- కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వివాదం
- స్వల్ప లాఠీచార్జి చేసిన పోలీసులు
- కోలాటాలు, డాన్సులు, డీజేల హంగామా
- మొక్కులు సమర్పించుకున్న నాయకులు
Kommala Jathara:
విధాత ప్రత్యేక ప్రతినిధి: కొమ్మాల జాతర రాజకీయ ప్రభ బండ్లతో హోరెత్తింది. కోలాటాలు, డాన్సులు, డీజేల హంగామా కొనసాగుతున్నది. జాతర భక్త జనంతో పోటెత్తింది. జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. శుక్రవారం ప్రభ బండ్ల రాక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వివాదం నెలకొంది. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్ట సోరికలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర అత్యంత ఘనంగా ప్రారంభమై కన్నుల పండుగగా సాగుతోంది. వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొనేందుకు మొక్కులు సమర్పించేందుకు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు సంప్రదాయ పద్ధతిలో కుటుంబాలతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో తరలివచ్చారు. వేలాదిమంది భక్తుల రాకతో కొమ్మాల జాతర పరిసరాలు హోరెత్తాయి. రాజకీయ ఆధిపత్యం కోసం ఈ జాతరను వేదికగా వినియోగించుకోవడం దశాబ్దాలుగా వస్తోంది. కొమ్మాల ప్రాంతం పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ మండలంలో ఉండగా జాతరలో మాత్రం నర్సంపేట ప్రాంత రాజకీయ నాయకుల ప్రభ బండ్ల మధ్య పోటీ కొనసాగుతోంది.
రాజకీయ ప్రభల పోటాపోటీ
కొమ్మాల జాతరలో కాంగ్రెస్, గులాబీ, కమ్యూనిస్టులు నాయకులు ప్రభ బండ్లతో పోటీపడ్డారు. నర్సంపేట ఎమ్మెల్యేగా, కమ్యూనిస్టు నేత మద్దికాయల ఓంకార్ కొనసాగిన కాలంలో జాతర ఎరుపు మయంగా కనిపించేది. ప్రభ బండ్లను సాగనంపేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేది. రెండు రాజకీయ పార్టీల ప్రభ బండ్లు ఎదురెదురైతే ఉద్రిక్తతలు నెలకొంటాయి. ఈ వారసత్వం కొనసాగుతోంది. శుక్రవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు స్వల్ప లాఠీఛార్జిచేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇదిలాఉండగా జాతరలో స్థానిక ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఎం సి పి ఐ నాయకులు తమ పార్టీల ప్రభ బండ్లతో ప్రదర్శనలు జరిపారు.