Medaram Jatara | మేడారం ట్రాఫిక్ జామ్‌పై పోస్ట్‌మార్టం.. వచ్చే జాతర నాటికి ప్రత్యామ్నాయ ప్రణాళిక

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మేడారం జాతరను నిర్వహించినప్పటికీ కీలకమైన చివరి రెండు రోజుల్లో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడి.. భక్తులు తీవ్ర ఇబ్బంది పడటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో తదుపరి జాతర నాటికి ట్రాఫిక్‌ జామ్‌లేకుండా చేసే ఏర్పాట్లపై ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది.

  • By: TAAZ |    telangana |    Published on : Feb 05, 2026 8:16 PM IST
Medaram Jatara | మేడారం ట్రాఫిక్ జామ్‌పై పోస్ట్‌మార్టం.. వచ్చే జాతర నాటికి ప్రత్యామ్నాయ ప్రణాళిక

విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Medaram Jatara | మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం పోస్ట్‌మార్టం ప్రారంభించింది. జాతర సందర్భంగా వీవీఐపీ రూట్‌లో తలెత్తిన ట్రాఫిక్ జామ్‌తో నెలకొన్న ఇబ్బందులను సీఎంవో అధికారి గురువారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ జాతరలో తలెత్తిన సమస్యలను పరిష్కరిస్తూ వచ్చే 2028 జాతర నాటికి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. తాజా పోస్ట్‌మార్టంతో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతరకు ఇస్తున్న ప్రాధాన్యం దీంతో తేలిపోయింది.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ ఏడాది జాతర నిర్వహించినప్పటికీ చివరి రెండు రోజులు శుక్ర, శనివారాల్లో మేడారం నుంచి గోవిందరావు పేట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులు 14 గంటలపాటు నరకయాతన పడ్డారు. ఈ ఏడాది జాతర నిర్వహణకు ముందే రాష్ట్ర ప్రభుత్వం మేడారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి రూ.251 కోట్ల నిధులు కేటాయించింది. మేడారం పునరుద్ధరణ చేపట్టారు. శాశ్వత నిర్మాణాలు చేపట్టాలనే ప్రతిపాదికన మాస్టర్ ప్లాన్ రూపొందించి, వంద రోజులు లక్ష్యంగా ఈ పనులు దాదాపు పూర్తి చేశారు. గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించేందుకు రాతి కట్టడాలు, ప్రాకారాలు, స్తంభాలను ఉపయోగించడమే కాకుండా కోయల సాంస్కృతిక పునర్జీవనానికి పెద్దపీట వేశారు. దీంతో మేడారానికి కొత్త వెలుగులు వచ్చాయి. అదే విధంగా రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులు శాశ్వతంగా ఉండే విధంగా చేపట్టారు. చివరికి రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని కూడా మేడారంలో నిర్వహించి ఈ జాతరకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రివర్గం, ప్రభుత్వమే మేడారానికి తరలివచ్చింది. చేపట్టిన పునరుద్ధరణ పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

మసకబారిన ప్రభుత్వ ప్రతిష్ఠ

మేడారం జాతర సందర్భంగా ఆధునిక టెక్నాలజీ, కమాండ్ కంట్రోల్ రూమ్, డ్రోన్ వ్యవస్థ, ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు ప్రభుత్వం, మంత్రులు, అధికారులు ప్రకటించారు. ఇవన్నీ చేసినప్పటికీ జాతరలో అత్యంత ముఖ్యమైన రెండు రోజులు ట్రాఫిక్ ఏర్పడి జనం తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పస్రా నుంచి మేడారం వరకు తలెత్తిన ట్రాఫిక్ జామ్‌తో జాతర కోసం అహర్నిశలు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. అధికారులు, ముఖ్యంగా పోలీసులపై, ప్రభుత్వంపై.. ప్రత్యేకించి మంత్రుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇబ్బందులు పడిన ప్రజలు సహజంగానే ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయగా, కొన్ని రాజకీయ పక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ ఈ అంశాన్ని తీవ్రంగా విమర్శించింది. ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేస్తోంది. మొత్తం జాతర కోసం చేసిన శ్రమంతా పక్కకు పోయి ఈ ట్రాఫిక్ జామ్ తో జాతర ఫెయిల్ అయినట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. అసలే సోషల్ మీడియా కాలం కావడంతో ప్రతీ విషయాన్ని విమర్శలకు కేంద్రబిందువుగా మార్చి ప్రచారం చేయడంతో అధికార యంత్రాంగం ఇబ్బందులకు లోనైంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం… ట్రాఫిక్ జామ్ పై పోస్ట్‌మార్టం చేపట్టింది. మంత్రులు, అధికారుల నుంచి తగిన సమాచారం తెప్పించుకున్నారు.

వీఐపీ వాహనాలతో ఇబ్బందులు

పస్రా నుంచి మేడారం వరకు ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ, వీవీఐపీలు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో దీనిపై వాస్తవ పరిస్థితులు పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. వీఐపీ వాహనాల నిర్లక్ష్యం వల్ల ట్రాఫిక్ సమస్య నెలకొందనేది బహిరంగ రహస్యం. ఈ సమస్యను తెలుసుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చేపట్టాల్సిన మార్గాలను పరిశీలించేందుకు నిర్ణయించారు.

వీఐపీ రూట్ పరిశీలించిన సీఎంవో ఆఫీసర్

సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ కె ఎస్ శ్రీనివాసరాజు గురువారం వీఐపీ రూట్‌గా ఉపయోగించిన.. పస్రా నుంచి మేడారం వరకు ఉన్న రోడ్డును ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి పరిశీలించారు. రహదారిని, వీవీఐపీ వాహనాల పార్కింగ్ స్థలాన్ని, మేడారం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్భంగా కె ఎస్ శ్రీనివాసరాజు అధికారులతో మాట్లాడుతూ జాతర సమయం లో వీవీఐపీ వాహనాలు వచ్చే మార్గంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటి నివారణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2026 మహా జాతరలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2028 జాతరలో సమస్యలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ప్రణాళికల సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జాతరలో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తుందని జాతర విజయవంతం చేయడానికి కృషిచేసిన అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి, ఆర్టీసీ, పంచాయతీ రాజ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.