బీజేపీ మెజారిటీ మార్క్‌ చేరకపోతే ఏమైనా జరగొచ్చు!

బీజేపీ 2014లో 272, 2019లో 303 గెలుచుకున్నది. దీంతో ఇతరపార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ వచ్చింది. దీంతో 2-014 మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన నితీశ్‌ నేతృత్వంలోని జేడీయూ అనివార్యంగా ఎన్డీఏలో కొనసాగింది

  • Publish Date - June 4, 2024 / 02:07 PM IST

బీజేపీ 2014లో 272, 2019లో 303 గెలుచుకున్నది. దీంతో ఇతరపార్టీల మద్దతు లేకుండానే ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మెజారిటీ వచ్చింది. దీంతో 2-014 మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన నితీశ్‌ నేతృత్వంలోని జేడీయూ అనివార్యంగా ఎన్డీఏలో కొనసాగింది. పదేళ్లలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించినా మౌనంగా ఉన్నాయి. దీనికితోడు ఎన్డీలో దశాబ్ద కాలంగా కొనసాగిన శివసేలో చీలికకు కారణం బీజేపీ. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకస్తూ అకాలీదళ్‌ ఎన్డీఏ నుంచి బైటికి వచ్చింది. తమిళనాడులోనూ బీజేపీ సొంతంగా ఎదగడం కోసం పన్నీర్‌సెల్వం, పళనీస్వామిల మధ్య సయోధ్య కుదర్చకుండా రెండు గ్రూపులుగా విడగొట్టింది. దీంతో పంజాబ్‌, తమిళనాడు లలో బీజేపీకి గెలువలేదు. ఆ పార్టీ విచ్ఛిన్న రాజకీయాల వల్ల బలహీనపడిన పార్టీలూ ఓడిపోయాయి. మహారాష్ట్రలో శివసేన (శిండే) ఎన్సీపీ (అజిత్‌పవార్‌), రాజ్‌ఠాక్రేలను కలుపుకున్నా కమలం పార్టీ గత ఫలితాలను పునరావృతం చేయలేకపోయింది.

ఇవాళ బీజేపీ మెజారిటీ మార్క్‌కు దూరంగా ఉండటానికి కారణం ఆ పార్టీనే. ఎందుకంటే మొత్తం 543 సీట్లలోబీజేపీనే 430 సీట్లకుపైగా పోటీ చేసింది. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేదనే ఏడు దశల పోలింగ్‌ సరళీని అంచనా వేసిన రాజకీయ విశ్లేషణలే నిజమయ్యేలా ఉన్నాయి.ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు, మోడీ ప్రభుత్వ మనుగడ టీడీపీ, జేడీయూలపై ఆధారపడి ఉన్నది. ప్రస్తుతం టీడీపీ 16, జేడీయూ 15 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 2014 ఎన్నికల సమయంలో మోడీ నాయకత్వాన్ని నితీశ్‌కుమార్‌, చంద్రబాబు లు బహిరంగంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ రెండు పార్టీలు రాజకీయ పరిణామాలు, రాజకీయ అవసరాలతో ఎన్డీకు మద్దతు ఇచ్చాయి.

బీజేపీ బలంగా ఉన్నంత వరకే ఎన్డీఏ కూటమిలోని పార్టీలు అందులో కొనసాగుతాయనే వాదన ఉన్నది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బీజేపీ సొంతంగా గెలుచుకునే స్థానాలు 240-50 మధ్యే ఉండేలా కనిపిస్తున్నది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకవేళ చంద్రబాబు, నితీశ్‌ వీళ్లిద్దరూ మనసు మార్చుకుంటే ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడం సాధ్యం కాదు. ఏపీలో టీడీపీ వచ్చే సీట్ల ఆధారంగా తాను కేంద్ర రాజకీయాలకు వెళ్లి, లోకేశ్‌ను సీఎం చేయాలని భావిస్తే పార్టీలోనూ వ్యతిరేకత రాకపోవచ్చు. ఇక నితీశ్‌కు ప్రధాని కావాలనే కోరిక ఉన్నది. ఆయన ఇండియా కూటమి కన్వీనర్‌ బాధ్యతలు చేపట్టాలని అనుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో కీలక పదవి కట్టబెడుతామని ఆఫర్‌ వస్తే ఎన్డీఏ కూటమి నుంచి బైటకి వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు నితీశ్‌ బీహార్ లో తన సీటు కాపాడుకోవడానికి కూటములు మార్చిన చరిత్ర ఉన్నది.

అలాగే ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ, టీఎంసీ, ఆప్‌, డీఎంకే, శివసేస (యూబీటీ) ఎన్సీపీ (శరద్‌పవార్‌) ఆర్జేడీ పార్టీల లక్ష్యం మూడోసారి బీజేపీ అధికారంలోకి రావొద్దు అన్నదే. అందుకే ప్రధాని పదవి కంటే మోడీని నిలువరించడానికి రాజీపడితే రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తర్వాత నకిలీ శివసేన, ఎన్సీపీ (ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌లను ఉద్దేశించి) అసలైన శివసేన, ఎన్పీసీలతో కలిసి పనిచేయాల్సి వస్తుందన్నాడు. ఒకవేళ మోడీ సూచన మేరకు చీలిపోయిన పార్టీల నేతలు కలిసిపోతే కాషాయపార్టీకి మరిన్ని కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News