Site icon vidhaatha

Asteroids | భవిష్యత్తులో భూమిని ఢీకొనే చాన్స్‌ ఉన్న ఐదు భారీ ఆస్టరాయిడ్స్‌.. అందులో ఒకటి గడగడలాడించింది..

Asteroids | నిర్మలమైన ఆకాశం అని మనం అనుకుంటాంగానీ.. ఆకాశంలో ఉన్న చెత్తాచెదారం ఎంతో తెలిస్తే నిర్ఘాంతపోవడం ఖాయం. భూమి మీద నుంచి ప్రయోగించిన రాకెట్లు, పాడైపోయిన శాటిలైట్లు భూమి కక్ష్యలో తిరుగుతూ ఉన్నాయి. వీటికి తోడు గ్రహశకలాలు సరేసరి. ఇవి ఎక్కడో సుదీర, చీకటి గగన తలాల్లో నియంత్రణ లేకుండా యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అవి అప్పుడప్పుడూ భూమికి అత్యంత సమీపంలోకి వస్తుంటాయి. ఇదే క్రమంలో భవిష్యత్తులో కొన్ని గ్రహశకలాలు భూమిని ఢీకొనేవి కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాటిలో మరీ ముఖ్యంగా ఐదు ఆస్టరాయిడ్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. వీటిని నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు కనుగొన్నాయి. వీటిలో కొన్ని భూమికి ముప్పుగా కూడా పరిణమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అపోఫిస్‌ అనే ఆస్టరాయిడ్‌ 2029లో భూమిని ఢీకొనే ప్రమాదం ఉంది. మరోటి 2030 సంవత్సరం మధ్యలో భూమిపై అమెరికా దేశాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైనదిగా ఆస్టరాయిడ్‌ 2024 YR4 పొంచి ఉన్నది. దీనిని గుర్తించిన సంవత్సరాన్ని బట్టి ఆ పేరు నిర్ణయించారు. ఇది భూమిని ఢీకొనే ముప్పు ఉందని అది దూకుడుగా కదులుతున్న తీరును బట్టి తొలుత భావించారు. అయితే.. ఆ గ్రహశకలం దారి స్వల్పంగా మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. దీనితో ఇది చంద్రుడిని ఢీకొనే అవకాశాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు.

భూమిని ఢీకొంటాయని చెబుతున్న ఆస్టరాయిడ్స్‌ వివరాలు ఇవే..

ఆస్టరాయిడ్‌ బెన్ను; అత్యంత ప్రమాదకారి

భూమికి అత్యంత ప్రమాదకారిగా పొంచి ఉన్నది ఆస్టరాయిడ్‌ బెన్ను. 1999లో దీనిని గుర్తించారు. 101955 Bennu (1999 RQ36) అని నామకరణం చేశారు. ఇది భూమిని ఢీకొనేందుకు 2700 చాన్స్‌లలో ఒక చాన్స్‌ ఉన్నది. అయితే.. దీని ప్రమాదకరమైన రాక 2182 సెప్టెంబర్‌ 24వరకూ అయితే లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతకు ముందే దీని గురించి మరింత వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

29075 (1950 DA) ; మానవాళికి పెను ముప్పు

ఆస్టరాయిడ్‌ 29075 (1950 DA) కూడా భూమికి పెను ముప్పుగా పొంచి ఉన్నది. ఇది భూమిని ఢీకొనేందుకు 34,500లో ఒక చాన్స్‌ ఉన్నది. 1950 ఫిబ్రవరిలో దీన్ని గుర్తించినా.. ఆ తర్వాత 50 ఏళ్లపాటు కనిపించకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. ఇది వదులుగా ఉన్న రాళ్లురప్పల కుప్ప. ఇది భూమిని ఢీకొంటే విడుదలయ్యే శక్తి.. 75 బిలియన్‌ టన్నుల టీఎన్‌టీతో సమానం. అది ఎంత శక్తిమంతమైనదంటే.. ఈ భూమిపై మొత్తం మానవాళి సహా మొత్తాన్నీ తుడిచిపెట్టేయగలదు.

2025 FA22 ; ప్రమాదకరమైన టాప్‌ 5లో ఒకటి

మానవాళికి ప్రమాదకరంగా ఉన్న ఐదు ఆస్టరాయిడ్స్‌లో 2025 FA22 ఒకటిగా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ చేర్చింది. ఇది 656 అడుగుల డయామీటర్‌తో ఉంటుంది. 2089 సెప్టెంబర్‌ 19న ఇది భూమిని ఢీకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం ఉండే అవకాశాలు 0.01శాతంగా ఇప్పటికి భావిస్తున్నారు. 2089లోపు ఇది ఈ ఏడాది మరోసారి సెప్టెంబర్‌ 18న కనిపించి మళ్లీ అదృశ్యమవుతుందని చెబుతున్నారు.

2023 TL4 ; భూమికి శక్తిమంతమైన ప్రమాదం

2023 TL4 ఆస్టరాయిడ్‌ను 2023లో కనుగొన్నారు. ఆ వెంటనే దానిని అత్యంత ప్రమాదకరమైన ఆస్టరాయిడ్స్‌లో ఒకటిగా నిర్ణయించారు. భూమిని ఇది ఢొకొనేందుకు 0.00055% అవకాశాలు లేదా 1,81,000లో ఒక అవకాశం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు అంచనా కట్టారు. అదే జరిగితే.. 2119 అక్టోబర్‌ 10న ఢీకొనే అవకాశం ఉండొచ్చని లెక్కించారు.

2007 FT3 ; దోబూచులాడిన గ్రహశకలం

2007 FT3 గ్రహశకలం.. శాస్త్రవేత్తలతో దోబూచులాడుతున్నది. 2007 తర్వాత ఇది కనిపించలేదు. ఇది భూమిని ఢీకొనేందుకు 0.0000096% లేదా పది మిలియన్లలో ఒక అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అది 2030 మార్చి 3న ఢీకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. 2024 అక్టోబర్‌లో ఢీకొంటుందని భావించినా.. అదృష్టవశాత్తూ.. అది భూమివైపు రాకుండా.. దూరంగా వెళ్లిపోయింది.

99942 Apophis, 2029 : అందరినీ భయపెట్టిన ఆస్టరాయిడ్‌ ఇదే

భూమికి అత్యంత వినాశకర భావించిన ఆస్టరాయిడ్‌.. 99942 Apophis, 2029. ఖగోళ శాస్త్రజ్ఞులందరినీ కలవరపెట్టింది. దీనిని 2004లో గుర్తించారు. ఆ వెంటనే ఇది అత్యంత ప్రమాదకారిగా ప్రకటించారు. రాబోయే 25 ఏళ్లలో ఇది భూమిని ఢీకొంటుందని భావించడంతో శాస్త్రవేత్తలంతా దానిపై దృష్టిసారించారు. అయితే.. అది భూమికి అంత ప్రమాదకారి కాదని చివరకు 2021లో నిర్ణయానికి వచ్చారు. అయితే.. 2029 ఏప్రిల్‌ 13న భూమికి 32వేల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనున్నది. అంటే.. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరంలో పదో వంతు అన్నమాట. దీనితో ఖగోళ భారీ శకలాన్ని దగ్గర నుంచి పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.

Exit mobile version