Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. తండ్రి సెంటిమెంట్, భార్యాభర్తల బంధం, క్లీన్ కామెడీ, వింటేజ్ మెగాస్టార్ లుక్స్, వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్, అదిరిపోయే పాటలు, చిరంజీవి స్టెప్పులు అన్నీ కలసి ఈ సినిమాను పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిపాయి.
ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న మన శంకర వరప్రసాద్ గారు వసూళ్లలోనూ అదే ఊపు చూపించింది. విడుదలైన తొలి రోజే ఏకంగా రూ.84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. ఆ తర్వాత కూడా కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా కొనసాగాయి. ఆరు రోజుల్లోనే రూ.292 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించగా, తాజాగా నేడు ఫస్ట్ షో ఆటతో సినిమా రూ.300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఘన విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. సినిమాలో చిరంజీవి ‘300 కోట్లు’ అని రాసిన గోడను బద్దలు కొట్టే సీన్‌ను రీ క్రియేట్ చేస్తూ రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇక్కడితో ఈ సినిమా జోరు ఆగేలా కనిపించడం లేదు. రాబోయే రెండు వారాల పాటు పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో మన శంకర వరప్రసాద్ గారు డామినేషన్ కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో ఇంకా వంద కోట్ల వరకు అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు, అనిల్ రావిపూడి గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ.303 కోట్ల గ్రాస్ వసూలు చేసి రీజనల్ సినిమాల్లో కొత్త రికార్డ్ నెలకొల్పారు. ఇప్పుడు అదే రికార్డును తనే బద్దలు కొట్టే దిశగా మన శంకర వరప్రసాద్ గారు పరుగులు పెడుతోంది. రీజనల్, పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వందల కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం అనిల్ రావిపూడికే సాధ్యమని మరోసారి నిరూపితమైంది. మొత్తంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, తన వింటేజ్ స్టామినాను మరోసారి చాటి చెప్పి అభిమానులకు డబుల్ ట్రీట్ అందించారు.
