Mission Bhagiratha employees | తెలంగాణలో మిషన్ భగీరథ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గోస
తెలంగాణ మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు నెలల తరబడి జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత):
Mission Bhagiratha employees | ఉద్యోగులను ఇబ్బందులు పెట్టం.. క్రమం తప్పకుండా ప్రతి నెలా వేతనాలు ఇస్తున్నాం’ అని చెబుతున్న ప్రభుత్వం.. చేతల్లో అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయత్ రాజ్ శాఖ ఆధీనంలోని మిషన్ భగీరథలో పనిచేస్తున్న 18వేల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. చాలీచాలనీ జీతాలతో పనిచేస్తున్న తమను అష్టకష్టాలు పెడుతున్నారని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇంతగా ఇబ్బందులు పడలేదని అంటున్నారు. జీతాలు చెల్లించని సమయంలో ధర్నాలు చేస్తే వెంటనే స్పందించి మంజూరు చేసేవారని ఉద్యోగులు గుర్తుచేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిందని సంబురపడడం తప్ప ఆచరణలో సొల్లు కబుర్లతో, మాయ మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారని మిషన్ భగీరథ ఉద్యోగులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కష్టాలు
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు.
- ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్న ఉద్యోగులకు గరిష్ఠంగా 12 నెలలు మొదలు కనిష్ఠంగా రెండు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.
జీతాలను పంచాయతీ రాజ్ శాఖ నేరుగా చెల్లించకుండా ఇందుకోసం ప్రైవేటు ఏజెన్సీలను ఎంపిక చేసింది. - ఈ ఏజెన్సీల పరిధిలో సుమారు 18వేల మంది వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తూ రాష్ట్ర ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు.
- ఒక ఉద్యోగికి ఆరేడు నెలలు జీతాలు చెల్లించకపోతే పరిస్థితి ఏమిటనేది పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆలోచించకపోవడం అన్యాయమని ఉద్యోగులు వాపోతున్నారు.
పేద ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూస్తున్న ఆమె 18వేల మంది జీతాల చెల్లింపులపై పర్యవేక్షణ - లేకపోవడం విచారకరమని అంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం మూడు నెలల వరకు పెండింగ్ లో ఉండేదని, అంతకు మించి ఉండేది కాదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. - నిధులు విడుదల చేసే సమయంలో మూడు నెలలకు అదనంగా పది రోజులు ఉంటే ఆ కాలాన్ని కూడా లెక్కించి జీతాలు ఇచ్చేవారని గుర్తు చేసుకుంటున్నారు.
- పాత ప్రభుత్వం కన్నా ఘోరంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న ఉద్యోగుల పట్ల కాఠిన్యంగా వ్యవహరిస్తున్నదని, గ్రామీణ ప్రజలు కూడా గమనిస్తున్నారని వారు అంటున్నారు.
మంత్రి వైఖరి ఎలా ఉంది?
మంత్రి సీతక్కను సచివాలయంలో కలిసి వినతి పత్రం అందిస్తే, సంబంధిత అధికారికి ఫోన్ చేసి మంజూరు చేయాలని ఆదేశాలు ఇస్తారు కానీ ఏనాడు ఆ ఆదేశాలు అమలైన దాఖలాలు లేవని అంటున్నారు. నిధులు లేకుండా తాము ఏమి చేస్తామని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నిమార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో ఇకనుంచి ఇవ్వడం దండగ అనే నిర్ణయానికి వచ్చినట్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదనతో తెలిపారు.
జీతం అడిగితే ఇంటికి పొమ్మంటున్నారు
ఆరేడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు, ఎలా బ్రతకాలి, కిరాయిలు, ఇంటి ఖర్చులు ఎలా వెళ్లదీయాలి అని ఉద్యోగులు ఏజెన్సీ ప్రతినిధుల వద్దకు వెళ్లి అడిగితే కసురుకుంటున్నారని పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు రాలేదు, ప్రభుత్వానికి బిల్లులు పంపించామనే మాట చెప్పి పంపిస్తున్నారని అంటున్నారు. గట్టిగా నిలదీస్తే, ప్రభుత్వం మంజూరు చేస్తే మీకు ఇస్తాం, మా జేబుల్లో నుంచి పెట్టుకోవాలా అని గద్దిస్తున్నారని చెబున్నారు. ఇష్టం ఉంటే పనిచేయండి లేదంటే పని మానుకుని ఇంటికి వెళ్లిపోవాలని ఏజెన్సీల బాధ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలిపారు. గత్యంతరం లేని వేల మంది ఇంటి వద్ద నుంచి, బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకుని బతుకు వెళ్లదీస్తున్నారు. జీతాలు వచ్చిన తరువాత చెల్లించవచ్చనే గంపెడాశతో అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి వరకు మరికొన్ని ప్రాంతాల్లో ఉగాది వరకు చెల్లింపులు చేశారు.
ప్రతినెలా ఒక్కో ఉద్యోగి నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో రూ.2వేలు కాంట్రిబ్యూషన్ కింద ఏజెన్సీలు ముక్కు పిండి జీతాల నుంచి వసూలు చేస్తున్నాయి. కొన్ని ఏజెన్సీలు అప్పుడో ఇప్పుడో కడుతుండగా, మెజారిటీ ఏజెన్సీలు జేబులో వేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మిషన్ భగీరథ ఉన్నతాధికారులు తనిఖీలు చేయకుండానే బిల్లులు పంపిన వెంటనే నిధులు మంజూరు చేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ క్రమం తప్పకుండా చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కార్మిక శాఖ అధికారులు, ప్రావిడెంట్ ఫండ్ అధికారులు కూడా ఏజెన్సీల కార్యాలయాలు, మిషన్ భగీరథ కార్యాలయంలో తనిఖీలు చేయడం లేదని తెలుస్తున్నది. సక్రమంగా చెల్లించకుండా ఎగవేతకు పాల్పడుతున్న ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టకుండా కొనసాగించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏజెన్సీల వారీగా పెండింగ్ జీతాలు
ఎస్కే ఎలక్ట్రికల్స్ : 12 నెలలు
ఎల్ అండ్ టీ : 7 నెలలు
ఎవరెస్టు : 6 నెలలు
రాఘవ : 4 నెలలు
గోదావరి : 3 నెలలు
గజ : 2 నెలలు
ఇందులో రాఘవ ఏజెన్సీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదని సమాచారం. ప్లాంట్ మెయింటెనెన్స్ కాంట్రాక్టును రాఘవ దక్కించుకున్నది. ఆఖరికి మంత్రికి చెందిన ఏజెన్సీ కూడా సక్రమంగా జీతాలు చెల్లించకపోవడం దారుణమంటున్నారు. సూపర్ వైజర్ కు (మండలానికి ఒకరు) రూ.22వేలు, ప్లంబర్ కు (గ్రామానికి ఒకరు) రూ.10,400, ఫిట్టర్ కు రూ15,000, లైన్ మెన్ కు రూ.10,080, ల్యాబ్ అసిస్టెంట్ కు రూ.16,000, మట్టి మనిషి కి రూ.10,200, గార్డెన్ లో పనిచేసే వారికి రూ.10,000 చొప్పున ప్రతినెలా వేతనాలు చెల్లిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ల్యాబ్ అసిస్టెంట్ కు రూ.12వేలు, రూ.14వేల చొప్పున కూడా జీతాలు ఇస్తున్నారు.