Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ముంబైలోని జుహు ప్రాంతంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి సుమారు 8:45 నుంచి 9 గంటల మధ్య అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి విమానాశ్రయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, జుహులోని గాంధీగ్రామ్ రోడ్ ఇస్కాన్ టెంపుల్ పరిసరాల్లో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఒక ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోరిక్షా తీవ్రంగా ధ్వంసమైంది. అయితే, అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నా ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించే అంశంగా మారింది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ గందరగోళం నెలకొనగా, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఆటోరిక్షా డ్రైవర్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని తక్షణమే సమీపంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, అయితే మెర్సిడెస్ కారు డ్రైవర్‌ను విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని తెలిపారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ కారు అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనం అని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఘటనపై అక్షయ్ కుమార్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. మరోవైపు, అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండటంతో, అభిమానులు హీరో క్షేమంగా ఉన్నాడన్న వార్తతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
