– వర్షాకాలంలో భారీ అద్దంలా మారే మైదానం
– ప్రపంచంలోనే అతిపెద్ద సహజ అద్దం
Uyuni Salt Flat: బొలీవియా దేశంలోని ఆండియా పర్వతాల్లో ఉన్న సలార్ డి ఉయుని ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు మైదానంగా చెప్పుకుంటారు. ఈ మైదానం వర్షాకాలంలో భారీ అద్దంలా మారిపోయి ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈ వింతను చూసేందుకు ప్రస్తుతం ప్రపంచదేశాల్లోని పర్యాటక ప్రేమికులు తరలివస్తున్నారు. అండీస్ పర్వతాల్లో సముద్రమట్టానికి దాదాపుగా 3656 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంది.
సుమారుగా 10,582 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సహజసిద్ధమైన అద్దంగా పిలుస్తూ ఉంటారు.
ఈ ఉప్పు మైదానం ఎలా ఏర్పడింది..
వేల ఏండ్ల క్రితం ఇక్కడ లాగో మిన్చిన్ అనే సరస్సు ఉండేదట. ఆ సరస్సులో నీరంతా ఇంకిపోవడం వల్ల ఈ ఉప్పు మైదానం ఏర్పడి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు.
సరస్సు ఆవిరైపోయిన తర్వాత, దాని ఉప్పు నిక్షేపాలతో విశాలమైన ఉప్పు మైదానంగా మారాయి. ఈ ప్రదేశం లిథియం, సోడియం, పొటాషియం, మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలకు ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని లిథియం నిల్వలలో సగానికి పైగా ఈ ప్రాంతంలోనే ఉన్నాయని అంచనా.
ఏకాలంలో ఇక్కడికి వెళ్లాలి..
డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇక్కడ వర్షాకాలం. ఆ సమయంలోనే ఈ ఉప్పు మైదానం భారీ అద్దంగా మారిపోతుంది. ఉప్పు ఉపరితలంపై పేరుకుపోవడంతో, ఆకాశం మరియు చుట్టుపక్కల పర్వతాలు స్పష్టంగా దీని మీద కనిపిస్తాయి. దీంతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఈ ఉప్పు మైదానం మధ్యలో ఇస్లా ఇంకావాసి అనే చిన్న ద్వీపం ఉంది. ఈ ద్వీపం కూడా పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది.
ఈ ప్రాంతంలోని చిన్న నీటి కొలనులలో అరుదైన పక్షులను కూడా చూడవచ్చు. రాత్రి సమయాల్లోనూ ఈ ప్రదేశం ఎంతో సుందరంగా ఉంటుందని పర్యాటకులు చెబుతుంటారు. సలార్ డి ఉయుని ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు, పర్యాటకు ప్రియులకు ఒక ప్రధాన గమ్యస్థానం. ఈ ప్రదేశంలో జీప్ టూర్లు, సైక్లింగ్, గైడెడ్ ట్రెక్కింగ్ వంటి అనేక కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. స్థానిక గైడ్‌లు పర్యాటకులకు ఈ ప్రాంతంలోని చరిత్ర మరియు పర్యావరణ గురించి వివరిస్తారు. అలాగే, ఉప్పు బ్లాక్‌లతో నిర్మించిన హోటల్స్‌లో బస చేయడం కూడా ఒక ప్రత్యేక అనుభవం.