ఏపీలోనూ వర్షాలు పడే అవకాశం: వాతావరణశాఖ
Rains in Telangana: వాతావరణశాఖ ముందుగా చెప్పినట్టుగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందే వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను నైరుతి పవనాలు తాకాయని వీటి ప్రభావంతో నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. తెలుగురాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తున్నది.
ఏపీలోని దక్షిణకోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ముందే రాష్ట్రానికి రావడంతో తెలంగాణలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ధాన్యం సేకరణ పూర్తి కాలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. అక్కడ రైతులు ఆందోళన చెందుతున్నారు.