Disney+ Hotstar | పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు డిస్నీ హాట్‌స్టార్‌ మంగళం..! షేర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవ్‌..!

  • Publish Date - October 1, 2023 / 05:55 AM IST

 

Disney+ Hotstar | కరోనా మహమ్మారి తర్వాత థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో సినిమాలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ఓటీటీలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతుండడంతో అందరూ అటువైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ ఫ్లాట్‌ఫారాలు సైతం కొత్త కొత్త నిబంధనలు తీసుకువస్తున్నాయి. పలు కంపెనీలు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ విధానానికి స్వస్తి పలికాయి. మరికొన్ని సైతం ఇదే బాటలో పయనిస్తున్నాయి.

 

 

 

తాజాగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్‌ షేరింగ్‌కు స్వస్తి చెప్పాలని భావిస్తున్నది. సబ్‌స్క్రైబర్ పాస్‌వర్డ్ షేరింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నది. హాట్‌స్టార్ కెనడాలో పాలసీని సైతం సవరించింది. పాస్‌వర్డ్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నవంబర్‌ ఒకటి నుంచి పాస్‌వర్డ్‌ షేరింగ్‌ చేయకుండా కొత్త విధానాన్ని అమలులోకి తెస్తున్నది.

 

 

 

ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌ సైతం పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై నిషేధం విధించింది. ఇప్పుడు ఇదే బాటలో డిస్నీ హాట్‌స్టార్‌ సైతం నడుస్తున్నది. ఇటీవల తన కెనడియన్ సబ్‌స్క్రైబర్లకు ఒప్పందాన్ని మారుస్తున్నట్లుగా ఈ మెయిల్స్‌ పంపింది. నవంబర్ ఒకటి నుంచి మెంబర్‌షిప్ కలిగిన యూజర్లు అకౌంట్ షేరింగ్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది.

 

 

 

అకౌంట్ షేర్ చేసే వినియోగదారులను హాట్‌స్టార్‌ ట్రాక్‌ చేయనున్నది. సంబంధిత సబ్‌స్క్రైబర్ పాస్‌వర్డ్ షేర్ చేస్తున్నాడని తెలిస్తే ఖాతాను పరిమితం చేయడం లేకపోతే.. పూర్తి రద్దు చేయడం వంటి నిర్ణయం తీసుకోన్నట్లు వెల్లడించింది.

 

 

ప్రస్తుతం కెనడాలో ఈ నిబంధనలు అమలవుతుండగా.. భారత్‌లోనూ త్వరలోనే ఈ నిబంధనలు అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. మరో వైపు పాస్‌వర్డ్ షేరింగ్ అడ్డుకట్ట వేసేందుకు హాట్ స్టార్ యాడ్-సపోర్టెడ్ ప్లాన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

Latest News