Site icon vidhaatha

Warangal: సురేఖమ్మా.. గడీ దాటిరా

విధాత, వరంగల్: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీసం వీల్‌చైర్లు, స్ర్టేచర్లు, బెడ్లు, ఆక్సీజన్‌, 2డీ, ఈసీజీ లాంటి మౌలిక వసతులు కూడా లేవని విమర్శించారు. వరంగల్‌ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా ఏం లాభం అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్‌ ప్రజల ఆత్మగౌరవ పోరాటం పేరుతో బుధవారం ఎంజీఎం ఆస్పత్రి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ సీఎం వద్దకు వెళ్లి పేదల ఆస్పత్రి అయిన ఎంజీఎం దుస్థితి వివరించలేని దద్దమమ్మలు అంటూ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన సురేఖ ఒక్కరోజైనా ఆస్పత్రి గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. ఆమెకు కావాల్సింది ఓట్లు, రాజభోగాలు మాత్రమేనని, ప్రజలు ఏమైనా ఆమెకు పట్టదని, అవసమైతే తప్ప గడి నుంచి బయటకు రారని ఆరోపించారు.

ఈ ధర్నాలో వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ మాట్లాడుతూ నిన్ను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రి పదవి అందిస్తే నీవు ఒరగబెట్టింది ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఎంజీఎం దయనీయస్థితిపై వారు మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. మంత్రి కొండా సురేఖ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి కొండా సురేఖమ్మా.. గడీదాటి బయటికిరా.. ఒక్కసారి ఎంజీఎం దుస్థితి చూడు.. ప్రజలు నీకు ఓట్లు వేసింది వారు చావడానికా.. అంటూ విమర్శించారు. రేవంత్‌ సర్కాలు అన్నివిధాలా విఫలం..సీఎం రేవంత్‌రెడ్డి ఓ అసమర్థ సీఎం, ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని రవికుమార్‌ విమర్శించారు. వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధాని చేస్తానని ఊకదంపుడు ప్రచారం తప్ప చేసిందేమీలేదన్నారు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంలో సమస్యలు తాండవిస్తుంటే ఒక్కసారైనా ఆస్పత్రిని విజిట్‌ చేశారా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఒక్కసారి ఎంజీఎంకు రా… పేద బిడ్డల ఆక్రందనలు ఏమిటో తెలుస్తాయంటూ హితువు పలికారు.

ఇక వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఉన్నాడా అన్న అనుమానం వస్తోందని రవికుమార్‌ ఎద్దేవా చేశారు. కనీసం ఆయనకు ఎంజీఎం అంటూ ఒకటి ఉందన్న విషయం తెలియనట్టుందని విమర్శించారు. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్లు, ఆధిపత్య పోరు తప్ప ఎంజీఎంను బాగు చేయాలన్న సోయి ఏమాత్రం లేదని విమర్శించారు. ఇప్పటికైనా పాలకులు స్పందించాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఎంజీఎం సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మారుతినేని ధర్మారావు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్, కంభంపాటి పుల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్, వన్నాల వెంకటరమణ, చాడ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరి శంకర్, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు వివిధ మోర్చాల నాయకులు, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Exit mobile version