ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ, సామ్సంగ్(Samsung), కళ్లు బైర్లు కమ్మే ఈవీ బ్యాటరీ(EV Battery)ని తయారుచేసింది. సామ్‌సంగ్‌కు ప్రత్యేకంగా బ్యాటరీలు తయారుచేసే కంపెనీ ఉంది. అదే సామ్సంగ్ ఎస్డిఐ(Samsung SDI). ఈ సామ్సంగ్ ఎస్డిఐ ఇప్పటికే ఈవీ బ్యాటరీ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఈవీ తయారీదారులందరికీ బ్యాటరీలు సరఫరా చేస్తుంది. సామ్సంగ్ ఎస్డిఐలోని పరిశోధన–అభివృద్ధి(R&D) విభాగానికి చాలా పేరుంది. ఎనర్జీ స్టోరేజి సొల్యూషన్స్(Energy Storage Solutions)లో ఈ విభాగం చాలా గొప్ప పరిశోధనలు చేసింది. అందులో భాగమే గత వారం ప్రదర్శించిన ఆనోడ్ ఆల్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ(Anode All Solid State Battery – ASB).
ఈ ఏఎస్‌బీ(ASB) కేవలం 9 నిమిషాల చార్జింగ్(9 Minute Charging)తో 965 కి.మీ రేంజ్(965 Km Range), 20 ఏళ్ల జీవనకాలం(20 years Life Span)తో వస్తోంది. ఇప్పుడున్న అన్నీ ఈవీ బ్యాటరీలు ఏవీ దీని దరిదాపుల్లో ఉండవు. ఇప్పటికే ఈ బ్యాటరీలు పరీక్షల కోసం ప్రముఖ ఈవీ తయారీదారులకు అందజేయడం జరిగింది. వారినుంచి ఆశాజనక ఫలితాల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది. 2027 కల్లా పూర్తిస్థాయి ఉత్పత్తిలోకి దిగి పెద్ద ఎత్తున మార్కెట్లో ప్రవేశించాలని సామ్సంగ్ ఎస్డిఐ ప్రణాళికలు రచిస్తోంది.
ప్రస్తుతం అన్ని రకాల ఈవీలు లితియం–అయాన్ బ్యాటరీ(Li-Ion Batteries)లను వాడుతున్నాయి. వాటితో పోలిస్తే, ఈ ఏఎస్‌బీ, చిన్నగా, తేలికగా, ధృఢంగా, సురక్షితంగా ఉంటుంది. ఇందులో లిథియం–అయాన్లోలా ద్రవరూప రసాయనాలు(N o liquid State) కాకుండా అంతా ఘనరూపం(Solid State) లోనే ఉండటంతో రక్షణపరంగా చాలా పెద్ద విజయంగా చెబుతున్నారు. ఈ ఆక్సైడ్ సాలిడ్‌స్టేట్ బ్యాటరీ సాంకేతికత శక్తి సాంద్రత(Energy Density) చాలా ఆసక్తికరంగా కిలోకి 500 వాట్అవర్(500 Wh/Kg)గా ఉంది. సంప్రదాయ బ్యాటరీలకు దాదాపు రెట్టింపు సాంద్రత. ఇదే మైలేజీ రేంజిని పెంచింది. అయితే ఈ బ్యాటరీ ఉత్పాదక ఖర్చు విపరీతంగా ఉండటంతో, ముందుగా సూపర్–ప్రీమియం(Super-Premium Vehicles) కార్లకు అంటే బెంజ్, ఆడి, రోల్స్‌రాయిస్ లాంటి వాటికే అమర్చబోతున్నారు. అయితే మైలేజే కాకుండా చార్జింగ్ కూడా అతిపెద్ద సమస్య కావడంతో, మధ్యస్థాయి వాహనాలకు అమర్చే బ్యాటరీలను కూడా 9 నిమిషాల్లోనే పూర్తి చార్జ్ అయ్యేట్లుగా తయారుచేస్తున్నామని, ధరలు కూడా సమానంగానే ఉంటాయని సామ్సంగ్ ఎస్డిఐ సీఈఓ యూన్హో చొయ్(Yoonho Choi) తెలిపారు.
సామ్సంగ్ ఎస్డిఐ బ్యాటరీ మార్కెట్‌కు చైనా తయారీదారుల(China battery makers) నుండి తీవ్రమైన పోటీ ఉంటోంది. సిఎటిఎల్(CATL), బివైడీ(BYD) వంటి కంపెనీలు ఇప్పటికే 20 సంవత్సారాల జీవనకాలం, 10 నిమిషాల్లో 100శాతం చార్జింగ్ బ్యాటరీలను ప్రకటించాయి. 20ఏళ్ల మన్నిక గల బ్యాటరీలను ముద్దుగా మిలియన్ మైల్ బ్యాటరీ(Million Mile Battery)లు గా పిలుచుకుంటున్నారు. కానీ, సమస్య మళ్లీ మొదటిదే. చార్జింగ్ స్టేషన్ల సదుపాయాలు. సూపర్ ఫాస్ట్ చార్జింగ్ వ్యవస్థ(Fast-Charge Infrastructure)లు ప్రపంచవ్యాప్తంగా విరివిగా నెలకొల్పగలిగితేనే ఈ విద్యుత్ వాహనాలకు మనుగడ. విద్యుత్ కార్ల మెకానిక్‌ల లభ్యత, వివిధ విడిభాగాల ధరలు అందుబాటులోకి రావడం లాంటివి ఇంకా అందనంత దూరంలోనే ఉన్నాయి. భారత్ లాంటి దేశం ఆ స్థాయికి చేరుకోవాలంటే కనీసం దశాబ్ద కాలమన్నా పడుతుంది.