విధాత : ప్రేమ పెళ్లి చేసుకోవడమే ఆ నిండు చూలాలి పాలిట శాపంగా మారింది. 9 నెలల గర్భిణీ అని కూడా చూడకుండా సొంత మామే అతి దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన కుమ్రం భీమ్ అసీఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గెర్రే గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి, అదే గ్రామంలోని తన ఇంటి ఎదురుగా ఉండే రాణి అనే అమ్మాయిని ప్రేమించాడు. దీంతో వారిద్దరు ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు.అయితే, వారిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో శేఖర్ తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ కలహాలు చెలరేగంతో శేఖర్ తన భార్యతో కలిసి అత్తాగారింట్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో రాణి గర్భం దాల్చింది. కాగా, శేఖర్ తండ్రి సత్యనారాయణ రాణిపై పగపెంచుకుని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూశాడు.
ఈ క్రమంలో శనివారం శేఖర్ తన అత్తామామతో పని నిమిత్తం అడవిలోకి వెళ్లారు. రాణి ఇంట్లో ఉండడంతో విషయం తెలుసుకున్న సత్యనారాయణ ఇదే అదనుగా భావించాడు. ఎవరూ లేని సమయం చూసి తన కొడలిని గొడ్డలి, కత్తితో దారుణం నరికి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిండు గర్భిణి హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదం అలముకుంది.