Jailer Review | జైలర్ సినిమా రివ్యూ.. ఫ్యాన్స్ ఎగరేసుకోవచ్చు ‘కాలర్’

Jailer Review | మూవీ పేరు: ‘జైలర్’ విడుదల తేదీ: 10 ఆగస్ట్, 2023 నటీనటులు: రజనీకాంత్, తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్, మిర్నా మీనన్ తదితరులు సినిమాటోగ్రపీ: విజయ్ కార్తీక్ కన్నన్ ఎడిటింగ్: ఆర్.నిర్మల్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ నిర్మాత: కళానిధిమారన్ రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోలలో ఆయన ఒకరు. […]

  • Publish Date - August 11, 2023 / 03:09 PM IST

Jailer Review |

మూవీ పేరు: ‘జైలర్
విడుదల తేదీ: 10 ఆగస్ట్, 2023
నటీనటులు: రజనీకాంత్, తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్, మిర్నా మీనన్ తదితరులు
సినిమాటోగ్రపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటింగ్: ఆర్.నిర్మల్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: కళానిధిమారన్
రచన, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సొంతం చేసుకున్న అతి కొద్ది మంది హీరోలలో ఆయన ఒకరు. ఆయన నుంచి సినిమా వస్తుందీ అంటే.. అది కేవలం కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా హడావుడి నెలకొంటుంది. అటువంటి రజనీకాంత్ నుంచి ఈ మధ్యకాలంలో అంటే.. 2010లో వచ్చిన ‘ఎంథిరన్’ (రోబో) తర్వాత సరైన సినిమా, సరైన హిట్ పడలేదనే చెప్పుకోవాలి.

‘లింగా, పేట, కాలా, దర్బార్, పెద్దన్న’ ఇలా సినిమాలైతే వస్తున్నాయి కానీ.. రజనీకాంత్‌కి హిట్టు, ఆయన ఫ్యాన్స్‌కి కిక్కు ఇవ్వలేక పోతున్నాయి. ఆఖరికి శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా వచ్చిన ‘2.ఓ’ కూడా ప్రేక్షకులకు సరైన మజా ఇవ్వలేక పోయింది. ఆ సినిమా ఓకే అంటే ఓకే అన్నట్లుగా ముగిసింది. మధ్యలో కొన్నాళ్లు రాజకీయాలంటూ గ్యాప్ తీసుకున్న రజనీకాంత్.. ఆ తర్వాత అవి మనకు పడవనేలా నిర్ణయం తీసుకుని.. మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు.

ఈ క్రమంలో రజనీకాంత్ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుంది. చివరిగా ఆయన చేసిన చిత్రం ‘అణ్ణాత్తే’. తెలుగులో ‘పెద్దన్న’గా విడుదలైంది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడలేక పోయింది. ‘పెద్దన్న’ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్‌తో వస్తున్న ‘జైలర్’పై ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఆశపెట్టుకున్నారు. దర్శకుడు నెల్సన్‌కు పెద్దగా అనుభవం లేకపోయినప్పటికీ.. మొదటి నుంచి ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న టాక్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఎక్కడో హోప్ పెంచేశాయి.

దీంతో ఒక్కసారిగా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేశాయి. నెల్సన్ సినిమాలు హాస్య ప్రధానంగా ఉంటాయి. దానికి రజనీ మార్క్ యాడ్ అయితే.. ఖచ్చితంగా హిట్ వస్తుందనే ఊహలో ఉన్న ఫ్యాన్స్‌కి ‘జైలర్’ ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. సినిమా రిలీజ్‌కు ముందు ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్.. రిలీజ్ తర్వాత పాజటివ్ టాక్‌గా కన్వర్ట్ అయిందా? అసలీ ‘జైలర్’లో ఉన్న మ్యాటరేంటో మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

కథగా చెప్పడానికి ఇందులో పెద్దగా కథేం లేదు. ఈ మధ్య కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ ఛాయలతో, ‘బాషా’ టైప్ బ్యాక్‌డ్రాప్‌తో రాసుకున్న కథ ఇది. జైలర్‌గా చేసి రిటైర్డ్ అయిన పోలీస్ ఆఫీసర్.. ముత్తు అలియాస్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్). ఉద్యోగ విరమణ అనంతరం ఫ్యామిలీతో (భార్య, కొడుకు, కోడలు, మనవడు) హాయిగా జీవితం కొనసాగిస్తుంటాడు. ముత్తు కొడుకు అర్జున్ (వసంత్ రవి) కూడా పోలీస్ ఆఫీసరే. తను ఎలాగైతే నీతి, నిజాయితీతో పని చేసి రిటైర్ అయ్యాడో.. తన కొడుకు ఏసీపీ అర్జున్ కూడా అంతే నీతి, నిజాయితీతో పని చేస్తున్నందుకు ముత్తు మురిసిపోతుంటాడు. మనవడు అంటే ఆయనకు ప్రాణం.

ఇలా గడిచిపోతున్న జీవితంలో.. సడెన్‌గా అర్జున్‌ కిడ్నాప్ అవుతాడు. ఓ విగ్రహాల దొంగతనం కేసు విషయంలో ఇన్విస్టిగేషన్ స్టార్ట్ చేసిన అర్జున్‌ కిడ్నాప్ అవడం, పోలీస్ ఇన్విస్టిగేషన్‌లో అతను చని పోయాడనే న్యూస్ రావడంతో.. ముత్తు కృంగిపోతాడు. అదే సమయంలో విగ్రహాలను దొంగతలం చేసే ముఠా నాయకుడైన వర్మ (వినాయకన్).. ముత్తు కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. తన కొడుకు కిడ్నాప్‌కి, మరణానికి కారణం ఎవరనేది తెలుసుకోవడానికి ముత్తు రంగంలోకి దిగుతాడు. ఆ కారణాన్ని తెలుసుకు న్నాడా? ఏంటా కారణం? తెలుసుకుని ముత్తు ఏం చేశాడు? వర్మ బారి నుంచి తన ఫ్యామిలీని ముత్తు ఎలా కాపాడుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ముందుగా నటీనటుల గురించి చెప్పుకుంటే.. ఈ సినిమా అంతా రజనీకాంత్ వన్ మాన్ షో అని చెప్పుకోవాలి. ఆయన వయసుకి, ఆయన మ్యానరిజమ్స్‌కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యే చిత్రమిది. చాలా న్యాచురల్‌గా ఇందులో రజనీ కనిపిస్తాడు. విక్రమ్ సినిమాలో ఎలా అయితే ఎలివేషన్స్ ఉంటాయో.. రజనీ కనిపించిన ప్రతిసారి ఏదో ఒక ఎలివేషన్‌తో ఫ్యాన్స్‌కి దర్శకుడు ట్రీట్ ఇచ్చాడు.

అలాగే రజనీకాంత్ ఇందులో చేసిన కామెడీ, పలికించిన ఎమోషన్స్.. ఒక్కటేమిటి? చాలాకాలంగా రజనీకాంత్ నుంచి మిస్ అవుతున్నవన్నీ ఇందులో ఉన్నాయి. వాటన్నింటికీ రజనీ న్యాయం చేశాడు. సూపర్‌స్టార్‌ని ఎలా చూడాలనుకుంటారో.. అలా ఇందులో చూపించాడు దర్శకుడు. తమన్నా పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. ఓ పాట కోసం ఆమెను తీసుకున్నట్లుగా అనిపించింది. మరీ పాట అంటే బాగోదని.. ఓ రెండు మూడు సీన్లు యాడ్ చేశారు.

కమెడియన్స్ యోగిబాబు, విటి గణేషన్‌లకు మంచి పాత్రలు పడ్డాయి. కడుపుబ్బా నవ్విస్తారు. ఇక విలన్‌గా చేసిన వినాయకన్ ఈ సినిమాకు మరో పిల్లర్‌గా నిలబడ్డాడు. వినాయకన్ తెలుగులో కూడా బిజీ నటుడయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆయన పాత్రని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. అంతే చక్కగా విలనిజం పండించాడు వినాయకన్. నరసింహగా శివ రాజ్ కుమార్, మాథ్యూగా మోహన్‌లాల్ గెస్ట్ పాత్రలో కాసేపు కనిపించారు. ఇంకా జాకీష్రాఫ్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్, సునీల్, నాగబాబు వంటి వారంతా వారి పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. క్వాలీటీ విషయంలో నిర్మాతలు వెనుకాడలేదనేలా.. పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనబడుతుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలెట్ ఏంటయ్యా అంటే మాత్రం ఖచ్చితంగా అనిరుధ్ మ్యూజిక్, నేపథ్య సంగీతం అనే చెప్పాలి. రజనీ అంటే తనకు ఎంత ఇష్టమో.. ఆ ఇష్టాన్ని బీజీఎమ్‌లో చూపించాడు. సినిమా డౌన్ అవుతుందనే ప్రతీసారి.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో లేపేశాడు అనిరుధ్.

అతని తర్వాత సినిమాటోగ్రఫీ. క్యారెక్టర్స్‌ని చూపించడంలో కానీ, సీన్స్‌ని అందంగా చిత్రీకరించడంలో కెమెరామ్యాన్ తన ప్రతిభను కనబరిచాడు. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్‌పై కాస్త దృష్టి పెట్టాల్సింది. ఫస్టాఫ్ ఉన్నంత క్రిస్ప్‌గా సెకండాఫ్ లేదనే చెప్పాలి. బహుశా.. ఫస్టాఫ్ కామెడీ ఉండటంతో.. జనాలకు పెద్దగా ల్యాగ్ తెలియకపోవచ్చు. సెకండాఫ్ విషయంలో మాత్రం ప్రేక్షకులకి ఆ విషయం తెలిసిపోతుంది.

ఇంకా ఇతర సాంకేతిక నిపుణులందరూ రజనీపై తమ ఇష్టాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించిన తీరు, అందుకోసం ఎన్నుకున్న పాత్రల విషయంలో మాత్రం అభినందించాలి. అలాగే ఫస్టాఫ్‌పై పెట్టిన శ్రద్ధ.. సెకండాఫ్‌పై కూడా పెట్టి ఉంటే మాత్రం.. ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిలో పరిపూర్ణ విజయాన్ని సాధించేది. అలా అనీ సెకండాఫ్ ఏం బాగాలేదని చెప్పలేం.. రజనీకాంత్‌ని ఎలివేట్ చేసే ప్రక్రియలో సెకండాప్ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది.

విశ్లేషణ:

ఫస్ట్ రజనీకాంత్ వయసుని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కథని, లుక్‌ని సెట్ చేసిన దర్శకుడు నెల్సన్‌ని అభినందించాలి. దర్శకుడికి మూడు సినిమాల అనుభవం కూడా లేదు. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని డైరెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు. రజనీకాంత్ నుంచి ప్రేక్షకులకు ఏమేం కావాలో.. ఎలా చూపిస్తే ఆయనని ప్రేక్షకులు ఇష్ట పడతారో.. అన్నీ బేరీజు వేసుకుని మరీ షూటింగ్‌కి వెళ్లిపోయినట్లుగా అనిపిస్తుంది.

ముఖ్యంగా రజనీకాంత్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా ‘బాషా’. దర్శకుడికి కూడా అదే సినిమా మైండ్‌లో ఉన్నట్లుంది. కాకపోతే.. 70 ప్లస్ ఏజ్ ఉన్న రజనీకాంత్‌ని అలాంటి తరహా పాత్రలో మళ్లీ ప్రజంట్ చేయడం అంటే మాములు విషయం కాదు. అందుకే ఈ ఏజ్‌కి సరిపడా హీరోయిజాన్ని నెల్సన్ క్రియేట్ చేశాడు. ఇంట్లో సాదాసీదాగా, ఒక పిల్లిలాగా ఉండే రజనీని చూపిస్తూనే.. టైమ్ వచ్చినప్పుడు అతనిలోని ‘టైగర్‌’ని చూపిస్తూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన విధానం.. ఫ్యాన్స్‌కి పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది.

సినిమా నడక అంతా ‘విక్రమ్’నే పోలి ఉంటుంది. మాఫియా, ఫ్యామిలీ, రివేంజ్ వంటి అంశాలతోనే ఈ కథని దర్శకుడు రాసుకున్నాడు. అయితే ఫస్టాఫ్ అంతా హిలేరియస్‌గా ఎంటర్‌టైన్ చేసి.. ఇంటర్వెల్‌కి పీక్స్ అనే రేంజ్‌లో ఇంట్రస్ట్ తెప్పించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో మాత్రం ఆ మ్యాజిక్‌ని క్రియేట్ చేయలేక పోయాడనే చెప్పుకోవాలి. క్లైమాక్స్, అంతకు ముందు వచ్చే సీన్లలో పండించిన ఎమోషన్స్‌తో ఒక్కసారిగా మళ్లీ ప్రేక్షకులలో ఉత్సాహం వస్తుంది. ఓవరాల్‌గా అయితే.. ఈ మధ్య కాలంలో రజనీకాంత్‌ని, ఆయన ఫ్యాన్స్‌ని ఊరిస్తున్న హిట్ మాట.. ఈ సినిమా విషయంలో వినబడే అవకాశం ఉంది.

మంచి ఓపెనింగ్ కూడా కుదిరింది. కాబట్టి.. ఈ ‘జైలర్’ డ్యూటీకి అడ్డే ఉండదు. కాకపోతే.. ఇటీవల తెలుగు దేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై.. అవమానాలను ఫేస్ చేసిన రజనీకాంత్.. ప్రమోషన్స్ విషయంలో మాత్రం టాలీవుడ్‌ని అస్సలు పట్టించుకోలేదు. ఆ ప్రభావం ఏమైనా ఉంటుందేమో తెలియదు కానీ.. సినిమా పరంగా అయితే జనాలని ఎంటర్‌టైన్ చేసే కంటెంట్ ఇందులో ఉందని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ చేసినా, చేయకపోయినా.. ఇప్పటి సినిమాలకు మౌత్ టాక్ సరిపోతుంది కాబట్టి.. టాలీవుడ్‌లోనూ ఈ సినిమా నిలబడే అవకాశమే ఉంది.

ట్యాగ్‌లైన్: జైలర్.. ఫ్యాన్స్ ఎగరేసుకోవచ్చు ‘కాలర్’
రేటింగ్: 2.75/5

Latest News