Success story | అప్పుడు నెలకు రూ.4 జీతం.. ఇప్పుడు 22 రెస్టారెంట్‌లు సొంతం..!

Success story | పట్టుదలతో ఏ పనికొచ్చే పని చేసినా తప్పకుండా విజయం లభిస్తుంది. సమస్యలను సాకుగా చూపే వాడికి విజయం ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటుంది. ఇందులో మొదటి కోవకు చెందిన వ్యక్తే సురేష్ పూజారి. ఒకప్పుడు నెలకు రూ.4 జీతానికి పనిచేసిన సురేష్‌ పూజారి.. ఇప్పుడు ఏకంగా దేశంలోని 22 రెస్టారెంట్లకు యజమాని అయ్యాడు. ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి, పట్టుదలే ఆయనను ఈ స్థాయికి చేర్చింది. మరి సురేష్‌ పూజారి సక్సెస్‌ స్టోరీ గురించి వివరంగా తెలుసుకుందాం...

  • Publish Date - April 18, 2024 / 11:30 AM IST

Success story : పట్టుదలతో ఏ పనికొచ్చే పని చేసినా తప్పకుండా విజయం లభిస్తుంది. సమస్యలను సాకుగా చూపే వాడికి విజయం ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటుంది. ఇందులో మొదటి కోవకు చెందిన వ్యక్తే సురేష్ పూజారి. ఒకప్పుడు నెలకు రూ.4 జీతానికి పనిచేసిన సురేష్‌ పూజారి.. ఇప్పుడు ఏకంగా దేశంలోని 22 రెస్టారెంట్లకు యజమాని అయ్యాడు. ఉన్నతస్థాయికి ఎదగాలన్న కసి, పట్టుదలే ఆయనను ఈ స్థాయికి చేర్చింది. మరి సురేష్‌ పూజారి సక్సెస్‌ స్టోరీ గురించి వివరంగా తెలుసుకుందాం…

కర్ణాటక చెందిన సురేష్ పూజారి 1940కి ఒక ఏడాది అటుఇటుగా ఓ పేద కుటుంబంలో పుట్టారు. అయితే బాల్యంలోనే ఆయనను అనేక కష్టాలు చుట్టుముట్టాయి. బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలనే కోరిక ఆయనకు ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. దాంతో పదేళ్ల వయసులోనే కూలీగా మారాడు. 1950 ప్రాంతంలో ముంబైకి వెళ్లి ఓ రైల్వే స్టేషన్ పక్కనున్న దాబాలో ఉద్యోగంలో చేరాడు. రోజంతా పని చేస్తే భోజనం పెట్టి నెలకు రూ.4 జీతంగా ఇచ్చేవారు.

అలా దాబాలో రెండేళ్లు పనిచేసిన తర్వాత ఆయనకు పరిచయమైన ఓ వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతంలో పెద్దగా తేడా లేకపోయినా పని భారం తగ్గింది. అదేవిధంగా పనిలో నైపుణ్యాలు నేర్చుకున్నాడు. అనంతరం ఓ క్యాంటీన్‌లో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో చదువు లేకపోతే ఇబ్బందేనని గ్రహించి పని చేసుకుంటూనే రాత్రిపూట బడికి వెళ్లాడు. అలా 9వ తరగతి వరకు చదువుకున్నాడు. అనంతరం క్యాంటీన్‌లో పనిచేసి దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో సురేష్‌ ఒక చిన్న పావ్ భాజీ దుకాణం పెట్టుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌ తయారుచేసే పావ్‌ భాజీకి విపరీతమైన ఆదరణ లభించింది.

దాంతో సురేష్‌ క్రమంగా తన బిజినెస్‌ను విస్తరిస్తూ పోయారు. కొద్ది కాలంలోనే అతని షాపులను దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘సుఖ్‌ సాగర్‌’ పేరుతో 22 రెస్టారెంట్లను స్థాపించాడు. ఒకప్పుడు నెలకు రూ.4 జీతానికి పనిచేసిన సూరేష్ గురించి ఎవరికీ తెలియకపోవచ్చు గానీ, ఇప్పుడు ఆయన నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియని వాళ్లు మాత్రం ఉండరు. వాటితోపాటు ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లు, షాపింగ్‌ మాల్‌లు, త్రీస్టార్‌ హోటల్‌లను సురేష్‌ నడుపుతున్నారు. సురేష్‌ పూజారి జీవితం నేటి యువతకు ఆదర్శ ప్రాయమని చెప్పవచ్చు.

Latest News