ఇరాన్ ఓడిపోయింది.. అందుకే సారీ చెప్పింది: ఇరాన్‌పై ట్రంప్ వెటకారం
యుద్ధంలో ఇరాన్ ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగానే పొరుగు దేశాలకు క్షమాపణ చెప్పిందన్నారు.
ఇరాన్ క్షమాపణలపై వెటకారం చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Trump Calls Iran “Loser of the Middle East”, Warns of Bigger Strikes
సారాంశం:
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఓడిపోయినందుకే ఇరాన్ పొరుగుదేశాలకు క్షమాపణలు చెప్పిందని వెటకారం చేశారు. అయితే తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పష్టం చేశారు.
విధాత ప్రపంచం డెస్క్ | 7 మార్చి 2026 | హైదరాబాద్:
Donald Trump | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ ఓడిపోయిందని అందుకే పొరుగుదేశాలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ఇరాన్‌ను “మిడిల్ ఈస్ట్ లూజర్”గా అభివర్ణిస్తూ ట్రంప్ వెటకారం చేశారు
ఉద్రిక్తతల నివారణకు కృషి చేస్తున్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ సంకేతాలు ఇచ్చిన కొన్ని గంటలకు ట్రంప్ పై విధంగా స్పందించారు. తాము చేసిన దాడులపై పొరుగుదేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు.. పొరుగు దేశాల నుంచి దాడి జరుగకపోతే వాటిపై క్షిపణలు ప్రయోగించవద్దని సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశామని శనివారం తెలిపారు. ఇరాన్ పొరుగు దేశాలను తమ సోదరులుగా పెజిష్కియన్ అభివర్ణించారు. తమకు పొరుగు దేశాలపై దాడులు చేయాలనే ఉద్దేశం లేదని చెప్పారు.
ఇది అమెరికా – ఇజ్రాయెల్‌ల విజయం : ట్రంప్
ఇరాన్ అధ్యక్షుడు చెప్పిన ఈ మాటలను ప్రస్తావించిన ట్రంప్.. పొరుగు దేశాలపై కాల్పులు జరుపబోమని హామీ ఇవ్వడం అనేది అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఫలితమేనని చెప్పారు. ‘నరకానికి తరమబడుతున్న ఇరాన్.. క్షమాపణలు చెప్పింది. మధ్య ఆసియాలోని పొరుగు దేశాలకు లొంగిపోయింది. ఇకపై కాల్పులు జరుపబోమని హామీ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు నిరవధికంగా చేస్తున్న దాడుల ఫలితంగానే ఈ హామీ వచ్చింది’ అని ట్రంప్ తన సుదీర్ఘ పోస్టులో పేర్కొన్నారు. మధ్య ఆసియా దేశాలను తన ఆధీనంలోకి తీసుకుని పాలించాలని ఇరాన్ చూస్తున్నదని ట్రంప్ ఆరోపించారు. వేల సంవత్సరాల్లో పొరుగు దేశాలతో ఇరాన్ ఓడిపోవడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత మధ్య ఆసియాలోని దేశాలు తనకు కృతజ్ఞతలు తెలిపాయని ట్రంప్ రాశారు. ‘థ్యాంక్యూ ప్రెసిడెంట్ ట్రంప్.. అని వారు చెప్పారు. అందుకు తాను ప్రతిగా.. యూ ఆర్ వెల్‌కమ్ అని చెప్పాను’ అని తెలిపారు.
యుద్ధం ముగియాలంటే ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుత ఇరాన్ ప్రభుత్వం పక్కకు తప్పుకొని కొత్త నాయకత్వం ఏర్పడితే, అమెరికా మరియు మిత్రదేశాలు కలిసి ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టేందుకు సహాయం చేస్తాయని తెలిపారు. ఇరాన్ లొంగిపోయిన తర్వాత ఆ దేశాన్ని వినాశన అంచు నుంచి బయటకు తీసుకువచ్చి మరింత బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలమని కూడా ఆయన పేర్కొన్నారు.
ముందుంది ముసళ్ల పండుగ : అమెరికా

మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు.. దుబాయ్ నగరంలో పేలుళ్లతో ఎగిసిన పొగ
ఇదిలా ఉండగా అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధంలో ఇప్పటివరకు జరిగిన దాడులు కేవలం ప్రారంభమేనని, అతి పెద్ద బాంబింగ్ కార్యక్రమం ఇంకా ముందుందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు, అణు కేంద్రాలు, కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,200 మందికి పైగా, లెబనాన్‌లో 200 మందికి పైగా, ఇజ్రాయెల్‌లో 11 మంది మృతి చెందినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఆరుగురు అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో దుబాయ్‌లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ప్రారంభించింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులను భద్రత కోసం అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌కు తరలించినట్లు సమాచారం.
పొరుగుదేశాలకు క్షమాపణలు చెప్పిన ఇరాన్

పొరుగుదేశాలకు క్షమాపణలు తెలిపిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్
ఇదిలా ఉండగా, యుద్ధ సమయంలో జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ పొరుగుదేశాలకు క్షమాపణలు తెలిపారు. ఇజ్రాయెల్, అమెరికాతో జరిగిన యుద్ధంలో భాగంగా కొన్ని దేశాలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై పొరుగుదేశాలపై దాడులు చేయబోమని, తమపై ముందుగా దాడి జరిగితే తప్ప క్షిపణులు ప్రయోగించమని తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయించిందని చెప్పారు. పొరుగుదేశాలను తమ సోదర దేశాలుగా భావిస్తున్నామని, వారిపై దాడులు చేయాలనే ఉద్దేశం తమకు లేదని పెజెష్కియన్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోదని స్పష్టం చేస్తూ, ఇరాన్ ప్రజలు లొంగిపోవాలని కోరుకునే శత్రువుల ఆశలు ఎప్పటికీ నెరవేరవని ఆయన వ్యాఖ్యానించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram