తెలంగాణ సీఎంలో కొనసాగుతున్న మార్పులు.. రెరా చైర్మన్‌గా శ్రీనివాసరాజు నియామకం

తెలంగాణ సీఎంవోలో అధికారుల బదిలీలు సీనియర్‌ అధికారులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Reported by: Jagan Mohan Talluri | విధాత ప్రత్యేకం | Edited by: విధాత ఎక్స్క్లూజివ్ డెస్క్ | Jun 27, 2026, 8:46 pm IST
Read Time: 7 mins
తెలంగాణ సీఎంలో కొనసాగుతున్న మార్పులు.. రెరా చైర్మన్‌గా శ్రీనివాసరాజు నియామకం

హైలైట్స్:

  • అకస్మిక బదిలీతో పలువురు ఆశ్చర్యం

విధాత, హైదరాబాద్:
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులపై కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో మార్పులకు శ్రీకారం చుట్టారా అంటే… అవుననే విధంగా బదిలీలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో తెలంగాణేతరులను, అదికూడా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల సచివాలయంలో సీనియర్‌ అధికారులు, ఉద్యోగులు నొచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎంవో నుంచి ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డిని తప్పించగా, శనివారం సీఎంవో ముఖ్య కార్యదర్శి కే శ్రీనివాస్ రాజు (రిటైర్డు ఐఏఎస్)ను సైతం బదిలీ చేశారు. ఆయనను తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ కమిషన్ (టీజీ రెరా) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే విధంగా అజిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్‌ లిమిటెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

తాజాగా ఇద్దరు అధికారుల బదిలీతో ప్రస్తుతం సీఎంవోలో వీ శేషాద్రి (1999 బ్యాచ్), కే మాణిక్కరాజ్ (2005 బ్యాచ్), వీ శ్రీనివాసులుతో పాటు కొత్తగా నియమితులైన ఎన్ శ్రీధర్ (1992 బ్యాచ్) మాత్రమే మిగిలారు. ఇప్పటి వరకు అజిత్ రెడ్డి నిర్వహించిన శాఖలను కొత్తగా వచ్చిన శ్రీధర్‌కు అప్పగించారు. జూలై 1వ తేదీన సంజయ్ జాజు నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సచివాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్‌లను బదిలీ చేస్తారన్న వార్తలు ఐఏఎస్‌ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. సచివాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్‌ల పనితీరుపై అంచనాకు వచ్చిన తరువాత జాజు తన టీమ్‌ను కీలక శాఖల్లో నియమించుకునే అవకాశముందనే వార్త సచివాలయ వర్గాల్లో చక్కెర్లు కొడుతున్నది. సీఎంవోలో ప్రస్తుతం శేషాద్రి సమర్థవంతంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే సీనియర్ ఐఏఎస్ అయిన శ్రీధర్‌కు మున్ముందు మరిన్ని కీలక బాధ్యతలు అప్పచెబుతారని, గతంలో పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. శేషాద్రి 1999 బ్యాచ్ ఐఏఎస్ కాగా, ఆయన కన్నా శ్రీధర్‌ రెండేళ్లు సీనియర్‌. శ్రీధర్‌ 1997 బ్యాచ్ అధికారి. శ్రీధర్ స్వస్థలం కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మూడేళ్లు శ్రీధర్ సీఎంవోలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యేక రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు సింగరేణి సీఎండీగా పనిచేశారు. ఈ అనుభవంతో పాటు సీనియర్ అయిన శ్రీధర్ సేవలను వినియోగించుకునేందుకు రేవంత్ రెడ్డి తన పేషీలోకి తీసుకుని ఉంటారని ఒక సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. పద్మశాలి కులానికి (బీసీ)కి అవకాశం కూడా ఇచ్చినట్లు అవుతుందనే లక్ష్యంతో కీలకమైన బాధ్యతలు అప్పగించారనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి.

శేషాద్రి స్వరాష్ట్రం కర్ణాటక. మాణిక్కరాజ్‌ది తమిళనాడు. ఇప్పటి వరకు సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ముఖ్య కార్యదర్శి కే శ్రీనివాస్ రాజును అకస్మాత్తుగా శనివారం తప్పించారు. టీజీ రెరా చైర్మన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ కావడంతో సచివాలయ ఉద్యోగులు ఆశ్యర్యపోయారు. రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారిని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలా నియమిస్తారని గతంలో పలు వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు అక్కడి నుంచి శ్రీనివాస్‌రాజును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సీఎంవో నుంచి బదిలీ చేసిన తరువాత ఇన్వెస్ట్ సీఈవోగా అజిత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. శనివారం హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు.

Jagan Mohan Talluri
jaganmohan.talluri@gmail.com