సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చిన ఇస్రో బాహుబలి

ఇస్రో బాహుబలి ఉపగ్రహ వాహక నౌకగా పేర్కొనే ఎల్‌వీఎం3.. సీఎంఎస్‌-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయాల ఖాతాలో మరోటి చేరింది. కమ్యూనికేషన్‌ రంగంలో కీలకమైన సీఎంఎస్‌–03 ఉపగ్రహాన్ని బాహుబలి రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెటర్‌ నుంచి ఆదివారం సాయంత్రం దీనిని విజయవంతంగా ప్రయోగించారు. ఇస్రోకు చెందిన హెవీ వెయిట్‌ లాంచ్‌ వెహికల్‌ అయిన సియోసింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్వీ) LVM3 అంతరిక్షంలోకి 4వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకుని పోగల శక్తి కలిగినది. తాజా ప్రయోగానికి ఇదే వాహనాన్ని ఇస్రో ఉపయోగించింది.

కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ CMS-03 బరువు 4,410 కిలోలు. భారత గడ్డ మీద నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం. ఈ ఉపగ్రహ వాహక నౌకను ఇస్రో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసింది.