Site icon vidhaatha

BRS సభపై KCR సమీక్ష.. ఎట్టకేలకు MLC కవిత హాజరు

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా పార్టీ రజతోత్సవ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో, సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు నాయకులకు చేశారు. ఈ సందర్భంగా సభ కోసం ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమ వివరాలను వరంగల్ జిల్లా నాయకుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సభకు వారం రోజుల గడవు మాత్రమే ఉన్నందున మిగిలిన ఏర్పాట్లు, భారీ జన సమీకరణ పై కేంద్రకరించాలని కెసిఆర్ సూచించారు. దీనికోసం అవసరమైన చర్యలు వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ముఖ్యంగా వాహనాలను అందుబాటులో పెట్టుకోవాలని చెప్పారు. వరంగల్లో రజతోత్సవ సభ నిర్వహించాలనే నిర్ణయం జరిగినప్పటి నుంచి పరోక్షంగా సభ ఏర్పాట్లు, జన సమీకరణ, సభ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఇతర ఆర్థికంతోపాటు అన్ని అంశాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముందుగా సభ నిర్వహణ బాధ్యతలను సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అప్పగించినప్పటికీ తదుపరి ఆయన నిర్ణయంలో మార్పు జరిగినట్లు భావిస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఎప్పటికప్పుడు వరంగల్ జిల్లా నాయకులతో పాటు ఇతర జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూనే అవసరమైన సూచనలను అందిస్తున్నట్లు చెబుతున్నారు.

కెసిఆర్ తో సమావేశానికి కవిత హాజరు

ఇదిలా ఉండగా ఈ సమావేశానికి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కావడం ఆసక్తికరంగా మారింది. రజతోత్సవ సభ తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు కవిత ఎక్కడా కనిపించకపోవడంతో సభకు ఆమెను దూరంగా పెడుతున్నారని చర్చ గులాబీ వర్గాల్లో సాగుతూ వస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్యలో ఉన్న ఆధిపత్య పోటీ నేపథ్యంలో కవితకును దూరం పెడుతున్నారని, ఆమెకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని పార్టీలో ఒక రకమైన చర్చ సాగుతూ వస్తోంది.

ఈ దశలో శుక్రవారం కేసీఆర్ తో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల సమావేశంలో కవిత పాల్గొనడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమావేశానికి హాజరుకాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో కలిసి సమావేశానికి హాజరుకావడమే కాకుండా ఈ సమావేశంలో సభకు హాజరయ్యే మహిళలకు అవసరమైన ఏర్పాట్లపై చర్చించడం విశేషం. ఈ సమావేశానికి ఇతర జిల్లాల మహిళా నాయకులు కూడా హాజరు కావడం గమనార్హం. కవిత హాజరుతో తనకు తగిన ప్రాధాన్యత ఉందని చాటి చెప్పినట్టుగా బీఆర్ఎస్ లోని ఆమె అనుకూల వర్గం భావిస్తోంది.

కెసిఆర్ తో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న వారిలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ కుమార్, పార్టీ మహిళా నేతలు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, టీఎస్‌పీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా తనోబా, గిడ్డంగుల శాఖ మాజీ ఛైర్పర్సన్ రజినీ సాయిచంద్, నవీనాచారి, పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు, కల్వకుంట్ల వంశీధర్ రావు పాల్గొన్నారు.

Exit mobile version