Samsung EV Battery | విద్యుత్​ వాహన బ్యాటరీల్లో సామ్​సంగ్​ పెను సంచలనం

దక్షిణ కొరియా రాజధాని సియోల్​లో జరిగిన ఎస్​ఎన్​ఈ బ్యాటరీ డే 2024 ఎక్స్​పోలో సామ్​సంగ్​ ఈ సంచలనాత్మక బ్యాటరీని ఆవిష్కరించింది.

Samsung EV Battery | విద్యుత్​ వాహన బ్యాటరీల్లో సామ్​సంగ్​ పెను సంచలనం

ప్రముఖ ఎలక్ట్రానిక్​ కంపెనీ, సామ్​సంగ్(Samsung)​, కళ్లు బైర్లు కమ్మే ఈవీ బ్యాటరీ(EV Battery)ని తయారుచేసింది. సామ్​సంగ్​కు ప్రత్యేకంగా బ్యాటరీలు తయారుచేసే కంపెనీ ఉంది. అదే సామ్​సంగ్​ ఎస్​డిఐ(Samsung SDI). ఈ సామ్​సంగ్​ ఎస్​డిఐ ఇప్పటికే ఈవీ బ్యాటరీ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రముఖ ఈవీ తయారీదారులందరికీ బ్యాటరీలు సరఫరా చేస్తుంది. సామ్​సంగ్​ ఎస్​డిఐలోని పరిశోధన–అభివృద్ధి(R&D) విభాగానికి చాలా పేరుంది. ఎనర్జీ స్టోరేజి సొల్యూషన్స్(Energy Storage Solutions)​లో ఈ విభాగం చాలా గొప్ప పరిశోధనలు చేసింది. అందులో భాగమే గత వారం ప్రదర్శించిన ఆనోడ్​ ఆల్​ సాలిడ్​ స్టేట్​ బ్యాటరీ(Anode All Solid State Battery – ASB).

ఈ ఏఎస్​బీ(ASB) కేవలం 9 నిమిషాల చార్జింగ్(9 Minute Charging)​తో 965 కి.మీ రేంజ్(965 Km Range)​, 20 ఏళ్ల జీవనకాలం(20 years Life Span)తో వస్తోంది. ఇప్పుడున్న అన్నీ ఈవీ బ్యాటరీలు ఏవీ దీని దరిదాపుల్లో ఉండవు. ఇప్పటికే ఈ బ్యాటరీలు పరీక్షల కోసం ప్రముఖ ఈవీ తయారీదారులకు అందజేయడం జరిగింది. వారినుంచి ఆశాజనక ఫలితాల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది. 2027 కల్లా పూర్తిస్థాయి ఉత్పత్తిలోకి దిగి పెద్ద ఎత్తున మార్కెట్లో ప్రవేశించాలని సామ్​సంగ్​ ఎస్​డిఐ ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం అన్ని రకాల ఈవీలు లితియం–అయాన్​ బ్యాటరీ(Li-Ion Batteries)లను వాడుతున్నాయి. వాటితో పోలిస్తే, ఈ ఏఎస్​బీ, చిన్నగా, తేలికగా, ధృఢంగా, సురక్షితంగా ఉంటుంది. ఇందులో లిథియం–అయాన్​లోలా ద్రవరూప రసాయనాలు(N o liquid State) కాకుండా అంతా ఘనరూపం(Solid State) లోనే ఉండటంతో రక్షణపరంగా చాలా పెద్ద విజయంగా చెబుతున్నారు. ఈ ఆక్సైడ్​ సాలిడ్​స్టేట్​ బ్యాటరీ సాంకేతికత శక్తి సాంద్రత(Energy Density) చాలా ఆసక్తికరంగా కిలోకి 500 వాట్అవర్(500 Wh/Kg)​గా ఉంది. సంప్రదాయ బ్యాటరీలకు దాదాపు రెట్టింపు సాంద్రత. ఇదే మైలేజీ రేంజిని పెంచింది. అయితే ఈ బ్యాటరీ ఉత్పాదక ఖర్చు విపరీతంగా ఉండటంతో, ముందుగా సూపర్–ప్రీమియం(Super-Premium Vehicles) కార్లకు అంటే బెంజ్​, ఆడి, రోల్స్​రాయిస్​ లాంటి వాటికే అమర్చబోతున్నారు. అయితే మైలేజే కాకుండా చార్జింగ్​ కూడా అతిపెద్ద సమస్య కావడంతో, మధ్యస్థాయి వాహనాలకు అమర్చే బ్యాటరీలను కూడా 9 నిమిషాల్లోనే పూర్తి చార్జ్​ అయ్యేట్లుగా తయారుచేస్తున్నామని, ధరలు కూడా సమానంగానే ఉంటాయని సామ్​సంగ్​ ఎస్​డిఐ సీఈఓ యూన్​హో చొయ్(Yoonho Choi)​ తెలిపారు.

సామ్​సంగ్​ ఎస్​డిఐ బ్యాటరీ మార్కెట్​కు చైనా తయారీదారుల(China battery makers) నుండి తీవ్రమైన పోటీ ఉంటోంది. సిఎటిఎల్(CATL)​, బివైడీ(BYD) వంటి కంపెనీలు ఇప్పటికే 20 సంవత్సారాల జీవనకాలం, 10 నిమిషాల్లో 100శాతం చార్జింగ్​ బ్యాటరీలను ప్రకటించాయి. 20ఏళ్ల మన్నిక గల బ్యాటరీలను ముద్దుగా మిలియన్​ మైల్​ బ్యాటరీ(Million Mile Battery)లు గా పిలుచుకుంటున్నారు. కానీ, సమస్య మళ్లీ మొదటిదే. చార్జింగ్​ స్టేషన్ల సదుపాయాలు. సూపర్​ ఫాస్ట్​ చార్జింగ్​ వ్యవస్థ(Fast-Charge Infrastructure)లు ప్రపంచవ్యాప్తంగా విరివిగా నెలకొల్పగలిగితేనే ఈ విద్యుత్​ వాహనాలకు మనుగడ. విద్యుత్​ కార్ల మెకానిక్​ల లభ్యత, వివిధ విడిభాగాల ధరలు అందుబాటులోకి రావడం లాంటివి ఇంకా అందనంత దూరంలోనే ఉన్నాయి. భారత్​ లాంటి దేశం ఆ స్థాయికి చేరుకోవాలంటే కనీసం దశాబ్ద కాలమన్నా పడుతుంది.