విధాత: వైద్య పరిశోధనలు..చికిత్స విధానాలతో వస్తున్న నూతన మార్పులు మానవుడు ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలకు పరిష్కారాలు అందిస్తున్నాయి. తాజాగా వైద్య చరిత్రలో మరో అద్బుత ఘటన ఆవిష్కృతమైంది. మరణించిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని అమర్చుకున్న యూకే మహిళ.. సంతానం పొందడం కొత్త చరిత్రను లిఖించింది.
యూకేలో గ్రేస్ బెల్(30) అనే మహిళ గర్భాశయం లేకుండా జన్మించింది. గర్భసంచి లేనందునా ఆమెకు పీరియడ్స్ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. సంతానం యోగం కోసం వైద్యులు ఆ మహిళకు చనిపోయిన దాత నుంచి సేకరించిన గర్భాశయాన్ని అమర్చారు. తాజాగా గ్రేస్ బెల్ లండన్ లోని ఓ ఆసుపత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. యూకేలో తొలిసారిగా ఈ ప్రయోగం విజయవంతమవ్వడం దేశ వైద్య చరిత్రలో రికార్డుగా నిలిచింది. క్రిస్మస్‌కు ముందు జన్మించిన ఆ బాలుడికి ‘హ్యూగో’ అని పేరు పెట్టారు. మరణించిన వారి నుంచి గర్భాశయాన్ని సేకరించి, గ్రహీత శరీరంలో అమర్చి, ఆ తర్వాత ఐవీఎఫ్ (IVF) ద్వారా పిండాన్ని ప్రవేశపెట్టడంతో సంతానం కలిగేలా వైద్యులు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.
గర్భాశయ వైకల్యంతో బాధపడే వేలాది మంది మహిళల్లో ఈ వైద్య విజయం కొత్త ఆశలు చిగురింపజేసింది.అంతకుముందు 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ మహిళ గర్భశయ దానం ద్వారా ఓ మహిళ అమీ అనే శిశువుకు జన్మనిచ్చింది. బ్రెజిల్‌లో కూడా కొన్ని నెలల క్రితం చనిపోయిన 45 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని 32 ఏళ్ల గ్రహీతకు మార్చి, 36 వారాల తర్వాత సిజేరియన్ ద్వారా ఆరోగ్యకరమైన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చికిత్స గర్భాశయం లేని మహిళలు తమ సొంత బిడ్డను మోయడానికి, ప్రసవించడానికి ఒక విప్లవాత్మకమైన మార్గంగా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ శస్త్రచికిత్స చాలా క్లిష్టమైనది కావడం, గర్భాశయ గ్రహీత నిరంతరం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సి ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. అందుకే గర్బాశయ మార్పిడి, అమరిక పద్దతిలో పిల్లలు పొందిన మహిళకు ఒకరిద్దరు పిల్లలకు జన్మనిచ్చాక గర్భసంచిని తొలగించి.. ఆమె జీవతాంతం రోగనిరోధక మందులు తీసుకోనవసరం లేకుండా వైద్యులు చర్యలు తీసుకుంటుండం ఆసక్తికరం.
ఇవి కూడా చదవండి :
Delhi Murder Case : ఢిల్లీలో దారుణం.. తల్లి, ముగ్గురు పిల్లల హత్య
Hyderabad Rains | హైదరాబాద్ లో మారిన వాతావరణం..పలుచోట్ల వర్షాలు
