Site icon vidhaatha

CM Revanth Reddy | సుప్రీం కోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

cm-revanth-reddy-supreme-court-relief-land-case

CM Revanth Reddy | న్యూఢిల్లీ : భూ వివాదం కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని 2016లో రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌ రెడ్డి, లక్ష్మయ్య పై ఎన్.పెద్దిరాజు ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పీఎస్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనపై కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు..ఫిర్యాదు దారు ఆరోపణల్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని పెద్దిరాజు వేసిన కేసును కొట్టివేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పెద్దిరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిష్ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం డిస్మిస్‌ చేసింది.

పిటిషనర్, న్యాయవాదికి కోర్టు ధిక్కరణ నోటీసులు

అంతేకాకుండా పిటిషన్‌లో.. ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని సీజేఐ జస్టిస్‌ గవాయ్‌ పిటిషనర్ పైన, న్యాయవాది రితేష్ పాటిల్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేస్తూ .. పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని సీజేఐ మండిపడ్డారు. ఎన్‌.పెద్దిరాజుతోపాటు ఆయన తరఫు న్యాయవాది రితేష్‌ పాటిల్‌కు ధర్మాసనం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు పిటిషనర్‌ పెద్దిరాజు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. అయితే పిటిషనర్‌ తరఫు న్యాయవాది రితీష్ పాటిల్‌ క్షమాపణ కోరారు. అందుకు నిరాకరించిన సీజేఐ..పిటిషన్‌ రాసేటప్పుడు, దాఖలు చేసేటప్పుడు గుడ్డిగా ఎలా వేశారని ప్రశ్నించారు. పిటిషన్‌ ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని న్యాయవాది రితీష్‌ పాటిల్‌ కోరగా.. అందుకు కూడా సీజేఐ నిరాకరించారు. పిటిషన్‌ దాఖలు చేసే ముందు న్యాయవాదిగా అన్ని విషయాలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ ప్రశ్నించారు. కోర్టు ధిక్కరణ నోటీసుపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. సమాధానం ఆమోదయోగ్యంగా ఉంటేనే కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేస్తూ… విచారణ ఆగస్టు 11కు వాయిదా వేశారు.

Exit mobile version