ప్రకృతి ఒక అద్భుతం. అందులో జీవులు మరో అద్భుతం. వాటిలోనూ కొన్ని జీవితాలు మరీ అద్భుతం. ఎందుకంటారా.. ఈ సృష్టిలో ఉన్న ప్రాణుల్లో కొన్ని రోజుల వ్యవధిలోనే చనిపోతుంటే.. మరికొన్నింటి జీవితకాలాలు వేల ఏండ్ల వరకూ ఉండటమే! ప్రత్యేకించి మహాసముద్రాల అట్టడగున జీవించే కొన్ని రకాల జాతులు ఈ ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. ఎందుకని ఈ వైరుధ్యాలు ఉన్నాయి? అనే అంశంపై శాస్త్రవేత్తలు ఎంతో కాలం నుంచి పరిశోధనలు సాగిస్తున్నారు. ఏ కారణంతో అవి సుదీర్ఘకాలం బతుకుతున్నాయో అధ్యయనం చేస్తున్నారు.
హ్యూమన్ ఏజింగ్ జీనోమిక్ రిసోర్సెస్ ప్రోగ్రామ్ బృందానికి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో మాలిక్యులర్ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్న జోవో పెడ్రో డి మగల్హాస్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం వందల కొద్దీ జంతుజాలాల గరిష్ఠ జీవితకాలాలపై అధ్యయనం చేస్తున్నది. ఆయన బృందం పరిశోధన ప్రధానంగా వృద్ధాప్యానికి అనుగుణంగా లేని జాతులపై దృష్టి సారించినట్టు సైంటిఫిక్ అమెరికన్ పేర్కొన్నది. వృద్ధాప్యం బారిన పడుతున్నట్టు కనిపించని ఈ జాతులలో టార్టాయిస్‌లు, కొన్ని రకాల చేపలు, సాలమాండర్స్ (నలికండ్ల పాములు) వంటివి ఉన్నాయి. వేటాడే జంతువుల బారిన పడకుండా, ప్రమాదాలకు లేదా ఇన్‌ఫెక్షన్లకు లోనుకాకుండా ఇవి దశాబ్దాలు, అంతకు మించి మనుగడ సాగిస్తన్నాయి.
కొన్ని జాతులు ఎందుకు త్వరగా ఎదుగుతాయో, ఎందుకు కొన్ని దీర్ఘకాలం జీవిస్తుంటాయో అనేది బయోలాజికల్ మిస్టరీ అని మగల్హాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వాటిని వేటాడే జీవుల బారిన అవి పడకపోవడం వీటి సుదీర్ఘ మనుగుడకు ఒక కారణంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. ఎలుకలు వంటివి త్వరగా చనిపోతుంటాయని కానీ.. కొన్ని జాతులు వేల సంవత్సరాలు బతుకుతాయని పేర్కొన్నారు. క్యాన్సర్‌ల వంటి రోగాలు కూడా వాటి జీవితకాలాన్ని తగ్గించేస్తుంటాయని చెప్పారు. అదే సమయంలో కొన్ని అందుకు విరుద్ధంగా సహజ ముప్పు/ ప్రమాదాలను తక్కువగా ఎదుర్కొంటాయని, మరింత సుస్థిరమైన వాతావరణాల్లో జీవిస్తుంటాయని తెలిపారు. ఉదాహరణకు గ్రీన్‌ల్యాండ్ షార్క్.. సుమారు 150 సంవత్సరాల పునరుత్పత్తి దశకు చేరుకుంటుందని చెప్పారు. ఇది ఉత్తర అట్లాంటిక్ శీతల జలాల్లో ఉంటుంది. దానిపై దాడి చేయగల శత్రు జీవులు లేకపోవడం, పర్యావరణ పరంగా కూడా తక్కువ ఇబ్బందుల కారణంగా పునరుత్పాదనకు అది హడావుడి పడదు. ఇలా సుదీర్ఘకాలం జీవించే అనేక జీవులకు ఇదే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జన్యుపరమైన సానుకూలతలు కూడా కొన్ని జాతులు దీర్ఘకాలం జీవించేలా చేస్తాయి.
జీవి / జీవిత కాలం (సాధారణం)
కేనోర్హాబ్డిటిస్ ఎలిగాన్స్/ 40 రోజులు
మేఫ్లై/ 12 ఏళ్లు
ఇంటి ఎలుక 4 (సాధారణంగా 3 ఏళ్లు)
వెస్ట్రన్ తేనెటీగ / ఎనిమిదేళ్లు (సాధారణంగా రెండు నుంచి మూడేళ్లు)
సాధారణ ఆవు / 20 ఏళ్లు (సాధారణంగా 15 నుంచి 20 ఏళ్లు)
పెంపుడు కుక్క / 27 ఏళ్లు (సాధారణంగా పది నుంచి 13 ఏళ్లు)
నల్ల తోట చీమ / 28 ఏళ్లు
సాధారణ పిల్లి / 30 ఏళ్లు (సాధారణంగా 14 ఏళ్లు
జైంట్ స్వ్కిడ్ / 35 ఏళ్లు
జిరాఫీ / 39.5 ఏళ్లు
కామన్ కార్ప్ / 64 ఏళ్లు (సాధారణంగా 17 నుంచి 20 ఏళ్లు)
చింపాంజీ / 68 ఏళ్లు (సాధారణంగా 40 నుంచి 60 ఏళ్లు)
ఆసియా ఎలిఫెంట్ / 79.6 ఏళ్లు
బ్లూ వేల్ / 110 సంవత్సరాలు
మానవుడు / 122.5 (సాధారణంగా 71 ఏళ్లు)
గాలాపోగోస్ టార్టాయిస్ / 177 ఏళ్లు (200 ఏళ్లు దాటినవి కూడా ఉన్నాయి)
రెడ్ సీ ఉర్చిన్ / 200 ఏళ్లు
రఫ్‌ఐ రాక్‌ఫిష్ / 205 ఏళ్లు
బోహెడ్ వేల్ 211 ఏళ్లు
గ్రీన్‌లాండ్ షార్క్ / 392 ఏళ్లు
ఓషన్ క్వాహాగ్ క్లామ్ / 507 ఏళ్లు
షూస్‌స్ట్రింగ్ ఫంగస్ / 2,500 ఏళ్లు
గ్రేట్ బేసిన్ బ్రిస్టెల్‌కోన్ పైన్ / 5,602 ఏళ్లు
హెక్సాక్‌టినిలిడ్ సీ స్పాంజ్ / 15,000 ఏళ్లు