Site icon vidhaatha

రాహుల్ గాంధీపై.. సుప్రీం కోర్టు అసహనం

విధాత: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. వీర్‌ సావర్కర్‌పై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీర సావర్కర్ కు మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మరోసారి సావర్కర్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయవద్ధని మందలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఎగతాళి చేయడం తగదని.. మళ్లీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులపై ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి అనుమతించమని పేర్కొంది. వారిని అపహాస్యం చేస్తే ఇకపై కోర్టు సుమోటోగా విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ కేసు తాత్కాలికంగా నిలిపివేత

వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీపై నమోదైన క్రిమినల్ కేసును సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ కేసును నృపేంద్ర పాండే అనే వ్యక్తి దాఖలు చేయగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిలో ఒక పక్షంగా ఉంది. ఇరు పక్షాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో అలహాబాద్ హైకోర్టు తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలనే రాహుల్ గాంధీ అభ్యర్థనను అక్కడి కోర్టు తిరస్కరించింది.ఈ తీర్పును ఆయన సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఈ విషయంపై విచారణ జరిపిన ధర్మాసనం రాహుల్ ను మందలించింది.

రాహుల్ కు రూ.200 జరిమానా

మహారాష్ట్రలో 2022లో మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ వీర్ సావర్కర్‌ బ్రిటిష్‌ సేవకుడని, వారి నుంచి పెన్షన్‌ కూడా తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుడైన వీర్‌ సావర్కర్‌ను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ నృపేంద్ర పాండే అనే వ్యక్తి యూపీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని అందులో పేర్కొన్నారు. అయితే, దీనిపై అనేకసార్లు విచారణకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని న్యాయస్థానం రాహుల్‌కు రూ.200 జరిమానా విధించింది.

Exit mobile version