Site icon vidhaatha

Spiritual | నేను లేక‌పోతే ఏమి జ‌రిగేదో.. ఏమ‌వుతుందో! అంతా ఈశ్వ‌రేచ్ఛ

స‌మాజంలోని ప్ర‌తి కుటుంబంలో ఎప్పుడో ఒక‌ప్పుడు.. ఏదో ఒక సంద‌ర్భంలో నేను లేక‌పోతే ఏమి జ‌రిగేదో అని ప్ర‌తి ఒక్క‌రూ అనుకొనే ఉంటారు. మ‌రి నిజంగా ఆ స‌మ‌యంలో మ‌నం లేక‌పోతే ఆ కార్యం స‌ఫ‌లం కాదా.. లేదా అపాయం త‌ప్పిపోదా.. రామాయణంలో కూడా ప‌లుమార్లు హ‌నుమంతుడు ఇలాంటి సంద‌ర్భాల‌ను అనుభ‌వించాడు.. మ‌రి ఆ స‌మ‌యంలో ఏం జ‌రిగింది.. ఎవ‌రు ఆ కార్యాన్ని పూర్తి చేశారు. తెలుసుకుందాం…

Spiritual l

సీతారాములు అర‌ణ్య వాసంలో ఉన్న‌ప్పుడు రావ‌ణుడు సీత‌ను తీసుకెళ్లి అశోక వ‌నంలో ఉంచిన విష‌యం తెలిసిందే.. అప్పుడు హ‌నుమాన్ లంక వెళ్లి సీత జాడ తెలుసుకొని.. అక్క‌డే ఓ చెట్టు పై ఉంటాడు. అదే స‌మ‌యంలో రావ‌ణుడు సీత‌మ్మ‌ను చంప‌డానికి క‌త్తి దూస్తాడు.. అది చూసిన హ‌నుమాన్ క‌త్తి తీసుకొని రావ‌ణుడి త‌ల న‌రికేస్తాను అని అనుకుంటుండ‌గానే.. రావ‌ణుడి భార్య మండోద‌రి వ‌చ్చి రావ‌ణుడిని ఆప‌డాన్ని చూశాడు.

నేను క‌నుక ఇక్క‌డ లేక‌పోయి ఉంటే సీత‌మ్మ‌ను ర‌క్షించే వారెవ‌రు అని అనుకోవ‌డం నాభ్ర‌మ అని అనుకున్నాడు హ‌నుమంతుడు ఆ ఘ‌ట‌న‌ను చూసి. సీతామాత‌ను ర‌క్షించే ప‌నిని ఆ ప్ర‌భువు రాక్ష‌సుడి భార్య‌కే అప్ప‌గించ‌డం ఎంత విచిత్రం.. ఆ ఘ‌ట‌న‌తో ఎవ‌రితో ఏ కార్యం చేయించాలో ఆ కార్యం వారితోనే చేయిస్తాడు ఆ పరంధాముడు అని అర్థ‌మైంది హ‌నుమంతుడికి..

మ‌రో సంఘ‌ట‌నలోకి వెళ్తే.. సీత‌మ్మ‌కు కాప‌లా ఉంచిన ఓ రాక్ష‌స స్త్రీ త్రిజ‌ట త‌న తోటి వారికి త‌న‌కు వ‌చ్చిన క‌ల గురించి ఇలా చెప్తుంది. క‌ల‌లో లంక‌కు ఒక కోతి వ‌చ్చి లంక‌ను కాల్చి వేస్తుంద‌ని అది నేను చూశాను అని చెప్పింది. అది విన్న హ‌నుమాన్‌కి చాలా ఆశ్చ‌ర్యం వేసింది. లంకకు వ‌చ్చాను.. మ‌రి లంకాద‌హ‌నం ఎలా చేస్తాను అని ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. ఆ భ‌గ‌వానుడి ఇచ్ఛ ఎలా ఉంటే అలానే జ‌రుగుతుంద‌ని అనుకున్నాడు.

లంక‌కు కోతి వ‌చ్చిన విష‌యం తెలిసిన లంకాధిప‌తి సైనికుల‌ను పంపి చంపేయ‌మ‌న్నాడు. సైనికులు వ‌స్తే ఎక్క‌డికి వెళ్ల‌కుండా ప‌ట్టుబ‌డిపోయాడు. అయితే ఆ స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన‌ విభీష‌ణుడు దూత‌ను చంప‌డం రాజ‌నీతి కాదు అని చెప్పాడు. వెంట‌నే హ‌నుమంతుడికి అర్థ‌మైంది.. త‌న‌ను ర‌క్షించే బాధ్య‌త విభీష‌ణుడికి అప్ప‌గించాడు ఆ ప్ర‌భువు అని..

విభీష‌ణ మాట‌కు రావ‌ణుడు ఒప్పుకొని కోతిని చంపొద్దు.. కోతుల‌కు తోక అంటే చాలా ఇష్టం. తోక‌కు నిప్పుపెట్టండి అని అన్నాడు. ఆ మాట‌తో త్రిజ‌ట స్వ‌ప్నం నిజం అవుతుంద‌ని హ‌నుమాన్ మురిసిపోయాడు. ఇలా కాకుండా లంకాద‌హ‌నం చేయ‌మ‌ని శ్రీ‌రాముడు త‌న‌ను ఆజ్ఞాపించి ఉంటే నేను ఎక్క‌డి నుంచి గుడ్డ‌లు.. నిప్పు తీసుకురావాలి.. ఎప్పుడు లంక‌ను ద‌హ‌నం చేసే వాడినని అనుకున్నాడు. ఇప్పుడు ఆ శ్ర‌మ లేకుండా ఏర్పాట్ల‌న్నీ లంకాధిప‌తితోనే చేయించుకునే ఆ ప్ర‌భువు.. త‌న‌కు లంక‌ను చూసి రా అని మాత్ర‌మే ఆజ్ఞాపించ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు.. ఏ కార్యం ఎప్పుడు? ఎవ‌రు? ఎలా? చేయాలో ఆ ప‌ర‌మేశ్వ‌రుడే చూసుకుంటాడు అని అన‌డంలో అతిశ‌యోక్తి లేదు క‌దా…

ఇక మ‌నమంద‌రం తెలుసుకోవాల్సింది ఒక్క‌టే.. ప్ర‌పంచంలో జ‌రుగుతున్న‌దంతా ఈశ్వ‌రేచ్ఛ ప్ర‌కార‌మే.. మ‌న‌మంతా కేవ‌లం నిమిత్త‌మాత్రులం.. కావున నేను లేక‌పోతే ఏమి జ‌రిగేదో.. ఏమ‌వుతుందో అన్న భ్ర‌మ‌లో ఎప్పుడు ప‌డిపోవ‌ద్దు. నేనే గొప్ప‌వాడిని అని గ‌ర్వం కూడదు.. భగ‌వంతుడి కోటానుకోట్ల దాసుల‌లో మ‌నం కూడా ఒక అణువు లాంటి వాళ్ల‌మ‌నే ఎరుక‌తో జీవిద్దాం.

Exit mobile version