Bilawal Bhutto |
విధాత: భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధమంటూ జరిగితే ప్రవహించేది రక్తమే అని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో మరో సారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను ఆపేస్తే నదిలో రక్తం పారుతుందనే తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. తాను భారత్, పాకిస్తాన్ బార్డర్ లో తుపాకీతో నిలబడలేదని.. ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా తనకు ఆ పదవి లేదని..అయితే యుద్ధమంటూ వస్తే ఊరుకోమని భుట్టో చెప్పుకొచ్చారు. భారత ప్రధాని మోదీ చేసిన అతి పెద్ద తప్పు సింధు జలాల విషయంలో తీసుకున్న నిర్ణయమన్నారు. అది యుద్ధానికే దారి తీస్తుందని బిలావల్ భుట్టో అభిప్రాయపడ్డారు. అప్పుడు రక్తం ప్రవహించడం తప్పనిసరి అన్నారు.
పాకిస్తాన్ ప్రజలకు వ్యతిరేకంగా భారతదేశం నీటిని ఆయుధంగా మార్చాలనుకుంటే అది యుద్ధ చర్య అవుతుందని స్పష్టం చేశారు. సింధునది మీద తాను వ్యక్తపరిచిన భావాలు యధాలాపంగా చెప్పినవి కావని..అవి పాకిస్తాన్ ప్రజల భావాలను వ్యక్తపరచడమని తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు. ఈ విషయమై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. సింధు నది సింధ్ ప్రావిన్స్ గుండా ప్రవహిస్తుందని..సింధు లోయ నాగరికతలో భాగమైన పురాతన నగరం మొహెంజో దారో సింధూ ఒడ్డున వృద్ధి చెందిందని బిలావల్ భుట్టో గుర్తు చేశారు. కానీ ఆ నాగరికత లర్కానాలోని మొహెంజోదారోలో ఉందన్నారు. మేము దాని నిజమైన సంరక్షకులమని.. మేము దానిని రక్షించుకుంటాం అని ఆయన పేర్కొన్నారు.