాలిని, ఆశు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఆకాశ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ కత్తిపోట్ల ఘటన బహిరంగంగా, నడిరోడ్డుపైనే చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
చనిపోయే సమయంలో శాలిని గర్భంతో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆకాశ్, శాలిని మధ్య కొన్నేళ్ల క్రితం గొడవలు జరిగాయని, ఆ సమయంలో తన కుమార్తె ఆశుకు దగ్గరైందని ఆమె తల్లి తెలిపారు. అయితే.. తర్వాత ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని, భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నదని డీసీపీ తెలిపారు. శాలిని కడుపులో ఉన్న బిడ్డకు తానే తండ్రినని ఆశు చెబుతున్నాడని, అయితే.. ఆమె తనను వదిలి వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురై దాడి చేశాడని సమాచారం. అయితే.. శాలిని మాత్రం తనకు పుట్టబోయే బిడ్డకు ఆకాశే తండ్రి అని చెబుతున్నట్టు తెలిసింది. ఆశు చెడు ప్రవర్తన కలిగని వ్యక్తిగా నబీ కరీం పోలీస్ స్టేషన్‌లో రికార్డ్ ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆకాశ్ గతంలో మూడు క్రిమినల్ కేసులలో ఉన్నాడని తెలిపారు. శాలిని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 103–1 (హత్య), 109–1 (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.