Farm Plots Fraud | ఫామ్‌ల్యాండ్ పేరుతో నిలువు దోపిడీ.. హైదరాబాద్ చుట్టూ వేల కొద్దీ వెంచర్లు

హైదరాబాద్‌ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రియల్‌ఎస్టేట్‌ వెంచర్లే దర్శనమిస్తుంటాయి. అందులో కొన్ని ఫామ్‌ లాండ్‌ పేరిట అమ్మేస్తున్నారు. ఫామ్‌ లాండ్‌ కాబట్టి పర్మిషన్లు అవసరం లేదని కొన్ని కంపెనీలు చెబుతున్నాయి. వాస్తవానికి ఇలా ఫామ్‌లాండ్‌ వెంచర్‌లో కొనుగోలు చేయవచ్చా?

Farm Plots Fraud | ఫామ్‌ల్యాండ్ పేరుతో నిలువు దోపిడీ.. హైదరాబాద్ చుట్టూ వేల కొద్దీ వెంచర్లు
  • రియ‌ల్ట‌ర్ల‌కు వ‌రంగా స‌ర్కారు నిర్ల‌క్ష్యం
  • పాస్‌బుక్‌తో రైతు భ‌రోసా వస్తుందని అంటక‌డుతున్న రియ‌ల్ట‌ర్లు
  • గుంట‌ల్లో రిజిస్ట్రేష‌న్‌… తమకు సంబంధం లేదంటున్న అధికారులు
  • పుర‌పాల‌క శాఖ‌కు కోట్ల రూపాయల ఫీజులు ఎగ‌వేత‌
  • రెరా అనుమ‌తులు లేకుంటే కొనుగోలుదారుల‌కు న‌ష్టం
  • భ‌విష్య‌త్తులో అనుమ‌తుల‌కు ప‌న్నులు, పెనాల్టీలు!

హైదరాబాద్, విధాత:

Farm Plots Fraud | అంద‌మైన బ్రోచ‌ర్ల ద్వారా అతి త‌క్కువ ధ‌ర‌కే ఫామ్‌ల్యాండ్ అంటూ ఉద‌ర‌గొడుతున్న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు.. ఫ్రీ సైట్ విజిట్లు…. ఆరేళ్ల త‌రువాత ఆదాయం… వీకెండ్ హోమ్స్‌… ఫ్రీ క్ల‌బ్ మెంబ‌ర్‌షిప్‌… అంటూ టెంప్ట్‌ చేస్తారు.. మార్కెటింగ్‌ ప్రధానంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌… లింక్డిన్‌, ఎక్స్ వంటి సోష‌ల్ మీడియా ఖాతాలే ద్వారానే సాగుతూ ఉంటుంది. వీటితో పాటు మార్కెటింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఏజెంట్లు ఉంటారు. క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డం… వ‌చ్చిన వారితో బుకింగ్ పేరుతో ముందుగా రూ. 50 వేలు క‌ట్టించుకోవ‌డ‌మే వీరి ప‌ని! న‌మ్మి వ‌చ్చిన దిగువ, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుంచి కొన్ని రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు రాయ‌ల్‌గా దండుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంట భూమి ల‌క్ష రూపాయలకే వ‌స్తుంద‌ని అత్యాశ‌ప‌డితే భ‌విష్య‌త్తులో ఊహించ‌ని విధంగా ప‌న్నులు, పెనాల్టీలు పుర‌పాల‌క శాఖ‌కు చెల్లించాల్సిన దుస్థితి వ‌స్తుంద‌ని రియ‌ల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ఆశకు పోతే పెనాల్టీలేనా?

చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్క‌డైనా తమకంటూ ఒక జాగా ఉండాలనే ఆశతో ఉంటారు. అందుకోసం అల్లంత దూరం వెళ్లి గుంట‌, రెండు గుంట భూముల‌ను ఫాం ల్యాండ్ వెంచ‌ర్ల‌లో కొనుగోలు చేస్తున్నారు. ఈ వెంచ‌ర్ల‌కు ఎలాంటి అనుమ‌తులు అవ‌స‌రం లేదంటారు రియల్టర్లు. తాము భూమి కొనుక్కున్న వాళ్ల‌కు రిజిస్ట‌ర్ చేసి, ప‌ట్టాదార్ పాస్ పుస్త‌కం ఇస్తున్నామ‌ని, రైతు భ‌రోసా కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని చెపుతున్నారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉన్న‌ది. కానీ…

  • ఈ వెంచ‌ర్ల‌లో ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపాలిటీ ప‌రిధిలోనైతే మున్సిపాలిటీ అనుమ‌తి ఉండాలి.
  • రూర‌ల్ ఏరియాలోనైతే ఈ భూమి గ్రామ కంఠానికి వెలుప‌ల ఉంటుంది కాబ‌ట్టి త‌ప్ప‌ని స‌రిగా డీటీసీపీ అనుమ‌తి తీసుకోవాల్సిందే.
  • అప్పుడు నాలా క‌న్వ‌ర్ష‌న్ చార్జీలతో పాటు ఇంటి ప‌ర్మిష‌న్ చార్జీలు భారీ ఎత్తున చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.
  • పైగా ఇది అనాథ‌రైజ్ లేఅవుట్ కాబ‌ట్టి ఎల్‌ఆర్‌ఎస్‌ వాటి చార్జీలు, లేక పోతే భారీ పెనాల్టీలు పాట్ల కొనుగోలు దారులు ప్ర‌భుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.
  • ఇవ‌న్నీ ఉంటేనే ఆనాడు క‌నీస నిర్మాణానికి అనుమ‌తులు వ‌స్తాయి.
  • ఇప్ప‌డు గుంట భూమి ల‌క్ష‌న్న‌ర‌, రెండు ల‌క్ష‌ల‌కు వ‌స్తుంద‌ని కొనుగోలు చేస్తే ఆ త‌రువాత ఆ ప్లాట్‌ కొనుగోలు చేసిన దాని ధ‌ర కంటే ఎక్కువ‌గా పెనాల్టీలే క‌ట్టాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు.
  • రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో తాను ఇలాగే 15 ఏళ్ల క్రితం త‌క్కువ ధ‌ర‌కు ప్లాటు కొనుగోలు చేశాన‌ని, ఆ త‌రువాత దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి అన్నీ క‌లిపి ల‌క్ష‌ల రూపాయ‌లు అద‌నంగా చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌ని ఒక ఒక కొనుగోలుదారుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాసులవాన

ప్ర‌భుత్వ లోప‌భూయిష్ట విధానాలే రియ‌ల్ట‌ర్ల‌కు కాసుల వ‌ర్షం కురిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత ఇంటి క‌ల నెర‌వేర్చుకోవ‌డం కోసం జీవిత కాలం పోరాటం చేసే మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి ఇలాంటి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల వ‌ల్ల కోలుకోలేని విధంగా మోసపోతున్నాడని అంటున్నారు. అర్బ‌న్ క‌ల్చ‌ర్ పెరిగి, శివారు గ్రామాలు ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో క‌లిసి పోతున్నాయి. దీంతో అక్కడి భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌స్తున్నాయి. దీంతో అతి తక్కువ ధరకే ఫామ్‌లాండ్‌ వెంచర్‌లో ప్లాట్లు అంటూ హైద‌రాబాద్ న‌గ‌రానికి దాదాపు 200 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు రకరకాల వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. శ‌ని, ఆదివారాల‌లో ఫ్రీ ట్రిప్పులంటూ ప్ర‌త్యేకంగా వెహిక‌ల్స్ ఏర్పాటు చేసి సైట్ విజిట్ చేయిస్తున్నారు. మార్కెటింగ్‌ టీమ్స్‌ వారిని కన్వీన్స్‌ చేసి.. అడ్వాన్స్‌ చెల్లించేలా చూసి… ప్లాట్‌ బుక్‌ చేయిస్తుంటారు. అడ్వాన్స్… రేటును బ‌ట్టి రూ. 50 వేల నుంచి రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటున్నది. ఒక్క‌సారి డ‌బ్బులు చెల్లించిన త‌రువాత ఇష్టం ఉన్నా.. లేకున్నా ఆ ప్లాట్ల‌ను మిగ‌తా డ‌బ్బులు చెల్లించి కొనుక్కోవాలంసిందే.

ఫామ్‌లాండ్‌  లే అవుట్లపై ఏదీ పాలసీ?

ఫామ్‌లాండ్‌ ప్లాట్ల వ్యాపారం దశాబ్దకాలంగా య‌థేచ్ఛగా న‌డుస్తున్నా… స‌ర్కారు మాత్రం ఇలాంటి వాటిపై దృష్టి పెట్ట‌లేదు. క‌నీసం ఒక పాల‌సీ త‌యారు చేయ‌డానికి కూడా పూనుకోలేదు. వ్య‌వ‌సాయ భూమిని గుంట‌ల్లో… ప్లాట్లు గ‌జాల్లో రిజిస్ట‌ర్ చేసుకుంటార‌ని చెప్పి చేతులు దులుపుకొంటున్నది. రియ‌ల్ ఎస్టేట్ దోపిడీదారులు స‌రిగ్గా ఈ నిబంధన‌నే త‌మ‌కు కాసులు కురిపించే వరంగా మార్చుకున్నారని రెవెన్యూ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఎంత పెద్ద లే అవుట్ చేసినా… గుంట‌ల‌లో రిజిస్ట్రేష‌న్ చేస్తే ఎలాంటి అనుమ‌తులు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని రెచ్చిపోతున్నారని అంటున్నారు. ఎవ‌రికీ జ‌వాబుదారీ కాదంటూ ఇష్టారీతిన విక్రయాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్జి మండ‌ల కేంద్రానికి సమీపంలో దాదాపు 100 ఎక‌రాల‌లో లేఅవుట్ చేసి విక్ర‌యిస్తున్నారు. ఈ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌కు చెందిన మార్కెటింగ్ ప్ర‌తినిధిని ఫోన్ చేసి అడిగితే తాము వ్య‌వ‌సాయ భూమిని విక్ర‌యిస్తున్నామ‌ని, గుంటల్లో రిజిస్ట‌ర్ చేస్తున్నామని చెప్పారు. ప‌ట్టాదార్ పాస్‌బుక్‌ ఇస్తామని, రైతు భరోసా కూడా వస్తుందని తెలిపారు. అంతేకాదు.. దీనికి తాము ఎలాంటి అనుమ‌తులు తీసుకోవాల్సి అవ‌స‌రం లేద‌ని చెప్పారు. మ‌హ‌బూబ్‌న‌గర్ జిల్లాలో షాద్‌న‌గ‌ర్‌కు దాదాపు 20 కిలోమీట‌ర్ల దూరంలోని ఇంటీరియ‌ర్‌ ప్లేస్‌లో ఫాం ల్యాండ్ పాట్లు విక్ర‌యిస్తున్న ఒక రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ప్ర‌తినిధిని ప్ర‌శ్నించ‌గా తాము గుంట‌ల్లో భూమిని రిజిస్ట్రేష‌న్‌ చేస్తున్ప‌న‌ప్పుడు లే అవుట్ పర్మిష‌న్ అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

పాలసీ ఉంటేనే చర్యలు

వాస్తవానికి ఫామ్‌లాండ్‌ లే అవుట్లపై ఎలాంటి పాలసీ లేదని, గుంటల్లో రిజిస్ట్రేషన్‌ జరిగితే అది వ్యవసాయ భూమికిందే వస్తున్నందున అటువంటివాటిపై తమ అజమాయిషీ ఏమీ ఉండదని పురపాలక శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక సీనియర్‌ అధికారి చెప్పారు. ప్ర‌భుత్వ పాల‌సీ ఉంటేనే తాము చ‌ర్య‌లు తీసుకోగ‌లుగుతామ‌ని ఆయ‌న అన్నారు. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ ఫామ్‌ ల్యాండ్‌ లే అవుట్ల‌పై పాల‌సీ చేయ‌క‌పోవ‌డంతో అటు రాష్ట్ర ఖజానాకు సైతం భారీ గండి పడుతున్నదని అధికారులు అంటున్నారు. పాలసీ ఉంటే నిర్దిష్ట చార్జీలు ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఉంటుందని, తద్వారా రాబడి పెరుగుతుందని అంటున్నారు. గ‌తంలో సిటీకి స‌మీపంలో ఇలా చేసిన లే అవుట్ల‌లో కోనుగోలు చేసిన ప్లాట్ల య‌జ‌మానులు తాము మోస‌పోయామ‌ని గుర్తించ‌డానికే అనేక సంత్స‌రాలు ప‌ట్టింది. ఒక భూమిని మూడు, నాలుగు లే అవుట్లుగా చేసి, విక్ర‌యించిన‌ ఘనులు కూడా ఉన్నారని ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చెబుతున్నారు. ఇలాంటి వాటిల్లో ప్లాటు త‌మ‌కు వ‌స్తుందో రాదో తెలియ‌క అనేక మంది కొనుగోలుదారులు ఆశ‌లు వదులుకున్న ప‌రిస్థితి కూడా ఉంద‌ని తెల్లాపూర్ ఏరియాలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఒక‌రు తెలిపారు.

చార్జీలు లేవు…

వాస్త‌వంగా ఒక భూమిని లేఅవుట్ చేస్తే నాలా క‌న్వ‌ర్ష‌న్ చార్జీలు, లే అవుట్ ప‌రిష్మ‌న్ చార్జీలు చెల్లించాలి. రోడ్లు, పార్క్‌లు, క‌మ్యూనిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌ యాక్టివిటీకోసం భూమిని వ‌ద‌లాల్సి ఉంటుంది. అప్పుడే సంబంధిత విభాగాల నుంచి ప‌ర్మిష‌న్ వ‌స్తుంది. దీంతో కొనుగోలు దారుడికీ భ‌రోసా ఉంటుంది. ఎప్పుడు ఇల్లు క‌ట్టుకోవాల‌న్నా ప‌ర్మిష‌న్ వ‌స్తుంది. ల్యాండ్ విలువ కూడా పెరుగుతుంది. ఇలా కాకుండా ఎలాంటి అనుమ‌తులు లేకుండా ఫాం ల్యాండ్ పేరుతో జ‌రిగే విక్ర‌యాల్లో ఎలాంటి భ‌రోసా, భ‌ద్ర‌త‌ ఉండ‌ద‌ని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వం పాల‌సీ తీసుకు వ‌స్తే… ఇలాంటి వాటికి క‌ట్ట‌డి చేసి ప్ర‌జ‌లు కొనుగోలు చేసే ప్లాట్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించ వ‌చ్చున‌ని చెపుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Narmetta Oil Plam Factory : సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత
గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?
IRCTC Kerala Tour | హైదరాబాద్ నుంచి కేరళ ట్రిప్.. మున్నార్, అలెప్పీ టూర్ రూ.15వేలకే.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ..!
Snakes Unique Trick | ఈ పాముల తెలివి మామూలుగా లేదుగా… వీడియో చూడండి..
snakes take revenge: పాములు పగబడతాయా? నాదస్వరానికి నాట్యం చేస్తాయా? నిజమెంత?