హైదరాబాద్ : దేశంలో ఏయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా సెల్యులార్ కంపెనీలు టారిఫ్ లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో పెంపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
టెలికాం నిపుణుల అంచనాల ప్రకారం డిసెంబర్ 1వ తేదీ నుంచి టారిఫ్ ల పెంపుదల అమల్లోకి రానున్నాయి. పరిస్థితులు అనుకూలించనట్లయితే వచ్చే ఏడాది జూన్ నెలలో అమలు చేయనున్నారు. సెల్యూలార్ కంపెనీల ప్రతిపాదనలపై ట్రాయ్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవచ్చని మార్కెట్ నిపుణుల అంచనా. గతేడాది జూలై నెలలో అన్ని ప్లాన్లపై 12 నుంచి 25 మధ్య పెంచేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి 10 నుంచి 12 శాతం మధ్య పలు ప్లాన్లపై పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.199 నెలవారీ ప్లాన్ ను రూ.222 చేయనున్నారు. దీంతో 1.1 బిలియన్ ప్రీ పెయిడ్ వినియోగదారులపై ఆర్థిక భారం పడనున్నది. పోస్టు పెయిడ్ ఖాతాదారులపై కనికరం చూపించనున్నారు. 8 నుంచి 10 శాతం పెంచే సూచనలు కన్పిస్తున్నాయి. 2జీబీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్, 28 రోజుల వాలిడిటీతో ఉన్న బడ్జెట్ ప్యాక్ ప్రస్తుతం రూ.299 కాగా దీన్ని రూ.330 నుంచి రూ.335 మధ్య పెంచనున్నారు. 12 నెలల వ్యాలిడిటీ ప్లాన్లను నవంబర్ నెలాఖరు లోపు తీసుకున్నట్లయితే కొంత ఆదా చేసుకున్నవారు అవుతారు. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్లాన్ల ధరలను పెంచే ఆలోచనలో లేదని టెలికాం రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 4జీ నుంచి 5జీ టెక్నాలజీకి అప్ గ్రేడ్ అయిన తరువాత పెంపుదలపై పరిశీలన చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో ఏ.ఆర్.పీ.యూ (ప్రతి వినియోగదారుడి నుంచి సగటు రాబడి) రూ.180 నుంచి రూ.195 మధ్య ఉంది. డిసెంబర్ 1 నుంచి టారిఫ్ లు పెంచితే ఏ.ఆర్.పీ.యూ రూ.200 దాటుతుంది.
దేశ వ్యాప్తంగా 5జీ నెట్ వర్క్ ను విస్తరించడం, ఫైబర్ కనెక్టివీ పెంచడం, స్పెక్ట్రమ్ చెల్లింపులు ఆర్థికంగా భారంగా మారడం కూడా టారిఫ్ ల పెంపుదలకు కారణంగా చెబుతున్నారు
మొబైల్ ఫోన్ వాడే వారికి భారీ షాక్.. త్వరలో మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు?
దేశంలో ఏయిర్ టెల్, జియో, వోడాఫోన్ ఐడియా సెల్యులార్ కంపెనీలు టారిఫ్ లు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో పెంపు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.
